మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . .
స్థానిక ప్రజల మధ్య మత స్వేచ్ఛను సమర్థించడం
మే 1, 2021
లాటిన్ అమెరికాలో నివసించే కోట్లమందిలో తమ స్థానిక భాష, ఆచారాలు పాటించే లక్షలమంది ప్రజలు ఉన్నారు. వాళ్లలో యెహోవాను ఆరాధించే మన తోటి సహోదర సహోదరీలు కూడా ఉన్నారు, వాళ్లు తమ సంస్కృతిని విలువైనదిగా చూస్తారు. ప్రజలు బైబిల్లోని సత్యం నేర్చుకోగలిగేలా వాళ్లు లాటిన్ అమెరికాకు చెందిన 130 కన్నా ఎక్కువ స్థానిక భాషల్లోకి యెహోవాసాక్షుల ప్రచురణల్ని అనువదించి వాటిని పంపిణీ చేస్తారు. a అయినాసరే, యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నందుకు, బైబిలుకు వ్యతిరేకమైన స్థానిక ఆచారాల్ని పాటించనందుకు వాళ్లలో కొందరికి వ్యతిరేకత ఎదురైంది. వాళ్లకు సహాయం చేయడానికి మీ విరాళాలు ఎలా ఉపయోగపడ్డాయి?
సొంత ఊరికి తిరిగి వెళ్లడానికి సహాయం
మెక్సికోలో, జలిస్కో రాష్ట్ర పర్వత ప్రాంతంలోని ఒక వూచోల్ సమాజానికి చెందిన మన సహోదరసహోదరీలు తమ మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న స్థానిక మత ఆచారాల్ని పాటించడానికి గౌరవపూర్వకంగా నిరాకరించారు. b అందుకు అక్కడి సమాజంలోని కొందరికి కోపం వచ్చింది. 2017 డిసెంబరు 4న, ఒక అల్లరిమూక కొంతమంది యెహోవాసాక్షుల మీద, వాళ్లతో పాటు ఉన్న ఇతరుల మీద దాడి చేసింది. ఆ అల్లరిమూక వాళ్లను సమాజం నుండి బలవంతంగా వెళ్లగొట్టి, వాళ్ల ఆస్తిని ధ్వంసం చేసి, ఎవరైనా తిరిగి రావడానికి ప్రయత్నిస్తే చంపుతామని బెదిరించింది.
పక్కనే వేరే పట్టణాల్లో ఉన్న యెహోవాసాక్షులు ఆ సహోదరసహోదరీలకు అప్పటికప్పుడు కావల్సిన వాటిని ఇచ్చి వాళ్ల బాగోగులు చూసుకున్నారు. కానీ ఏం చేస్తే వాళ్లు తమ సొంత ప్రాంతానికి తిరిగి వెళ్లగలరు? అగస్టీన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “లాయర్‌ను పెట్టుకోవడానికి మా దగ్గర సరిపడా డబ్బులు లేవు, న్యాయపరమైన సలహా అడగడానికి ఎక్కడికి వెళ్లాలో కూడా మాకు తెలీదు.”
మన సహోదరుల ఆరాధనా స్వేచ్ఛ మీద దాడి జరిగింది కాబట్టి సెంట్రల్ అమెరికా బ్రాంచి వెంటనే చర్య తీసుకుంది. ముందుగా వాళ్లు, ఆ నేరాల గురించి పరిశోధన చేయమని స్థానిక అధికారుల్ని అడిగారు. తర్వాత వాళ్లు, ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని లీగల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేసేలా, అలాగే వూచెల్ సమాజానికి చెందిన మన సహోదరసహోదరీల తరఫున కేసు ఫైల్ చేసేలా యెహోవాసాక్షుల పరిపాలక సభకు చెందిన కోఆర్డినేటర్స్ కమిటీ నుండి అనుమతి పొందారు. చివరికి ఆ కేసు మెక్సికోకు చెందిన అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి అంటే సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్లింది.
