మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
అరచేతిలో పట్టే లైబ్రరీ
సెప్టెంబరు 1, 2021
“కొన్నేళ్ల క్రితం మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో పొందుతామనే ఊహే కష్టంగా ఉండేది.” ఆ మాటలతో మీరు అంగీకరిస్తారా? అవి, 2020 పరిపాలక సభ అప్‌డేట్ #6 లో సహోదరుడు జెఫ్రీ జాక్సన్ ఇచ్చిన ప్రోత్సాహకరమైన ప్రసంగంలోని మాటలు. తర్వాత ఆయనిలా అన్నాడు: “కానీ ఇప్పుడు ఈ మహమ్మారి సమయంలో JW లైబ్రరీ యాప్ వంటివి లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేదా అని అనుకుంటున్నాం. కొన్నేళ్ల నుండి యెహోవా మనల్ని ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికే సిద్ధం చేస్తూ వచ్చాడు.”
యెహోవా మనల్ని ఎలా సిద్ధం చేస్తూ వచ్చాడు? JW లైబ్రరీ యాప్‌ను ఎలా తయారుచేశారు? అది సరిగ్గా పనిచేసేలా చూసుకోవడానికి, దాన్ని మెరుగుపర్చడానికి ఏమేం చేస్తున్నారు?
అప్పటివరకు అలాంటిది లేదు
2013 మే నెలలో, రివైజ్డ్ కొత్త లోక అనువాదం బైబిలు ఉండే ఒక యాప్‌ను తయారుచేయమని పరిపాలక సభ ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని MEPS ప్రోగ్రామింగ్ విభాగాన్ని అడిగింది. అందులో పనిచేసే పాల్ విల్లీస్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “అప్పటివరకూ మనం ఏ యాప్‌స్టోర్‌లోనూ మొబైల్ యాప్‌ను రిలీజ్ చేయలేదు ... మేము ఒక టీమ్‌ని సమకూర్చి, కొన్ని ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టి, ఇతర విభాగాలతో కలిసికట్టుగా పనిచేసి ఒక యాప్‌ని, అందులో ఉండేవాటిని డిజైన్ చేశాం. మేము చాలాసార్లు ప్రార్థించాం. అలా యెహోవా సహాయంతో, కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన వార్షిక కూటంలో యాప్‌ను విడుదల చేశాం!”
తర్వాతి సవాలు ఏంటంటే, యాప్‌ను మరిన్ని ప్రచురణలు ఉండే, మరిన్ని భాషల్లో లభ్యమయ్యే నిజమైన “లైబ్రరీగా” తీర్చిదిద్దడం. 2015 జనవరి కల్లా, ఇంగ్లీషులో ఉన్న మన ప్రస్తుత ప్రచురణల్లో చాలావరకు యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. తర్వాత కేవలం ఆరు నెలలకే ఆ ప్రచురణలను వందల భాషల్లో డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.
అప్పటినుండి మన సహోదరులు యాప్‌ను మెరుగుపరుస్తూనే ఉన్నారు. దానికి వీడియోలు జోడించారు, సంఘ కూటాలకు కావాల్సిన ప్రచురణల్ని-మీడియాను ఒక టాబ్ కింద పెట్టారు, ఒక బైబిలు వచనం నుండి నేరుగా పరిశోధనా పుస్తకం రిఫరెన్సులు తెరవగలిగే వీలు కల్పించారు.
లైబ్రరీ సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం
JW లైబ్రరీని ప్రతీరోజు 80 లక్షల పరికరాల్లో, ప్రతీ నెల కోటి యాభై లక్షల కన్నా ఎక్కువ పరికరాల్లో తెరిచి చూస్తున్నారు! ఆ పరికరాల్లో యాప్ చక్కగా పనిచేయడం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? సహోదరుడు విల్లీస్ ఇలా చెప్తున్నాడు: “ఒక మొబైల్ యాప్‌ను ఎప్పుడూ మెరుగుపరుస్తూ ఉండాలి. మేము ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు జోడిస్తూ వినియోగదారులు యాప్‌ను ఉపయోగించడం సులభం చేస్తున్నాం. డిజిటల్ సేవలు అందించే కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు తరచూ అప్‌డేట్ అవుతూ ఉంటాయి, కాబట్టి వాటితో సరిపోయేలా యాప్‌కి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉండాలి. అలాగే JW లైబ్రరీలో కొత్తకొత్త ప్రచురణలు, రికార్డింగ్‌లు అందుబాటులోకి వస్తుంటాయి, కాబట్టి మన అంతర్గత సాఫ్ట్‌వేర్‌ను కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ సరైన స్థితిలో ఉంచాలి.” అన్ని భాషల్లో కలిపి ప్రస్తుతం JW లైబ్రరీలో 2,00,000 కన్నా ఎక్కువ ప్రచురణలు, 6,00,000 కన్నా ఎక్కువ ఆడియో, వీడియో రికార్డింగ్‌లు అందుబాటులో ఉన్నాయి!
