కంటెంట్‌కు వెళ్లు

ఇటలీ, మిలాన్‌లో అప్పీల్‌ కోర్టు ఉన్న భవనం

నవంబరు 12, 2020
ఇటలీ

యెహోవాసాక్షులైన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచిన ఇటలీ కోర్టు

యెహోవాసాక్షులైన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచిన ఇటలీ కోర్టు

ఇటీవల కాలంలో ఇటలీ, మిలాన్‌లోని అప్పీల్‌ కోర్టు యెహోవాసాక్షులైన ఒక జంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అది వాళ్ల పాపకు ఎలాంటి వైద్య చికిత్స ఇవ్వాలి అనే విషయానికి సంబంధించిన కేసు. తమ పిల్లలకు రక్తం ఎక్కించకుండా చికిత్స చేయమని తల్లిదండ్రులు అడిగినంత మాత్రాన వాళ్లకు తమ పిల్లల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకునే సమర్థత లేదనే ముగింపుకు ఏ కోర్టు రాకూడదని ఈ తీర్పు స్పష్టం చేసింది. తమ మత నమ్మకాల కారణంగా పిల్లలకు రక్తం ఎక్కించకూడదని చెప్పే హక్కు తల్లిదండ్రులకు ఉందని కూడా కోర్టు నిర్ణయించింది.

2019, సెప్టెంబరులో ఒక యెహోవాసాక్షుల జంట తమ పది నెలల పాపకు దెబ్బ తగిలిందని హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. కింద పడిపోయినప్పుడు తలకి బలమైన గాయం అవ్వడం వల్ల డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేయాలన్నారు. డాక్టర్లు రక్తం ఎక్కించకుండానే ఆపరేషన్‌ని చేశారు.

ఆ పాప ప్రమాదం నుండి బయటపడింది. అయితే, పాప త్వరగా కోలుకోవడానికి రక్తం కూడా ఎక్కించమని ఒక డాక్టర్‌ తల్లిదండ్రులకు చెప్పింది. కానీ రక్తం ఎక్కించకుండా వేరే ఏదైనా మంచి ట్రీట్‌మెంట్‌ ఉంటే చేయమని తల్లిదండ్రులు అడిగారు.

తల్లిదండ్రులు చెప్పింది గౌరవించే బదులు ఆ డాక్టర్‌ పోలీసులకు, ప్రాసిక్యూటర్‌ ఆఫీసుకి విషయాన్ని చేరవేసింది. అప్పుడు ప్రాసిక్యూటర్‌ ఫ్యామిలీ కోర్టు నుండి ఒక కోర్టు ఆర్డర్‌ను రప్పించారు. తల్లిదండ్రులకున్న చట్టపరమైన అధికారానికి హద్దులు విధిస్తూ, ఆ పాప చికిత్స విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్‌ అధ్యక్షునికి ఇస్తున్నట్టు కోర్టు ఆర్డర్‌ చెప్పింది. చివరికి రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదని డాక్టర్లు నిర్ణయించారు కాబట్టి ఆ పాపకు ఎటువంటి రక్తమార్పిడి జరగలేదు.

ఇటలీలో చాలా న్యూస్‌ పేపర్లలో, టీవీ ఛానళ్లలో దీనిగురించి వచ్చింది. అయితే చాలామంది మీడియావాళ్లు, కోర్టు తీర్పు వల్ల చేసిన రక్తమార్పిడి ఆ పాప ప్రాణాల్ని కాపాడిందని తప్పుగా రిపోర్టు చేశారు.

2020, సెప్టెంబరు 10న అప్పీల్‌ కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చే అధికారం దానికి లేదని, అసలు ఆర్డర్‌ ఇవ్వకుండా ఉండాల్సిందని అప్పీల్‌ కోర్టు చెప్పింది.

అప్పీల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో ఇలా ఉంది: “తల్లిదండ్రులు తమ మత నమ్మకాల కారణంగా రక్తం ఎక్కించొద్దు అని చెప్పినంత మాత్రాన వాళ్లు మంచి తల్లిదండ్రులు కారని, పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇక వాళ్లకు ఉండకూడదు అని చెప్పలేం.” ఈ తీర్పు ఒక్కటే కాదు, గత సంవత్సరంలో ఇటలీలోని మూడు అప్పీల్‌ కోర్టులు కూడా ఇలాంటి తీర్పుల్నే ఇచ్చాయి. పిల్లలకు రక్త రహిత చికిత్స చేయమని అడిగే హక్కు సాక్షులైన తల్లిదండ్రులకు ఉందని అవి గుర్తించాయి.

యెహోవాసాక్షులు స్వస్థతల్ని చేయరని, వాళ్లు వైద్యానికి వ్యతిరేకం కాదని చట్టపరమైన-వైద్యపరమైన అధికారులు అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. నిజానికి వాళ్లు ఆధునిక హాస్పిటల్స్‌లో మంచి చికిత్స తీసుకోవాలని కోరుకుంటారు. వాళ్ల మత నమ్మకాల్ని గౌరవించి చికిత్స చేసే అనుభవంగల డాక్టర్ల కోసం, మంచి పరికరాలున్న హాస్పిటల్స్‌ కోసం వెతుకుతారు. చికిత్స చేసేటప్పుడు రక్తం ఎక్కించొద్దని మాత్రమే అడుగుతారు. దానికి తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద హాస్పిటల్స్‌లో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు యెహోవాసాక్షులకు రక్తం ఎక్కించకుండానే శ్రేష్ఠమైన విధంగా వైద్యం చేస్తున్నారు.

తమ పిల్లల విషయంలో మంచి వైద్య విధానాన్ని ఎంచుకోవాలనే మన సహోదర సహోదరీల నిశ్చయాన్ని ఇలాంటి కోర్టు తీర్పులు బలపరుస్తాయి. వాటినిబట్టి మేమెంతో సంతోషిస్తున్నాం.—అపొస్తలుల కార్యాలు 15:29.