కంటెంట్‌కు వెళ్లు

అక్టోబరు 30, 2020
ఇండియా

మూడు భారతీయ భాషల్లో కొత్త లోక అనువాదం బైబిలు విడుదలైంది

మూడు భారతీయ భాషల్లో కొత్త లోక అనువాదం బైబిలు విడుదలైంది

2020, అక్టోబరు 25 ఆదివారం రోజున, కొత్త లోక అనువాదం బైబిలు మూడు భారతీయ భాషలైన గుజరాతీ, కన్నడ, పంజాబీలో విడుదలైంది. ముందే రికార్డు చేసిన ప్రసంగాల ద్వారా ఈ బైబిళ్లను ఎలక్ట్రానిక్‌ రూపంలో విడుదల చేశారు. ఇంట్లో నుండే సహోదర సహోదరీలందరూ ఆ కార్యక్రమాన్ని చూశారు. కార్యక్రమం అయిన వెంటనే, ప్రచారకులు బైబిల్ని వాళ్ల సొంత భాషలో డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారు.

గుజరాతీ

ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 కోట్ల కంటే ఎక్కువమంది గుజరాతీ మాట్లాడతారు.

ఆరుగురు సహోదర సహోదరీలు రెండు టీమ్‌లుగా పనిచేసి, ఏడు సంవత్సరాల్లో బైబిల్ని అనువదించడం పూర్తిచేశారు. ఆ టీమ్‌లో పనిచేసిన సహోదరి ఏం చెప్పిందంటే: “బైబిలు విడుదలైనప్పుడు మాకు ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేం. దీనిలో ఉన్న భాష చిన్నపిల్లలకు కూడా చాలా తేలికగా అర్థమౌతుంది.”

ఆ టీమ్‌లో పనిచేసిన మరో సహోదరి ఇలా అంటుంది: “మూలప్రతుల్లో ఎక్కడెక్కడైతే యెహోవా పేరు కనిపిస్తుందో, ఈ బైబిల్లో కూడా సరిగ్గా అక్కడే దాన్ని పెట్టారు. సహోదర సహోదరీలు వ్యక్తిగత అధ్యయనంలో ఈ బైబిల్ని ఉపయోగించినప్పుడు, వాళ్ల విశ్వాసం తప్పకుండా బలపడుతుంది.”

ఈ అనువాదం అర్థం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి, చదివేవాళ్లు దీన్నుండి పూర్తి ప్రయోజనం పొందుతారని మేం నమ్ముతున్నాం. ‘సాత్వికులు’ యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది.—కీర్తన 25:9.

కన్నడ

కన్నడ భాషలో మాట్లాడే విధానానికి, రాసే విధానానికి చాలా తేడా ఉంటుంది. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడతారు. అందుకే సరళమైన, సహజమైన పదాలను ఉపయోగిస్తూ, అన్ని ప్రాంతాల వాళ్లకు అర్థమయ్యేలా బైబిల్లోని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించడం చాలా కష్టమైంది.

ఈ అనువాదాన్ని పూర్తి చేయడానికి ఏడు కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టింది. మొత్తం పదిమంది అనువాదకులు కలిసి పనిచేశారు. వాళ్లలో ఒక సహోదరి ఏమంటుందంటే: “కోవిడ్‌ కారణంగా 2021 వరకు ఈ బైబిలు విడుదలవ్వదని అనుకున్నాను. కానీ అది విడుదలవ్వడం చూసినప్పుడు, యెహోవా పనిని ఏదీ ఆపలేదని రుజువైంది.”

ఆ టీమ్‌లో పనిచేసిన మరో సహోదరుడు ఇలా అన్నాడు: “కన్నడ భాష మాట్లాడే ప్రజలు ఇకనుండి యెహోవా మాటల్ని వాడుక భాషలో చదవగలుగుతారు. యెహోవా పేరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ దాన్ని తిరిగి చేర్చిన ఈ బైబిల్ని వాళ్లు చదవగలుగుతారు. ఇదంతా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది.”

ఇండియా బ్రాంచి క్షేత్రంలో ఉన్న 2,800 కన్నా ఎక్కువమంది కన్నడ భాష మాట్లాడే సహోదర సహోదరీలకు ఈ అనువాదం తప్పకుండా సహాయం చేస్తుందని మేం నమ్ముతున్నాం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల కన్నా ఎక్కువమంది కన్నడ భాష మాట్లాడే ప్రజలకు, ‘దేవుని ఔదార్యం, తెలివి, జ్ఞానం ఎంత లోతైనవో’ అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఎంతో సహాయం చేస్తుంది.—రోమీయులు 11:33.

పంజాబీ

కొత్త లోక అనువాదం బైబిల్ని పంజాబీలో అనువదించడానికి ఆరుగురు అనువాదకులు పనిచేశారు. ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి మొత్తం 12 సంవత్సరాలు పట్టింది. ఇండియాలో అలాగే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల కన్నా ఎక్కువమంది పంజాబీ భాష మాట్లాడే ప్రజలకు ఈ అనువాదం ఎంతో సహాయం చేస్తుంది.

ఆ టీమ్‌లో పనిచేసిన ఒక సహోదరి ఏమంటుందంటే: “ఈ ప్రాజెక్ట్‌లో మేం చేయగలిగినదంతా చేశాం. కానీ యెహోవా సహాయంతోనే పూర్తి చేయగలిగాం. ఈ బైబిలు చదివినప్పుడు మన సహోదర సహోదరీల విశ్వాసం బలపడుతుంది, ఆందోళన తగ్గుతుంది. రాబోయే శ్రమల్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని కూడా వాళ్లకు ఇస్తుంది.”

ఇంకొక అనువాదకుడు ఏమంటున్నాడంటే: “మంచి మనసున్నవాళ్లు ఈ బైబిల్ని, ముఖ్యంగా కీర్తనలు లాంటి పుస్తకాల్ని చదవడాన్ని ఆనందిస్తారు. ఈ బైబిల్లో పరిశోధన చేయడానికి ఉపయోగపడే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి.”

ఈ సహోదరుల్లాగే, మేం కూడా యెహోవా చేసిన ‘ఎన్నో లెక్కించలేనన్ని అద్భుతమైన పనులకు’ కృతజ్ఞతలు చెప్తాం.—కీర్తన 40:5.