ఇలా నిరంతరం యాప్‌కు మద్దతు అందించాలంటే కేవలం కంప్యూటర్ పరికరాలు ఉంటే సరిపోదు. ఎన్నో సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు కూడా కొనుగోలు చేయాలి. కేవలం ఒక్క లైసెన్స్ కోసం సంవత్సరానికి 1,500 U.S. డాలర్లు (దాదాపు ₹1,10,000) ఖర్చవుతుంది. అంతేకాదు, కొత్త కంప్యూటర్‌లలో, ట్యాబ్‌లలో, ఫోన్‌లలో ఈ యాప్ సాఫీగా పనిచేసేలా చూసుకోవడానికి MEPS ప్రోగ్రామింగ్ వేర్వేరు తయారీదారుల పరికరాల మీద సంవత్సరానికి 10,000 U.S. డాలర్ల కన్నా ఎక్కువ (దాదాపు ₹7,30,000) ఖర్చు చేస్తుంది.
విరాళాలను ఆదా చేస్తున్న డౌన్‌లోడ్‌లు
సాహిత్యాన్ని ముద్రించడానికి, బైండింగ్-షిప్పింగ్ చేయడానికి అయ్యే ఖర్చులను JW లైబ్రరీ చాలావరకు తగ్గించింది. ఉదాహరణకు, ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం అనే చిన్నపుస్తకాన్నే తీసుకోండి. ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2013 ఎడిషన్‌ను దాదాపు 1 కోటి 20 లక్షల కాపీలు ముద్రించాం. 2020 వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారకుల సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగినా, 2020 ఎడిషన్‌ను కేవలం సుమారు 50 లక్షల కాపీలే ముద్రించాం. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు మన సహోదరసహోదరీల్లో చాలామంది దినవచనాన్ని JW లైబ్రరీ యాప్‌లో చదువుతున్నారు. a
“అది నిజంగా వెలకట్టలేనిది”
JW లైబ్రరీ దాన్ని ఉపయోగించేవాళ్లకు లెక్కలేనన్ని విధాల్లో సహాయం చేస్తుంది. కెనడాలో నివసిస్తున్న జెనెవీవ్ ఈ యాప్ వల్ల తాను క్రమంగా అధ్యయనం చేస్తున్నానని చెప్తుంది. ఆమె ఇలా అంటుంది: “నిజం చెప్పాలంటే, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలన్నీ తెచ్చుకొని చూడాల్సివస్తే, బహుశా నేను ప్రతీ ఉదయం అధ్యయనం చేసేదాన్ని కాదేమో. అయితే యాప్ వచ్చాక, నా ట్యాబ్ తీసుకుంటే చాలు, కావాల్సినవన్నీ అందులో ఉంటాయి. ఇలా క్రమంగా అధ్యయనం చేయడం వల్ల నా విశ్వాసం బలపడింది, యెహోవాకు మరింత దగ్గరయ్యాను.”
ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఈ యాప్ నిజంగా సహాయకరంగా ఉంది. అమెరికాకు చెందిన చార్లిన్ ఇలా చెప్పింది: “కోవిడ్-19 లోకమంతా విజృంభించడం వల్ల, నేను ఒక సంవత్సరం పైగా కొత్తగా విడుదలైన మన ప్రచురణల ముద్రిత కాపీ ఏదీ చూడలేదు. కానీ JW లైబ్రరీ వల్ల మేము ఆధ్యాత్మిక ఆహారం పుష్కలంగా తీసుకున్నాం. యెహోవా ప్రేమతో చేసిన ఈ ఏర్పాటు కోసం నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను.”
