కంటెంట్‌కు వెళ్లు

స్కూలు నుండి తీసేసిన తమ పిల్లలతో టన్‌బనాట్‌ కుటుంబం, పిల్లల వయసు 7 ఏళ్లు, 10 ఏళ్లు, 12 ఏళ్లు

అక్టోబరు 30, 2019
ఇండోనేషియా

స్కూల్‌ పిల్లల మత స్వాతంత్ర్యాన్ని కాపాడిన ఇండోనేషియా కోర్టు

స్కూల్‌ పిల్లల మత స్వాతంత్ర్యాన్ని కాపాడిన ఇండోనేషియా కోర్టు

ముగ్గురు పిల్లలు జెండా వందనం చేయడానికి గానీ, జాతీయ గీతం పాడడానికి గానీ ఒప్పుకోనందుకు వాళ్లను స్కూలు నుండి తీసేశారు. 2019, ఆగస్టు 8న, సమరిండా అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు, ఆ పిల్లలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ ముగ్గురినీ తిరిగి స్కూల్లో చేర్చుకోవాలని ఆదేశించింది. తమ అమ్మానాన్నల మత నమ్మకాల్ని పాటిస్తున్న యెహోవాసాక్షుల పిల్లల్ని శిక్షించకూడదని కోర్టు చెప్పింది. అంతేకాదు, ఇండోనేషియా చట్ట ప్రకారం, పిల్లలకు మతపరమైన విషయాల్ని నేర్పించే స్వాతంత్ర్యం వాళ్ల అమ్మానాన్నలకు ఉంది.

యోనాతన్‌ (7 ఏళ్లు), యోషువా (10 ఏళ్లు), మరియా టన్‌బనాట్‌ (12 ఏళ్లు) అనే ముగ్గురు పిల్లల్ని 2018 డిసెంబరులో స్కూలు నుండి తీసేశారు. అయితే, ఈ కేసును పరిశీలించిన అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు, పిల్లలు దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోతే వాళ్లు రాజ్యాంగాన్ని గానీ చట్టాన్ని గానీ మీరినట్లు కాదని తెలిపింది; అంతేకాదు దేశ సంప్రదాయాల్ని, చిహ్నాల్ని అవమానించినట్లు కూడా అవ్వదని తెలిపింది.

పిల్లల బైబిలు నమ్మకాల్ని గౌరవిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ తీర్పు వల్ల పిల్లలు తిరిగి స్కూలుకు వెళ్లి వాళ్ల చదువును కొనసాగించడం వీలౌతుంది. స్కూల్‌లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇండోనేషియాలోని ఇతర యెహోవాసాక్షుల పిల్లలకు కూడా ఈ తీర్పు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం.