కంటెంట్‌కు వెళ్లు

అక్టోబరు 31, 2019
ఇండియా

ఇండియాలో యెహోవాసాక్షులు తెలుగు బైబిల్ని విడుదల చేశారు

ఇండియాలో యెహోవాసాక్షులు తెలుగు బైబిల్ని విడుదల చేశారు

2019, అక్టోబరు 25న జరిగిన ప్రాదేశిక సమావేశంలో, ఇండియా బ్రాంచి కమిటీ సభ్యుడైన సహోదరుడు అషోక్‌ పటేల్‌, పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం తెలుగులో విడుదల చేశారు. ఆ ప్రాదేశిక సమావేశం ఇండియాలోని హైదరాబాద్‌లో ఉన్న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.

దాదాపు తొమ్మిది కోట్ల కన్నా ఎక్కువమంది తెలుగు మాట్లాడతారు. హిందీ, బెంగాలీ తర్వాత ఇండియాలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాష ఇదే. ప్రస్తుతం తెలుగు సంఘాల్లో 6,000 మంది ప్రచారకులు ఉన్నారు. కానీ ఆ సమావేశానికి 8,868 మంది హాజరయ్యారు. తెలుగు మాట్లాడే చాలామంది సత్యం తెలుసుకుంటున్నారని ఇది చూపిస్తుంది. ఇప్పటికీ రెండు కొత్త తెలుగు సర్క్యూట్‌లు కూడా ఏర్పడ్డాయి.

తెలుగు కొత్త లోక అనువాదం బైబిలు పూర్తవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. అందులో పనిచేసిన ఒక సహోదరుడు, వేరే తెలుగు బైబిళ్లలో గ్రాంధిక భాష ఉంది కాబట్టి వాటిని యౌవనులు అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నట్టు గమనించారు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “యౌవనులు కొత్త లోక అనువాదం బైబిల్ని చదువుతున్నప్పుడు యెహోవా దేవుడే స్వయంగా వాళ్లతో తేలిగ్గా, అర్థమయ్యే వాడుక భాషలో మాట్లాడుతున్నట్టు ఉంటుంది.” ఇంకో అనువాదకురాలు ఏమంటుందంటే: “పరిచర్యలో ఈ బైబిల్ని ఉపయోగించి లేఖనాల్ని చూపించినప్పుడు ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు.”

అంతేకాదు కొన్ని తెలుగు బైబిళ్లలో యెహోవా అనే దేవుని పేరును తీసేశారు. కానీ కొత్త లోక అనువాదం బైబిలు ద్వారా తెలుగు చదివేవాళ్లు సర్వశక్తిగల దేవుని పేరును తెలుసుకోగలుగుతారు. వేరే తెలుగు బైబిళ్లలో కొన్ని పదాలను హిందూ నమ్మకాల ఆధారంగా అనువదించారు. ఉదాహరణకు, ఆత్మ లాంటివి. మూలభాషలో ఇలాంటి పదాల అర్థాన్ని తెలుసుకోవడానికి ఈ అనువాదం సహాయం చేస్తుంది.

ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే: “ఈ అనువాదాన్ని చదివేవాళ్లు యెహోవా దేవుని ప్రేమను ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువగా చూడగలుగుతారు.” ఖచ్చితంగా తెలుగు భాషలో ఈ అనువాదం చదివేవాళ్లు “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకుంటారు.”—కీర్తన 34:8.