కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే. .

మన మహాగొప్ప ఉపదేశకునికి ఘనత తెచ్చే భవనాలు

మన మహాగొప్ప ఉపదేశకునికి ఘనత తెచ్చే భవనాలు

జూలై 1, 2023

 తన ప్రజలకు బోధించడం అంటే యెహోవాకు చాలా ఇష్టం. అందుకే ఆయన సంస్థ రకరకాల పాఠశాలలను ఏర్పాటు చేసి, యెహోవా సేవను సమర్థవంతంగా చేసేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. అలాంటి ఒక పాఠశాలే, రాజ్య సువార్తికుల కోసం పాఠశాల (SKE). గత కొన్ని సంవత్సరాలుగా, దేవుని సంస్థ కేవలం పాఠశాల సిలబస్‌ మీదే కాకుండా, పాఠశాలలను నిర్వహించే భవనాల మీద కూడా మనసుపెడుతోంది. బోధించడానికి ఉపదేశకులకు, నేర్చుకోవడానికి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే మన సంస్థ ప్రధాన లక్ష్యం. దాన్ని చేరుకోవడానికి మీరు ఇచ్చే విరాళాలు ఎలా సహాయం చేస్తాయో తెలుసా?

ఎక్కువమంది విద్యార్థులు-మరింత మెరుగైన వాతావరణం

 చాలా సంవత్సరాలుగా, వివిధ పాఠశాలలను రాజ్యమందిరాల్లో గానీ, అసెంబ్లీ హాళ్లలో గానీ జరుపుతూ వస్తున్నాం. అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో, ప్రత్యేకంగా పాఠశాలల కోసమే భవనాల్ని నిర్మించడం లేదా మరమ్మతులు చేయడం ఎందుకు జరిగింది? దానికి మూడు కారణాలు ఉన్నాయి.

 సహోదరసహోదరీల అవసరత పెరగడం. “పరిచర్య చేయడానికి ఎక్కువమంది సహోదరసహోదరీలు కావాలని బ్రాంచి ఆఫీసుల నుండి రిపోర్టులు వచ్చాయి. ఉదాహరణకు 2019లో బ్రెజిల్‌ బ్రాంచి, తమ క్షేత్రంలో పనిచేయడానికి ఇంకా 7,600 మంది SKE గ్రాడ్యుయేట్‌లు అవసరం అవుతారని అంచనా వేసింది” అని పరిపాలక సభలోని సర్వీస్‌ కమిటీకి సహాయకునిగా పని చేస్తున్న క్రిస్టఫర్‌ మేవర్‌ వివరించారు. అమెరికా బ్రాంచి కూడా స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ పబ్లిక్‌ విట్నెసింగ్‌, హార్బర్‌ విట్నెసింగ్‌, జైలు సాక్ష్యం చేసేలా ఇతరులకు శిక్షణ ఇవ్వగల అర్హులైన పయినీర్లు చాలామంది కావాలని తెలియజేసింది. లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఇంకా హాస్పిటల్‌ అనుసంధాన కమిటీల్లో పనిచేయడానికి కూడా చాలామంది సహోదరులు అవసరం. SKE పాఠశాలలో శిక్షణ పొందినవాళ్లు వీటికి చక్కగా ఉపయోగపడతారు.

 ఎక్కువమంది అప్లై చేయడం. చాలా బ్రాంచీలకు SKE అప్లికేషన్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి; అయితే భవనాల కొరత వల్ల వాళ్లందర్నీ ఆహ్వానించడం వీలు కాలేదు. ఉదాహరణకు బ్రెజిల్‌ బ్రాంచి క్షేత్రంలో కేవలం ఒక్క సంవత్సరంలోనే 2,500 మంది అప్లై చేసుకున్నారు. కానీ సరిపడా సౌకర్యాలు లేక కేవలం 950 మందినే ఆహ్వానించారు.

 తగిన వసతులు. సాధారణంగా రాజ్యమందిరంలో గానీ, అసెంబ్లీ హాల్లో గానీ ఏర్పాటు చేసిన పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు స్థానిక సహోదరసహోదరీల ఇంట్లో వసతి ఏర్పాటు చేస్తుంటారు. సంవత్సరంలో ఒకసారో రెండుసార్లో పాఠశాలలు నిర్వహించే ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగానే ఉంటుంది. కానీ, కొన్ని ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా చాలా పాఠశాలలు ఏర్పాటు చేస్తూ ఉంటారు; అలాంటప్పుడు అన్ని నెలలు విద్యార్థులకు వసతి ఇవ్వడం స్థానిక సహోదరసహోదరీలకు వీలు అవ్వకపోవచ్చు. అందుకే పాఠశాల జరిగే క్లాస్‌రూమ్‌లకు దగ్గరగా, అది కూడా విద్యార్థులకు అనువుగా ఉండేలా భవనాల్ని కడుతున్నాం.

 ఉపదేశకులకు అలాగే సుమారు 30 మంది విద్యార్థులకు వసతి, వాళ్లకు ఉపయోగపడే ఇంకొన్ని సౌకర్యాలతో ఒక భవనం కట్టాలంటే ఎంచుకున్న ప్రాంతం, మరితర విషయాల ఆధారంగా కొన్ని లక్షల రూపాయలు అవసరమౌతాయి.

పాఠశాల భవనంలో ఏమేమి ఉంటాయి?

