కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...

2022లో విపత్తు సహాయక చర్యలు—ప్రేమను చేతల్లో చూపించిన సహోదరులు

2022లో విపత్తు సహాయక చర్యలు—ప్రేమను చేతల్లో చూపించిన సహోదరులు

జనవరి 1, 2023

 మన కాలం యుద్ధాలు, భూకంపాలు, కరువులు, పెద్దపెద్ద అంటువ్యాధులు, ‘భయంకరమైన దృశ్యాలతో’ నిండిపోతుందని బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:10, 11) ఆ ప్రవచనంలోని మాటలు నిజమవ్వడాన్ని మనం 2022 సేవా సంవత్సరంలో a కళ్లారా చూశాం. ఉదాహరణకు, యుక్రెయిన్‌లో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న యుద్ధం వల్ల ఎన్నో లక్షలమంది ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ప్రపంచంలో చాలా ప్రాంతాలవాళ్లు కోవిడ్‌ ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నించారు. దానికి తోడు, లక్షలమంది ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో అగచాట్లు పడాల్సివచ్చింది. ఉదాహరణకు, హయిటీలో భూకంపాలు వచ్చాయి. అలాగే సెంట్రల్‌ అమెరికా, ఫిలిప్పీన్స్‌, ఆఫ్రికా లాంటి దేశాల్లో భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. అక్కడున్న బాధితులకు యెహోవాసాక్షులు ఎలా సహాయం చేశారు?

 2022 సేవా సంవత్సరంలో జరిగిన 200 విపత్తుల్లో బాధితులుగా ఉన్నవాళ్లకు అవసరమైన సహాయాన్ని మన సంస్థ అందించింది. దానికోసం దాదాపు 1,20,00,000 డాలర్లను (100 కోట్ల రూపాయలు) ఖర్చుపెట్టింది. అయితే రెండు విపత్తుల బారినపడిన వాళ్లకు మన విరాళాలు ఎలా సహాయం చేశాయో ఇప్పుడు చూద్దాం.

హయిటీలో భూకంపాలు

 2021, ఆగష్టు 14న, 7.2 తీవ్రతతో వచ్చిన భూకంపం దక్షిణ హయిటీని కుదిపేసింది. విచారకరంగా దానివల్ల ఇద్దరు సహోదరీలు, ఒక సహోదరుడు చనిపోయారు. బతికి బయటపడినవాళ్లు, జరిగిన నష్టం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కృంగిపోయారు. స్టెఫన్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నగరంలో ఎంతమంది చనిపోయారంటే, దాదాపు రెండు నెలల పాటు ప్రతీ వారం అంత్యక్రియలు జరుగుతూ ఉండేవి.” ఎలియేజర్‌ అనే ఇంకో సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “యెహోవాసాక్షుల్లో చాలామందికి ఉండడానికి ఒక చోటు గానీ, బట్టలు గానీ, చెప్పులు గానీ, కనీస అవసరాలు తీర్చుకోవడానికి గానీ ఎవీ లేవు. అవి చాలదన్నట్టు, తర్వాత కొన్ని నెలల పాటు వచ్చిన చిన్నచిన్న భూకంపాలు వల్ల అందరూ బిక్కుబిక్కుమంటూ జీవించారు.”

 వాళ్లకు సహాయం చేయడానికి మన సంస్థ వెంటనే స్పందించింది. హయిటీ బ్రాంచ్‌ దాదాపు 53 టన్నుల ఆహారాన్ని, టెంట్లని, టార్పాలిన్‌లని, పరుపుల్ని అలాగే ఫోన్ల కోసం సోలార్‌ ఛార్జర్‌ల్ని పంపించింది. అంతేకాదు 2022 సేవా సంవత్సరంలో 100 కన్నా ఎక్కువ ఇళ్లను తిరిగి కట్టడం లేదా రిపేర్‌ చేయడం జరిగింది. ఆ పనులన్నిటి కోసం దాదాపు 10,00,000 డాలర్లు (8 కోట్ల రూపాయలు) ఖర్చు అయ్యింది.తమకు అందిన సహాయాన్ని బట్టి సహోదర సహోదరీలు కృతజ్ఞతతో నిండిపోయారు.