ఒక అంతర్జాతీయ లాయర్ల బృందం ఒక స్పష్టమైన వాదనను సిద్ధం చేశారు. ఎలాగైతే స్థానిక సమాజాల సంస్కృతిని ఇతరులు ఖచ్చితంగా గౌరవించాలో, అలాగే ఆ సమాజాలు కూడా తమ సభ్యులందరి స్వేచ్ఛను ఖచ్చితంగా గౌరవించాలి, కాపాడాలి అని అందులో స్పష్టంగా వివరించారు. ప్రజలు ఎక్కడ జీవించినా సరే వాళ్లకంటూ కొన్ని హక్కులు ఉంటాయి.
2020 జూలై 8న సుప్రీం కోర్టు యెహోవాసాక్షులకు అనుకూలంగా ఎకగ్రీవంగా తీర్పు చెప్పింది. తమ ఊరు నుండి వెళ్లగొట్టబడిన వాళ్లందర్నీ తిరిగి అక్కడికి వెళ్లనివ్వాలని ఆదేశించింది. మనం ముందు చూసిన అగస్టీన్ అనే సహోదరుడు తనకు, మిగతావాళ్లకు ఎలా అనిపించిందో చెప్తూ ఇలా అన్నాడు, “సహోదరులు మాకోసం చేసినదానికి మేము ఎంతో కృతజ్ఞులం, మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు మాకు సహాయం చేయకపోతే, మేము ఏమీ చేయలేకపోయేవాళ్లం.”
“ఇంత కొంచెం మంది కోసం అంత ఎక్కువ సహాయం”
ఓటవలో లోయకు చెందిన ఎంతోమంది స్థానిక ప్రజలు ఈక్వెడార్‌లోని సాన్ హ్వాన్ డే ఈలూమాన్ అనే గ్రామంలో నివసిస్తారు. అక్కడ కూడా మన సహోదరులకు వ్యతిరేకత ఎదురైంది. 2014 లో వాళ్లు అవసరమైన అన్ని అనుమతులు పొంది, రాజ్యమందిరం కట్టడం మొదలుపెట్టారు. అయితే ఒక చర్చీ పాస్టరు 100 కన్నా ఎక్కువమంది ఉన్న గుంపును వెంటబెట్టుకొని వచ్చి బలవంతంగా నిర్మాణ పనిని ఆపుచేశాడు. తర్వాత ఆ సమాజంవాళ్లు యెహోవాసాక్షుల్ని ఆరాధన కోసం సమకూడడం ఆపేయమని ఆజ్ఞాపించారు.
ఆరాధించే విషయంలో ఆ సంఘానికి ఉన్న స్వేచ్ఛను అడ్డుకున్నారు కాబట్టి వాళ్లను సమర్థించడానికి ఈక్వెడార్ బ్రాంచిలోని, అలాగే ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని లీగల్ డిపార్ట్‌మెంట్‌లు కలిసి పనిచేశాయి. మన సహోదరులు కోర్టులో కేసు వేశారు. దాంతో ఆ సమాజంవాళ్లు సహోదరుల్ని వ్యతిరేకించడం ఆపేసి మళ్లీ కూటాలు జరుపుకోవడానికి, రాజ్యమందిర నిర్మాణం పూర్తిచేయడానికి అనుమతించారు. అయితే ముందుముందు కూడా మన సహోదరుల హక్కుల్ని కాపాడడం కోసం, మన ప్రతినిధులు ఒక ప్రాథమిక విషయం మీద తీర్పు చెప్పమని మరింత ఉన్నతమైన న్యాయస్థానాల్ని అడిగారు. అదేంటంటే, స్థానిక సమాజాలు అంతర్జాతీయ మానవ హక్కుల్ని గౌరవించాలా లేదా?