చాలామంది ఎలా భావిస్తున్నారో ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్న ఫేయ్ అనే సహోదరి మాటల్లో చూడొచ్చు, ఆమె ఇలా చెప్తుంది: “ఒక్క శక్తివంతమైన యాప్ సహాయంతో నేను యెహోవాకు సన్నిహితంగా ఉండగలుగుతున్నాను. నేను ఉదయం మొట్టమొదట దానినే చదువుతాను, పనులు చేసుకుంటూ దానినే వింటాను. మీటింగ్స్ కోసం దానినే అధ్యయనం చేస్తాను. బైబిలు స్టడీ కోసం సిద్ధపడడానికి దానినే ఉపయోగిస్తాను. ఖాళీ దొరికినప్పుడు అందులో ఉన్న వీడియోలు చూస్తాను. లైన్‌లో వేచి ఉన్నప్పుడు అందులో ఉన్న ఆర్టికల్స్‌ను లేదా బైబిలును చదువుతాను. అది నిజంగా వెలకట్టలేనిది.”
ఈ యాప్ పరిచర్యలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఉదాహరణకు, కామెరూన్ దేశంలో ఒక సహోదరి పరిచర్య చేస్తున్నప్పుడు, కొన్ని వారాల క్రితం మరో సహోదరి పరిచర్యలో చూపించిన ఒక లేఖనాన్ని ఉపయోగించాలనుకుంది. కానీ అది బైబిల్లో ఎక్కడుందో ఆమెకు గుర్తురాలేదు. ఆమె ఇలా చెప్తుంది: “సంతోషకరంగా, ఆ లేఖనంలోని కొన్ని మాటలు నాకు గుర్తున్నాయి, దాంతో నేను యాప్ తెరిచి, బైబిలు దగ్గరికి వెళ్లి, ఆ పదాలు వెదికాను. వెంటనే లేఖనం దొరికింది. ఈ యాప్ సహాయంతో నేను ఒక్కోసారి మర్చిపోయే చాలా లేఖనాలను కనుగొంటున్నాను.”
donate.pr418.com లోని పద్ధతుల్ని ఉపయోగిస్తూ మీరు దయతో ఇచ్చిన విరాళాల వల్ల మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీల కోసం JW లైబ్రరీ యాప్‌ను వృద్ధి చేయగలిగాం, దాన్ని మంచి స్థితిలో ఉంచుతూ, మెరుగుపర్చగలుగుతున్నాం. ఉదార స్ఫూర్తి చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
JW లైబ్రరీ మైలురాళ్లు
అక్టోబరు 2013—రివైజ్డ్ కొత్త లోక అనువాదం బైబిలు ఉండే యాప్ విడుదలైంది
జనవరి 2015—ఇంగ్లీషులో ఇతర ప్రచురణలు అందుబాటులోకి వచ్చాయి, తర్వాత వందల భాషల్లో ప్రచురణలు వచ్చాయి
నవంబరు 2015—హైలైట్ చేసే ఫీచర్ జోడించారు
మే 2016—మీటింగ్స్ ట్యాబ్ జోడించారు
మే 2017—నోట్సు రాసుకునే ఫీచర్ వచ్చింది
డిసెంబరు 2017—స్టడీ బైబిల్ కోసం అవసరమైన మార్పులు చేశారు
మార్చి 2019—ఆడియో రికార్డింగ్‌లను డౌన్‌లోడ్ చేసుకునే, వీడియోలను స్ట్రీమ్ చేసే, అలాగే పరిశోధనా పుస్తకం రిఫరెన్సులను చూసే అవకాశం కల్పించారు
జనవరి 2021—ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం కోసం ప్రత్యేక ఫీచర్లు జోడించారు
a JW లైబ్రరీకి చెందిన ప్రతీ డౌన్‌లోడ్‌కి కొంత ఖర్చవుతుంది. ఉదాహరణకు, గత సంవత్సరం JW లైబ్రరీ యాప్ కోసం, అలాగే jw.org నుండి స్ట్రీమింగ్, డౌన్‌లోడ్‌లు అందించడానికి మనం 15 లక్షల కన్నా ఎక్కువ U.S. డాలర్లు (దాదాపు 11 కోట్ల రూపాయలు) ఖర్చు చేశాం. అయినాసరే ప్రచురణలను, సీడీలను, డీవీడీలను తయారుచేసి, రవాణా చేయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే డిజిటల్ ప్రచురణలు, రికార్డింగ్‌లు డౌన్‌లోడ్ చేయడానికి అయ్యే ఖర్చు చాలాచాలా తక్కువ అని చెప్పవచ్చు.