హయిటీలో ఆహారాన్ని అందిస్తున్న సహోదరులు

 లారెట్‌ ఇలా చెప్తుంది: “ఈ భూకంపం వల్ల మా ఇల్లు, మా వ్యాపారం పూర్తిగా నాశనమయ్యాయి. కనీసం తినడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. కానీ యెహోవా సంస్థ మాకు అండగా నిలబడి కావల్సిన వాటన్నిటినీ అందించింది.” మిషెలిన్‌ ఇలా చెప్తున్నారు: “భూకంపం వల్ల నేను, మా ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న గుడిసె బాగా దెబ్బతింది. ఇక ప్రార్థన చేయడం తప్ప నాకు ఇంకో మార్గం ఏమీ లేదు. యెహోవా తన సంస్థ ద్వారా మాకు జవాబిచ్చాడు. మేము ఇప్పుడు గట్టిగా, స్థిరంగా ఉండే ఇంట్లో ఉంటున్నాం. యెహోవా పట్ల నాకున్న కృతజ్ఞతను చూపించడానికి నేను చేయగలిగిందంతా చేయాలని నిశ్చయించుకున్నాను.”

 మనం చేస్తున్న సహాయక చర్యలను స్థానిక అధికారులు కూడా గుర్తించారు. లజీల్‌ సిటీ హాల్‌ అధ్యక్షుడు ఇలా చెప్తున్నాడు: ‘మీరు సహాయం చేయడానికి ఇంత త్వరగా స్పందించినందుకు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నాం. మీరు అధికారులకు నిజంగా ఎంతో గౌరవాన్ని చూపిస్తున్నారు. మీరు ఇదంతా డబ్బు కోసం కాదుగానీ ప్రజల మీద ప్రేమతో, వాళ్లకు సహాయం చేయాలనే ఆసక్తితో చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషంగా ఉంది.’

మొజాంబిక్‌, మలావీపై విరుచుకుపడిన ఆనా తుఫాను

 2022, జనవరి 24న ఆనా అనే తుఫాను మొజాంబిక్‌లో తీరం దాటి పశ్చిమాన ఉన్న మలావీ వైపు వెళ్లింది. దానివల్ల కుండపోతగా వర్షాలు పడ్డాయి. అలాగే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కరెంటు తీగలు పడిపోయాయి, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి, ఆ ప్రాంతమంతా వరదలతో మునిగిపోయింది.

 మలావీ అలాగే మొజాంబిక్‌లో ఉంటున్న 30,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఈ తుఫాను బారినపడ్డారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక సహోదరుడైన చాల్స్‌ ఇలా చెప్తున్నాడు: “మన సహోదర సహోదరీలు ఎంతగా బాధపడుతున్నారో, ఎంతగా నష్టపోయారో చూసినప్పుడు అస్సలు తట్టుకోలేకపోయాను, ఏంచేయాలో తోచలేదు.” చాలామంది తమ ఇళ్లను కోల్పోయారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, వాళ్లు అప్పటివరకు నిల్వచేసుకున్న ఆహారం, పంట పొలాలు కూడా కొట్టుకుపోయాయి. విషాదకరంగా, ఒక సహోదరుని భార్య, ఆయన ఇద్దరు కూతుళ్లు వెళ్తున్న లైఫ్‌బోట్‌ తిరగబడిపోవడంతో వాళ్లు తమ ప్రాణాల్ని కోల్పోయారు.

మొజాంబిక్‌లో పాడైపోయిన యెహోవాసాక్షుల ఇళ్లు

తిరిగి కట్టిన ఇల్లు

 అది చాలా భయంకరమైన తుఫాను. దానివల్ల రెండు నదులు పొంగిపోయి, చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. మలావీలోని చాలోలో, ఒంటి గంటకి బ్రదర్‌ సెన్గెరెడో కుటుంబం వేగంగా పారుతున్న నీళ్ల శబ్దం విన్నారు. వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బ్రదర్‌ సెన్గెరెడో ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది మంచిదైంది, ఎందుకంటే తర్వాత వరద వల్ల వాళ్ల ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు పాడైపోయాయి, కొన్ని కొట్టుకుపోయాయి. ఆ కుటుంబం రాజ్యమందిరంలో తలదాచుకోవాలని నిర్ణయించుకుంది. సాధారణంగా వాళ్ల ఇంటి నుంచి రాజ్యమందిరానికి వెళ్లడానికి 30 నిమిషాలే పట్టేది. కానీ ఈసారి వీళ్లకు 2 గంటలు పట్టింది. తడిసిపోయి, అలసిపోయి వచ్చినా వాళ్లు క్షేమంగా చేరుకున్నారు.