2020 జూలై 16న, ఆ దేశంలోని అత్యున్నత కోర్టు అయిన కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ ఈక్వెడార్ కేసును విచారించింది. ఈక్వెడార్‌లో లాయర్లుగా ఉన్న సహోదరులు అక్కడి సంఘానికి ప్రాతినిధ్యం వహించారు. దాంతోపాటు, ఎంతో అనుభవంగల అంతర్జాతీయ లాయర్లు అయిన మన సహోదరులు నలుగురు కూడా తమ వాదన వినిపించారు. కోవిడ్ కారణంగా వాళ్లు వేర్వేరు దేశాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షులకు ప్రాతినిధ్యం వహించే లీగల్ టీమ్ తమ వాదనలు వినిపించేలా ఒక కోర్టు అనుమతించడం ఇదే మొదటిసారి. c కేవలం స్థానిక సమాజంలో భాగంగా ఉన్నంత మాత్రాన అక్కడి వ్యక్తులు తమ మానవ హక్కుల్ని వదులుకోరు అనే అంతర్జాతీయ లీగల్ అధికారుల మాటల్ని ఆ టీమ్‌వాళ్లు ఎత్తి చెప్పారు.
ఓటవలో లోయకు చెందిన మన సహోదరులు కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్ ఇచ్చే తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా తమకు దొరికిన సహాయం విషయంలో వాళ్లు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. ఈలూమాన్ కిచువా సంఘంలో పెద్దగా సేవచేస్తున్న సీజార్ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు, “ఇంత కొంచెం మంది కోసం అంత ఎక్కువ సహాయం కేవలం యెహోవా మాత్రమే తన సంస్థ ద్వారా చేయగలడు.”
ఈ విషయంలో వాదించిన లాయర్లు అందరూ యెహోవాసాక్షులే, లీగల్ విషయాల్లో తమకున్న పరిజ్ఞానాన్ని వాళ్లు ఉచితంగా పంచుకుంటారు. కానీ కేసులు ఫైల్ చేయడానికి, వాటి కోసం సిద్ధపడడానికి, కోర్టులో వాదించడానికి సమయం కేటాయించాలి, డబ్బు కూడా ఖర్చౌతుంది. మన లాయర్లు, ఇతర సహోదరులు అలా వాదనలు సిద్ధం చేయడానికి 380 కన్నా ఎక్కువ గంటలు, మెక్సికన్ భాషలోకి డాక్యుమెంట్లను అనువదించడానికి మరో 240 గంటలు వెచ్చించారు. అలాగే ఈక్వెడార్ కేసు కోసం, దేశదేశాలకు చెందిన దాదాపు 40 మంది లాయర్లు వందల గంటలు వెచ్చించారు. మరి, మన సహోదరుల తరఫున వాదించడానికి అవసరమైన డబ్బు ఎలా వచ్చింది? donate.pr418.comలో వివరించిన పద్ధతుల ద్వారా మీరు ఇచ్చిన విరాళాలే సహాయం చేశాయి. మీ ఉదార స్ఫూర్తికి కృతజ్ఞతలు.
a యెహోవాసాక్షులు లాటిన్ అమెరికాలో మాట్లాడే ఇంకా ఎన్నో భాషల్లోకి, కేవలం ఒక్క ప్రాంతంలోని వాళ్లు మాత్రమే మాట్లాడే కొన్ని సంజ్ఞా భాషల్లోకి అనువదిస్తారు.
b వూచోల్ ప్రజల్ని వీహారీటారీ అని కూడా అంటారు, వాళ్ల భాషను తరచూ వీహారీక అని పిలుస్తారు.
c మన ప్రపంచవ్యాప్త సంస్థ ఆ కేసులో భాగం కాకపోయినా, న్యాయమూర్తులు అమీకస్ క్యురీ లేదా “నిస్వార్థంగా కోర్టుకు సలహాలిచ్చే వ్యక్తి” (“friend of the court”) అనే పేరు కింద మన సహోదరుల్ని కోర్టు ముందు హాజరవ్వడానికి అనుమతించారు.