కంటెంట్‌కు వెళ్లు

ఫిబ్రవరి 4, 2022
అజర్‌బైజాన్‌

ప్రకటనా పనిలో పాల్గొన్నందుకు అజర్‌బైజాన్‌లో అరెస్టు అయిన సహోదరీల హక్కుల్ని సమర్థించిన UN మానవ హక్కుల కమిటీ

ప్రకటనా పనిలో పాల్గొన్నందుకు అజర్‌బైజాన్‌లో అరెస్టు అయిన సహోదరీల హక్కుల్ని సమర్థించిన UN మానవ హక్కుల కమిటీ

అజర్‌బైజాన్‌లో కొంతమంది సహోదరీలు బైబిలు విషయాల్ని ఇతరులతో పంచుకునే పనిలో పాల్గొన్నందుకు అరెస్టు అయ్యారు. ఆ సహోదరీలపై పెట్టిన కేసుల విషయంలో 2021, నవంబరు అలాగే డిసెంబరులో యునైటెడ్‌ నేషన్స్‌ మానవ హక్కుల కమిటీ (CCPR) రెండు తీర్పుల్ని ఇచ్చింది. యెహోవాసాక్షులు తమ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడే విషయంలో వాళ్లకున్న హక్కుల్ని ఆ తీర్పులు సమర్థించాయి.

2021, నవంబరు 5న CCPR మనకు అనుకూలంగా ఒక తీర్పుని ఇచ్చింది. ప్రకటనా పనిలో పాల్గొనే విషయంలో మతనత్‌ గుర్బానోవా అలాగే సాదత్‌ మురదసిలోవా అనే ఇద్దరు సహోదరీలకున్న హక్కుని అది కాపాడింది. 2014, నవంబరులో ఎవరో ఇచ్చిన కంప్లేంట్‌ వల్ల అధికారులు వాళ్లని అరెస్టు చేశారు. ఆ సహోదరీలిద్దరికి తలా 1,500 అజర్‌బైజాని మనత్‌ల (ఇంచుమించు రూ. 72,000) జరిమానా విధించారు. ఇలా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి కారణాలు చెప్పి భవిష్యత్తులో ఎవర్నీ అరెస్టు చేయకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని CCPR అజర్‌బైజాన్‌ను ఆదేశించింది.

అక్కాచెల్లెళ్లు అయిన మతనత్‌, సాదత్‌ ఇలా అంటున్నారు: “మమ్మల్ని పోలీసులు, జడ్జి భయపెట్టాలని చూశారు కానీ మేం భయపడలేదు! చెప్పాలంటే, మా విశ్వాసం ఇంకా బలపడింది. మనల్ని కాపాడకుండా యెహోవాను ఏదీ అడ్డుకోదని, తన సేవకుల్ని ఎప్పుడు ఎలా కాపాడాలో ఆయనకు బాగా తెలుసని యెహోవా మరోసారి నిరూపించాడు.”

ఇలాంటి మరో తీర్పును CCPR 2021, డిసెంబరు 21న ఇచ్చింది. “తమ సొంత ఊరిలో కాకుండా వేరే ప్రాంతంలో మత సంబంధమైన పనులు చేస్తున్నందుకు” జేరన్‌ అజిజోవా అలాగే గుల్నాజ్‌ ఇస్రాఫీలోవా అనే ఇద్దరు సహోదరీల్ని అజర్‌బైజాన్‌ పోలీసులు అరెస్టు చేసి చట్టాన్ని మీరారని CCPR చెప్పింది. ఆ సహోదరీలు తమ నమ్మకాల్ని ఇతరులతో పంచుకోవడం చట్టవిరుద్ధం కాదని కూడా నిర్ధారించింది.

2016, నవంబరులో జేరన్‌, గుల్నాజ్‌లు తమ స్నేహితుల్ని కలవడానికి అజర్‌బైజాన్‌లోని గోరంబోయ్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వాళ్లు ఇతరులతో బైబిలు విషయాలు పంచుకున్నారు. అది చూసిన ఒక స్థానిక అధికారి పోలీసు కంప్లేంట్‌ ఇవ్వడంతో ఆ సహోదరీలను అరెస్టు చేశారు. తర్వాత జరిగిన విచారణలో జడ్జి, మన సహోదరీలకు గూఢచారులనే నేరాన్ని అంటగట్టి, 2,000 అజర్‌బైజాని మనత్‌ల (ఇంచుమించు రూ. 96,000) జరిమానా విధించారు. తర్వాత ఒక అప్పీల్‌ కోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది. పైన చెప్పినట్టు మన సహోదరీలు CCPRకు అప్పీల్‌ చేసుకున్నది అప్పుడే.

మనకు అనుకూలంగా వచ్చిన ఇలాంటి తీర్పుల్ని చూసినప్పుడు మన సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే ప్రకటించే విషయంలో మన స్వేచ్ఛకు ఉన్న అడ్డురాళ్లను అవి తొలగిస్తాయి. ధైర్యంగా మంచివార్తను ప్రకటించే విషయంలో ఈ సహోదరీలు మనకు ఆదర్శంగా ఉన్నారు. వీళ్ల సంతోషంలో పాలుపంచుకోవడం నిజంగా ఓ వరం!—మత్తయి 10:18.