కంటెంట్‌కు వెళ్లు

ఎడమ: అమెరికా, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో తొమ్మిది రోజులపాటు జరిగిన చారిత్రక సమావేశంలో బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌, రాజుని తన రాజ్యాన్ని ప్రకటించమని ఇచ్చిన పిలుపును వేలమంది విన్నారు. కుడి: సమావేశంలో బయట కూర్చున్న వాళ్లకు తన మాటలు వినబడేలా బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ మైకులో మాట్లాడుతున్నాడు

అక్టోబరు 6, 2022
అమెరికా

సీడార్‌ పాయింట్‌లో సమావేశం జరిగి 100 ఏళ్లు!

మన మ్యూజియంలోని ఒక కొత్త భాగం ఈ చారిత్రక సమావేశాన్ని గుర్తుచేస్తుంది

సీడార్‌ పాయింట్‌లో సమావేశం జరిగి 100 ఏళ్లు!

మన ఆధునిక చరిత్రలో గుర్తుండిపోయే ఒక సంఘటన, 100 సంవత్సరాల క్రితం యెహోవాసాక్షులు జరుపుకున్న ఒక సమావేశం. అది 1922, సెప్టెంబరు 5-13 తేదీల్లో అమెరికా, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో తొమ్మిది రోజులపాటు జరిగింది. ఆ సమావేశానికి అమెరికా, కెనడా, యూరప్‌ లాంటి ప్రాంతాల నుండి చాలామంది వచ్చారు. ప్రతీరోజు సగటున 10,000 మంది హాజరయ్యారు. ప్రసంగాలన్నిటినీ దాదాపు 11 భాషల్లోకి అక్కడికక్కడే అనువదించారు.

యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న మన మ్యూజియంలో కొత్తగా తెరిచిన ఒక భాగం ఈ చారిత్రక సమావేశం వెనక జరిగిన కథను, అలాగే అది ప్రకటనా పనిపై చూపించిన ప్రభావాన్ని వివరిస్తుంది. ప్రస్తుతం దీన్ని బెతెల్‌ కుటుంబ సభ్యులు మాత్రమే చూడగలరు. అయితే బెతెల్‌ టూర్‌లు తిరిగి మొదలైనప్పుడు అందరూ చూడగలుగుతారు.

ఆ సమావేశంలో, సెప్టెంబరు 8వ తేదీ ఒక మర్చిపోలేని రోజు. అందమైన ఎరీ సరస్సు దగ్గరున్న హాల్లో ఆ రోజు దాదాపు 8,000 మంది హాజరయ్యారు. వాళ్లంతా “రాజ్యం” అనే అంశం మీద బ్రదర్‌ జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి వచ్చారు.

90 నిమిషాల పాటు మాట్లాడాక బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఉత్సాహంగా అక్కడ హాజరైన వాళ్లందర్ని, ‘క్రీస్తు పరిపాలిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా?’ అని అడిగారు. వెంటనే అందరూ, ఒకే స్వరంతో ‘అవును!’ అని బిగ్గరగా అరిచారు. తర్వాత బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఇలా అన్నాడు: ‘మీరే ఆయన ప్రతినిధులు, కాబట్టి ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి!’ ఆ మాటలన్న వెంటనే ఒక పెద్ద బ్యానర్‌ స్టేజి మీద తెరుచుకుంది. దానిమీద “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి” అని రాసి ఉంది.

ఆ ప్రసంగం విన్న వాళ్లందరి హృదయాల్లో పరిచర్య చేయాలనే ఉత్సాహం మరింత పెరిగింది. అక్కడ హాజరైన చాలామంది అప్పటికే ప్రకటనా పని చేస్తున్నారు, కానీ బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం విన్నప్పుడు, పరిచర్యను ఇంకా బాగా చేయాలనే ప్రోత్సాహం పొందారు. నిజానికి ఆ సమయంలో, ఇంటింటి పరిచర్య చేసే పద్ధతులు ఇంకా రూపుదిద్దుకుంటున్నాయి. సమావేశం జరిగే నాటికి దాదాపు 30 ఏళ్ల వయస్సున్న సిస్టర్‌ ఎథెల్‌ బెన్‌కోఫ్‌ ఆ శక్తివంతమైన ప్రసంగం గురించి చెప్తూ, అది బైబిలు విద్యార్థుల “హృదయాల్లో ముందెప్పుడూ లేనంత ఉత్సాహాన్ని, ప్రేమను” నింపిందని గుర్తుచేసుకుంది. 1922​లో 18 ఏళ్లున్న సిస్టర్‌ ఓడెసా టక్‌ ఇలా అంటుంది: “‘నేనున్నాను! నన్ను పంపు!’ అని చెప్పిన యెషయాలా నేనూ ఉండాలనుకున్నాను.”

1922​లో సీడార్‌ పాయింట్‌ దగ్గర జరిగిన సమావేశంలో బాప్తిస్మం తీసుకుంటున్నవాళ్లు

బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఆ ప్రసంగం ఇచ్చిన రెండు రోజుల తర్వాత, ఇంటర్నేషనల్‌ బైబిల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఒక తీర్మానం తీసుకుంది. అందులో ఒక భాగం ఇలా చెప్తుంది: “మన ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తుకు లోబడుతూ, ఆయన్ను అనుసరించాలని నిశ్చయించుకున్న క్రైస్తవ గుంపుగా మేము ఏ విధంగానూ హింసల్లో, యుద్ధాల్లో, విప్లవాల్లో లేదా గొడవల్లో భాగం వహించడాన్ని అంగీకరించము. బైబిల్ని తప్పుగా ఉపయోగించి ప్రజల్ని మోసం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. మేము నిజంగా శాంతిని కోరుకునేవాళ్లం.” ఈ తీర్మానం వేరే మతాలకున్న ఉద్దేశాలకు, బైబిలు విద్యార్థులకున్న ఉద్దేశాలకు మధ్యున్న తేడాను స్పష్టంగా చూపించింది. ఎందుకంటే వేరే మతాలవాళ్లు కొంతకాలం క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో, అలాగే తర్వాత జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవాళ్లకు మద్దతిచ్చారు.

1922, జూన్‌ 15​లో వచ్చిన కావలికోట ఇలా అంది: “1922​లో జరిగే ఈ సమావేశం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాం. దానికోసం మేం చేయగలిగినదంతా చేస్తాం. . . . అక్కడకు హాజరయ్యే వేలమంది స్నేహితుల మనసుల్లో ఈ సమావేశం ఒక చెరగని ముద్ర వేయాలని ఆశిస్తున్నాం.”

నిస్సందేహంగా వాళ్లు అనుకున్నట్టే జరిగింది! 100 సంవత్సరాల తర్వాత కూడా రాజుని ఆయన రాజ్యాన్ని ప్రకటించే పనిని యెహోవా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.—మత్తయి 24:14.