కంటెంట్‌కు వెళ్లు

2023, నవంబరు 4న, ఇండియాలోని కేరళలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాక్షులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు

నవంబరు 17, 2023
ఇండియా

ఇండియాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయినవాళ్ల సంఖ్య ఆరుకు చేరింది

ఇండియాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయినవాళ్ల సంఖ్య ఆరుకు చేరింది

2023, అక్టోబరు 29, ఆదివారం రోజున ఇండియాలోని కేరళలో జరిగిన ప్రాదేశిక సమావేశంలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. విచారకరంగా, మనకు ఇంతకుముందే ముగ్గురు చనిపోయారు అని తెలుసు; అయితే ఇప్పుడు ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరీలు కూడా చనిపోయారు. వాళ్లలో ఇంతకుముందే చనిపోయిన 12 ఏళ్ల పాప వాళ్ల అమ్మ అలాగే అన్నయ్య ఉన్నారు. అంతేకాదు, 11 మంది సహోదర సహోదరీలు ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నారు.

ఈ దాడి వల్ల నష్టపోయిన వాళ్లందరికీ ఓదార్పును, ప్రోత్సాహాన్ని అందించడానికి వీలుగా, ఇండియా బ్రాంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం 2023, నవంబరు 4న జరిగింది. పేలుళ్లు చోటుచేసుకున్న సమావేశానికి హాజరైన 21 సంఘాల్లోని సహోదర సహోదరీలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. ఈ కార్యక్రమం స్థానిక రాజ్యమందిరంలో జరిగింది. అక్కడికి దాదాపు 200 మంది హాజరయ్యారు. మరో 1,300 మంది ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చూశారు. అలాగే, హాస్పిటల్‌లో ఉన్నవాళ్లు కూడా చూడగలిగేలా ఈ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. బ్రాంచి ఆఫీస్‌ నుండి వచ్చిన ఒక పెద్ద ప్రసంగిస్తూ, కీర్తన 23:1 ద్వారా తన సేవకుల్లో ప్రతీ ఒక్కరి మీద యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో నొక్కి చెప్పాడు. ఆ సహోదరుడు ఇలా అన్నాడు: “ఈ వచనంలో కీర్తనకర్త యెహోవాను ఒక కాపరి అని, లేదా అద్భుతమైన కాపరి అని అనట్లేదు. బదులుగా, యెహోవా ‘నా కాపరి’ అని అంటున్నాడు. యెహోవా మనలో ప్రతీ ఒక్కరి మీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తున్నాడు అని తెలుసుకోవడం ఎంత ఊరటను ఇస్తుందో కదా!”

సహోదరీలు ప్రేమగా ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు

పేలుళ్లు జరిగినప్పుడు అక్కడే ఉన్న ఒక సహోదరుడు, ఈ సంఘటన జరిగినప్పటి నుండి తనకు నిద్ర పట్టడం లేదు అని చెప్పాడు. అయినప్పటికీ, హాస్పిటల్‌లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “సహోదరుల విశ్వాసాన్ని, వాళ్లు సానుకూలంగా ఉండడాన్ని చూసినప్పుడు నాకున్న ఆందోళనల్ని మర్చిపోగలిగాను. వాళ్లు గాయాలతో ఉన్నా, ఎంతో బాధలో ఉన్నా చాలామంది ఉత్సాహంగా రాజ్యగీతాలు పాడుతున్నారు.” మరో సహోదరుడు ఇలా అన్నాడు: “వీళ్లలో కొంతమంది సహోదరులు మళ్లీ మామూలు స్థితికి రావడానికి బహుశా చాలా కాలం పట్టవచ్చు. అయినా, మన సహోదర సహోదరీలు వాళ్ల మీద ప్రేమను కురిపిస్తూనే ఉంటారని నాకు తెలుసు. అంతేకాదు, మన ప్రేమగల దేవుడు తన బలమైన చేతితో వాళ్లలోని ప్రతీ ఒక్కరిని గట్టిగా పట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. అది నిజంగా ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది!”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సేవకులమైన మనందరం ఒకే ఐక్య కుటుంబంలో భాగం. కాబట్టి యెహోవా, ఇండియాలోని మన ప్రియమైన సహోదర సహోదరీల్లో ‘విరిగిన హృదయంగల వాళ్లను బాగుచేసి, వాళ్ల గాయాలకు కట్టుకడుతున్నాడు’ అని తెలుసుకోవడం ఊరటను ఇస్తుంది.—కీర్తన 147:3.