కంటెంట్‌కు వెళ్లు

మే 28, 2021
అజర్‌బైజాన్‌

మీటింగ్‌లను జరుపుకునే మన హక్కును UN మానవ హక్కుల కమిటీ కాపాడింది

మీటింగ్‌లను జరుపుకునే మన హక్కును UN మానవ హక్కుల కమిటీ కాపాడింది

2021, ఏప్రిల్‌ 26న అజీజ్‌ అలియేవ్‌, ఇతరులు వర్సెస్‌ అజర్‌బైజాన్‌ కేసు విషయంలో UN మానవ హక్కుల కమిటీ ఒక ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. ఆ కమిటీ అజర్‌బైజాన్‌లోని యెహోవాసాక్షులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుల్లో ఇది మూడోది. మనం ప్రశాంతంగా ఆరాధించుకునే హక్కుని ఈ తీర్పు సమర్థించింది.

ఇది జగటాల ప్రాంతంలోని అలియాబాద్‌లో, పోలీసులు చట్టవిరుద్ధంగా చేసిన రేయిడ్‌కు సంబంధించిన కేసు. 2013, సెప్టెంబరు 21న అజీజ్‌ అలియేవ్‌ సహోదరుని ఇంట్లో కొంతమంది యెహోవాసాక్షులు మీటింగ్‌ జరుపుకుంటున్నారు. అప్పుడే, పోలీసులు ఇంట్లోకి చొరబడి సోదా చేసి, సహోదర సహోదరీల్ని బెదిరించారు. అక్కడున్న ప్రచురణల్ని, వైద్యపరమైన-చట్టపరమైన డాక్యుమెంట్లని, డబ్బుల్ని తీసేసుకున్నారు. సహోదర సహోదరీలందర్నీ పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. అయితే దారిలో సిస్టర్‌ హవ్వ ఎలియేవాకి ఫిట్స్‌ వచ్చి స్పృహ కోల్పోయింది. దాంతో పోలీసులు ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆమె తేరుకున్న వెంటనే, మళ్లీ పోలీసు స్టేషన్‌కి విచారణ కోసం తీసుకెళ్లారు.

ఆ సహోదర సహోదరీల్లో చాలామందికి జగటాల జిల్లా కోర్టు 1,500 అజర్‌బైజానీ మనత్‌ల (ఇంచుమించు రూ. 1,40,000/-) జరిమానా విధించింది. షేకీ ప్రాంతంలోని అప్పీలు కోర్టు కూడా ఆ అన్యాయమైన తీర్పుని సమర్థించింది. అజర్‌బైజాన్‌లో మన సహోదర సహోదరీలు చట్టపరంగా చేయగలిగిందంతా చేశారు కానీ, ఫలితం లేకపోవడంతో UN మానవ హక్కుల కమిటీకి అప్పీలు చేసుకున్నారు.

అజర్‌బైజాన్‌ అధికారులు మన సహోదరులకున్న మత స్వేచ్ఛా హక్కును పట్టించుకోకుండా అన్యాయంగా అరెస్టు చేసి శిక్షించారని కమిటీ తీర్పిచ్చింది. అధికారులు, పోలీసులు యెహోవాసాక్షుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి, వాళ్లని జైల్లో వేస్తామని బెదిరిస్తూ అవమానించి, వాళ్ల మతాన్ని తప్పుపట్టారు, కానీ వాళ్లు చేసుకుంటున్న మత సంబంధమైన కార్యక్రమాలు లేదా ప్రచురణలు ఏ విధంగా హాని కలిగిస్తున్నాయో చెప్పకుండా చర్య తీసుకున్నారని కమిటీ చెప్పింది. అందుకే మన సహోదరులకి అజర్‌బైజాన్‌ నష్టపరిహారం చెల్లించాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్తూ తమ దేశ చట్టాల్ని, చట్టపరమైన చర్యల్ని తిరిగి పరిశీలించాలని ఆదేశించింది.

గత కొన్ని సంవత్సరాలుగా అజర్‌బైజాన్‌లో మన సహోదరులు స్వేచ్ఛగా కలుసుకుని ఆరాధించుకోవడాన్ని చూసి మేమెంతో సంతోషిస్తున్నాం. ప్రస్తుత కాలంలోని కోర్టుల్లో మన ఆరాధన చట్టబద్ధంగా నిలదోక్కుకుంటున్నందుకు మనం యెహోవాకు ఎంత కృతజ్ఞులం!—ఫిలిప్పీయులు 1:7.