కంటెంట్‌కు వెళ్లు

ప్రైజ్‌ పొందిన 15 మంది విద్యార్థుల్లో ముగ్గురు సంతోషంగా తమ అవార్డ్‌లను చూపిస్తున్నారు

సెప్టెంబరు 19, 2023
జర్మనీ

ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేసిన మన యౌవనులు

ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేసిన మన యౌవనులు

2023, జూలై 6న జర్మనీలోని కాసెల్‌ అనే నగరానికి చెందిన 15 మంది యౌవన యెహోవాసాక్షులకు ఒక ప్రాజెక్ట్‌లో ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. వాళ్లు నాజీల చేతుల్లో చనిపోయిన సిస్టర్‌ విల్‌హెల్‌మిని పోటర్‌ చూపించిన ధైర్యం గురించి ఆ ప్రాజెక్ట్‌లో చెప్పారు.

నాజీల హింస కారణంగా చనిపోయిన వాళ్లను గుర్తుచేస్తూ ష్టాపెల్‌స్టయిన్‌ ఇన్‌ కాసెల్‌ సంస్థవాళ్లు, కాసెల్‌ నగరమంతటా కొన్ని చిహ్నాల్ని దారుల్లో పెట్టించారు. హింస ఎదుర్కొన్న వాళ్లలో విల్‌హెల్‌మిని పోటర్‌, ఆమె భర్త జస్‌టస్‌ పోటర్‌ కూడా ఉన్నారు. నీస్‌టెటల్‌ అనే పక్క ఊరిలో విల్‌హెల్‌మిని పేరుతో ఒక వీధే ఉంది. అయితే, ఆ సంస్థ 10వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని విద్యార్థులందర్ని ఒక ప్రాజెక్ట్‌ చేయమని కోరారు. ఈ ప్రాజెక్ట్‌లో నాజీల చేతుల్లో చనిపోయిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ఎంచుకుని, వాళ్ల జీవితం గురించి ఒక రిపోర్టు తయారుచేయాలి, అలాగే విద్యార్థులు తాము నేర్చుకున్నవాటి గురించి చెప్పాలి.

సిస్టర్‌ విల్‌హెల్‌మిని పేరు మీదున్న వీధిలో తను రాసిన ఉత్తరాల ఫోటోలు ఉన్న పోస్టర్‌లు బస్‌స్టాప్‌లో అతికించారు

13 నుండి 23 ఏళ్ల వయసున్న 15 మంది యెహోవాసాక్షులు కలిసి విల్‌హెల్‌మిని గురించి ఒక ప్రాజెక్ట్‌ చేశారు. ఆమె జీవితం గురించి 24 నిమిషాల వీడియోని తయారుచేసి, దానికి దేవునికి మాత్రమే లోబడ్డారు అనే పేరు పెట్టారు. ఈ వీడియోలో 1937 లో నాజీలు ఆమెని జైల్లో వేశారని అలాగే ఆమెకి 49 ఏళ్లు ఉన్నప్పుడు 1942 లో రావన్స్‌బ్రూక్‌ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లో ఆమె చనిపోయిందని చెప్పారు. అంతేకాదు, జైల్లో ఉన్నప్పుడు విల్‌హెల్‌మిని ఆమె భర్తకి, కుటుంబానికి రాసిన ఉత్తరాల ఫోటోలను చూపిస్తూ విద్యార్థులు చిన్న పోస్టర్‌లను తయారు చేశారు. వాటిని విల్‌హెల్‌మిని పేరున ఉన్న వీధిలోని బస్‌స్టాప్‌లో అతికించారు.

1937, ఏప్రిల్‌ 25న విల్‌హెల్‌మిని తన భర్తకు ఉత్తరంలో ఇలా రాసింది: ‘ప్రియమైన జస్‌టస్‌, కోర్టు మనకు తీర్పు ఇచ్చినప్పుడు, మనిద్దరం ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంకంతా ప్రభువు చేతుల్లో పెట్టేద్దాం, ఆయనే మనకు దారి చూపిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిద్దరం దేవునితో మన స్నేహాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థనలో అడుగుతున్నాను. అప్పుడు మనం దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చివరివరకు నమ్మకంగా ఉండగలుగుతాం. మనం తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ కష్టాల్ని ఆయన ఎప్పుడూ రానివ్వడు. కాబట్టి బలమైన విశ్వాసంతో మన ప్రభువు, యజమాని వైపు చూద్దాం.’ ఆమె ప్రార్థనకు జవాబుగా, వాళ్లిద్దరూ చనిపోయేంతవరకు నమ్మకంగా ఉన్నారు.

1937, ఏప్రిల్‌ 25న విల్‌హెల్‌మిని తన భర్త జస్‌టస్‌కు రాసిన ఉత్తరం

23 ఏళ్ల సిస్టర్‌ అలెక్సాండ్రా అల్టెమయర్‌ వీడియోలో ఇలా చెప్పింది: “క్రీస్తు శిష్యులుగా ఉంటే హింసలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విల్‌హెల్‌మినికు, ఆమె భర్తకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ల నమ్మకాలను బట్టి, వాళ్లు అరెస్ట్‌ అవ్వడానికి, హింసలు ఎదుర్కోవడానికి, చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే దేవుడు వాళ్లను మర్చిపోడని వాళ్లకు తెలుసు.” 18 ఏళ్ల బ్రదర్‌ ఓలి ష్రోడర్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సహాయం చేశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “సిస్టర్‌ విల్‌హెల్‌మిని అనుభవం నన్ను ఎంతగానో కదిలించింది. ఆమె నమ్మకంగా ఉంది, దేవునికి విశ్వసనీయంగా ఉంది, ఎన్నో సహించింది. అలా అని ఆమె తన ఆనందాన్ని ఏమీ పోగొట్టుకోలేదు. వీటన్నిటి నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నిజంగా యెహోవాతో స్నేహం ఎంత విలువైందో ఆమె అనుభవం నిరూపించింది.”

పూర్తి వీడియోని ప్రైజ్‌ వేడుకల్లో హాజరైన 180 మందికి చూపించారు. వాళ్లలో విద్యార్థులు, మీడియా వాళ్లు, టౌన్‌ మేయర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ ముఖ్య అధికారి, స్కూల్‌ జిల్లా డైరెక్టర్‌ కూడా ఉన్నారు.

విశ్వాసం, ధైర్యం చూపించిన జస్‌టస్‌ అలాగే విల్‌హెల్‌మిని అనుభవం నుండి ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న మన యౌవనులు ఎంతో ప్రోత్సాహాన్ని పొందారు. మనకు కూడా వాళ్లలానే అనిపిస్తుంది. అవును, యెహోవా తన విశ్వసనీయుల్ని ఎన్నడూ మర్చిపోడని మనం బలమైన నమ్మకంతో చెప్తాం.—హెబ్రీయులు 6:10.