 సాధారణంగా, ఎప్పుడూ హడావిడిగా రద్దీగా ఉండే పెద్దపెద్ద సిటీల్లో కాకుండా, ప్రశాంతమైన వాతావరణం, చక్కని రవాణా సౌకర్యాలు ఉండే చోట పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటారు. పాఠశాల ఏర్పాట్లను, బిల్డింగ్‌ను, అందులోని సామాన్లను చూసుకోవడానికి వీలయ్యేలా ఎక్కువమంది ప్రచారకులు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటారు.

 పాఠశాల భవనంలో లైబ్రరీలు, స్టడీ ఏరియాలు, కంప్యూటర్‌లు, ప్రింటర్‌లు, అలాగే ఇతర సామాన్లు ఉంటాయి. ఉపదేశకులు, విద్యార్థులు కలిసి భోజనం చేసేలా ఒక డైనింగ్‌ రూమ్‌ కూడా ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్‌సైజ్‌ చేయడానికి, సరదాగా టైం గడపడానికి కూడా సరిపడా స్థలం ఉంటుంది.

 క్లాస్‌రూమ్‌ డిజైన్‌ పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. న్యూయార్క్‌లోని వార్విక్‌లో ఉన్న వల్డ్‌ వైడ్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ట్రాయ్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్పారు, “విద్యార్థులకు చదువుకోవడం తేలిగ్గా ఉండేలా క్లాస్‌రూమ్స్‌ను డిజైన్‌ చేసే విషయంలో సహాయం చేయమని దైవపరిపాలనా పాఠశాలల డిపార్ట్‌మెంట్‌ను అడిగాం. అందులో పనిచేసే సహోదరులు క్లాస్‌రూమ్‌ ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, లైటింగ్‌ ఎంత ఉండాలి, ఆడియో-వీడియో కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి వంటి వాటికి సంబంధించి మాకు గైడ్‌లైన్స్‌ ఇచ్చారు.” హంగరీలో SKE ఉపదేశకునిగా సేవచేస్తున్న జొల్టాన్‌ అనే బ్రదర్‌ ఆడియో పరికరాల ఏర్పాటు గురించి ఇలా చెప్పారు: “మొదట్లో మాకు మైక్‌లు ఉండేవి కావు కాబట్టి జవాబుల్ని గట్టిగా చెప్పమని విద్యార్థులకు మాటిమాటికి గుర్తు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతీ టేబుల్‌ మీద మైక్‌లు ఏర్పాటు చేశారు, దాంతో సమస్య తీరిపోయింది.”

“యెహోవా ఆహ్వానించిన ప్రత్యేకమైన అతిథులం”

 ఇలాంటి మెరుగైన సౌకర్యాల గురించి ఉపదేశకులు, విద్యార్థులు ఏమంటున్నారో తెలుసా? అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్‌ కోస్ట్‌ ప్రాంతంలో SKE పాఠశాలకు హాజరైన ఏంజెలా ఇలా అంటోంది, “పాఠశాలను చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేశారు. మేం చదువుకోవడం మీదే మనసుపెట్టేలా మా క్లాస్‌రూమ్‌ను, మేం ఉండే గదుల్ని చాలా ఆలోచించి డిజైన్‌ చేశారు.” హంగరీలో ఉపదేశకునిగా సేవచేస్తున్న షాబ అనే బ్రదర్‌, విద్యార్థులతో కలిసి భోంచేయడం చాలా బాగుందని చెప్తూ, అలాంటి సందర్భాల్లోనే “విద్యార్థులు మనసువిప్పి మాట్లాడతారు, వాళ్ల అనుభవాల్ని పంచుకుంటారు. దానివల్ల విద్యార్థుల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. సిలబస్‌లోని విషయాలను వాళ్ల అవసరాలకు తగ్గట్లు బోధించగలుగుతున్నాం” అని అన్నారు.

 మెరుగైన సౌకర్యాలతో కట్టిన పాఠశాల భవనాలు మన “మహాగొప్ప ఉపదేశకుడు” అయిన యెహోవా ఇచ్చిన వరంగా విద్యార్థులు, ఉపదేశకులు భావిస్తున్నారు. (యెషయా 30:20, 21) ఫిలిప్పీన్స్‌లో పాఠశాలకు అనువుగా మార్చిన భవనంలో SKE పాఠశాలకు హాజరైన ఒక సహోదరి ఇలా అంది, “పాఠశాల వాతావరణం చూశాక మేం కేవలం విద్యార్థులం కాదుగానీ, యెహోవా ఆహ్వానించిన ప్రత్యేకమైన అతిథులం అని గుర్తు చేసింది. మేం సంతోషంగా ఉంటూ ఆయన వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.”

 మీరు ఇస్తున్న విరాళాల వల్లే పాఠశాల భవనాల్ని కట్టడం, మరమ్మతులు చేయడం, వాటిని మెయింటైన్‌ చేయడం సాధ్యం అవుతోంది. అందులో ఎక్కువశాతం విరాళం donate.pr418.com ద్వారా వస్తోంది. మీరు చూపిస్తున్న ఉదారతకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌ చెప్తున్నాం.

పాఠశాల ఎంట్రెన్స్‌, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్‌ కోస్ట్‌ ప్రాంతం

యేసు కాలంలోని ఆలయ నమూనా, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్‌ కోస్ట్‌ ప్రాంతంలోని పాఠశాల లాబీ

SKE పాఠశాలకు వస్తున్న ఫోటో, బ్రెజిల్‌

క్లాస్‌ జరుగుతున్నప్పుడు, బ్రెజిల్‌

SKE పాఠశాలకు వస్తున్న ఫోటో, ఫిలిప్పీన్స్‌

డైనింగ్‌ హాలులో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, ఫిలిప్పీన్స్‌