 మలావీ, మొజాంబిక్‌ బ్రాంచీలు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. బాధితులకు ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని, వాళ్లను ప్రోత్సహించి, ఆధ్యాత్మికంగా సహాయం చేయమని ఆ బ్రాంచీలు ప్రాంతీయ పర్యవేక్షకులకు, పెద్దలకు చెప్పాయి. అలాగే కొన్ని విపత్తు సహాయక కమిటీలను (DRCలను) కూడా ఏర్పాటు చేశాయి. అందులో పనిచేస్తున్న వాళ్లు సహోదరులకు కావల్సిన ఆహారాన్ని, ఇతర అవసరాల్ని వెంటవెంటనే అందించారు. దానికోసం దాదాపు 33,000 డాలర్లు (27 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయి, అలాగే ఇళ్లను తిరిగి కట్టి, రిపేర్‌ చేసే పనికి దాదాపు 3,00,000 డాలర్లు (2 కోట్ల రూపాయలు) ఖర్చు అయ్యాయి.

 DRCలు డబ్బుల్ని చాలా తెలివిగా ఉపయోగించారు. రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల జాగ్రత్తగా ఖర్చు పెట్టడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు, విపత్తు సహాయక పనులు మొదలుపెట్టిన మొదటి 7 నెలల్లో, మలావీలోని ప్రజలు రోజూ ఉపయోగించే మొక్కజొన్న పిండి ఖరీదు దాదాపు 70 శాతం పెరిగిపోయింది. పెట్రోల్‌ రేటు కూడా ఆకాశాన్నంటింది. అందుకే డబ్బును ఆదా చేయడానికి సహోదరులు ఆహారాన్ని, నిర్మాణ పనులకు అవసరమైన సామాగ్రిని స్థానిక షాపుల్లో ఎక్కువ మొత్తంలో కొన్నారు. దానివల్ల వాళ్లకు చాలా డిస్కౌంట్‌ వచ్చింది, రవాణా ఖర్చులు కూడా తప్పాయి.సహాయక చర్యలు యెహోవా ప్రజల హృదయాల్ని తాకాయి.

 మొజాంబిక్‌లో ఉంటున్న ఫెలిష్‌బెర్టో అనే సహోదరుడు ఇలా అంటున్నాడు: “ఇంత సహాయం చేసే సంస్థను నేను ఎక్కడా చూడలేదు. నిర్మాణ పనికి కావల్సిన సామాగ్రిని, పనివాళ్లను, రవాణాను, ఆహారాన్ని అలాగే మంచి నడిపింపును సంస్థ ఇచ్చింది. ఇవన్నీ యోహాను 13:34, 35 లో యేసు చెప్పిన సహోదర ప్రేమకు ఒక తిరుగులేని నిదర్శనం.” మలావీకి చెందిన విధవరాలైన ఎస్టే అనే సహోదరి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆమె ఇలా చెప్తుంది: “నేను నిరాశలో మునిగిపోయాను. ఎందుకంటే ఇంకో ఇల్లు కట్టుకునేంత డబ్బు నా దగ్గర లేదు. కానీ సహోదరులు వచ్చి నాకోసం ఒక ఇల్లు కట్టి ఇచ్చారు. నాకు పరదైసులో ఉన్నట్టే అనిపించింది.”

 మనం కొత్త లోకానికి చేరువయ్యే కొద్దీ ఇలాంటి ఎన్నో విపత్తుల్ని చూడాల్సి రావచ్చు. (మత్తయి 24:7, 8) అయితే, మీరిచ్చే ఉదారమైన విరాళాల వల్ల యెహోవా ప్రజలు సమయానికి అవసరమైన సహాయాన్ని పొందుతారనే బలమైన నమ్మకంతో ఉన్నాం. మీరు ఎలా విరాళం ఇవ్వవచ్చో donate.pr418.comలో తెలుసుకోవచ్చు. మీ ఉదార స్ఫూర్తికి కృతజ్ఞతలు!

a 2022 సేవా సంవత్సరం, 2021 సెప్టెంబరు 1న మొదలై 2022 ఆగష్టు 31న ముగుస్తుంది.