కంటెంట్‌కు వెళ్లు

సహోదరి ఆనా డెంట్స్‌, సహోదరుడు ఎరిక్‌ ఫ్రాస్ట్‌; జర్మనీలో ఉన్న బాడన్‌-వర్టంబర్గ్‌ రాష్ట్ర పార్లమెంట్‌ భవనం

ఫిబ్రవరి 22, 2021
జర్మనీ

యెహోవాసాక్షుల ధైర్యాన్ని మెచ్చిన జర్మనీ రాష్ట్ర పార్లమెంట్‌

యెహోవాసాక్షుల ధైర్యాన్ని మెచ్చిన జర్మనీ రాష్ట్ర పార్లమెంట్‌

ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మాట్లాడిన బాడన్‌-వర్టంబర్గ్‌ రాష్ట్ర పార్లమెంట్‌ అధ్యక్షురాలు ముటెరెం అరాస్‌

ప్రతీ సంవత్సరం జర్మనీకి చెందిన బాడన్‌-వర్టంబర్గ్‌ రాష్ట్ర పార్లమెంట్‌, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల చేతుల్లో బలైన వాళ్లను జ్ఞాపకం చేసుకుంటుంది. అలా 2021, జనవరి 27న వాళ్లు యెహోవాసాక్షులను గుర్తుచేసుకుంటూ ఒక కార్యక్రమం జరుపుకున్నారు. కోవిడ్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చేశారు. ఆస్ట్రియా, జర్మనీ, నెదర్లాండ్స్‌ అలాగే స్విట్జర్లాండ్‌ నుండి 37,000 కంటే ఎక్కువమంది దీనికి హాజరయ్యారు. ప్రజలు ఈ కార్యక్రమం రికార్డింగ్‌ను ఆ తర్వాత దాదాపు 78,000 సార్లు చూశారు.

బాడన్‌-వర్టంబర్గ్‌ రాష్ట్ర పార్లమెంట్‌ అధ్యక్షురాలైన ముటెరెం అరాస్‌ ఇలా ఒప్పుకుంది: “యెహోవాసాక్షులు ఎలా హింసించబడ్డారో వివరించే పుస్తకాలు, సమాచారం చాలానే ఉన్నాయి. కానీ వాళ్ల గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.” ఆ చీకటి కాలంలో సాక్షులు ఉంచిన “ఆదర్శం నేడు మనం ద్వేషాన్ని, హింసను, వివక్షను ఎలా తట్టుకోవాలో చూపిస్తుంది” అని కూడా ఆమె చెప్పింది.

బాడన్‌-వర్టంబర్గ్‌లో లొరాక్‌కు చెందిన ఆనా డెంట్స్‌ అనే సాక్షురాలి గురించి రాష్ట్ర పార్లమెంట్‌ అధ్యక్షురాలు అరాస్‌ వివరించింది. ఆమె తల్లిదండ్రులు కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో చనిపోయారు. ఆనా స్కూల్లో “హేల్‌ హిట్లర్‌” అని చెప్పడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఆమె కొంతమంది సాక్షుల సహాయంతో స్విట్జర్లాండ్‌కి పారిపోయింది. కొంతకాలానికి ఆనా తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. రాష్ట్ర పార్లమెంట్‌ అధ్యక్షురాలు అరాస్‌ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది: “ఆనా డెంట్స్‌ వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె ధైర్యం వెనకున్న కారణం ఆమెకున్న బలమైన విశ్వాసమే.”

డా. హాన్స్‌ హెస్స

1933​లో, నాజీ పరిపాలన మొదలైన రెండు నెలలకే జర్మనీలో యెహోవాసాక్షుల్ని నిషేధించారని చరిత్రకారుడైన డా. హాన్స్‌ హెస్స వివరించాడు. ఆ సమయంలో మన సహోదరులు “ఆ నిషేధాన్ని ఎదిరిస్తూ కరపత్రాల్ని పంచిపెడుతూ తమ ప్రకటనా పనిని కొనసాగించారు” అని కూడా డా. హెస్స చెప్పాడు.

ఆ చరిత్రకారుడు సహోదరుడు గుస్టాఫ్‌ ష్టాంగ్‌ అనుభవాన్ని కూడా చెప్పాడు. తన మత నమ్మకాల కారణంగా ఆ సహోదరుడు సైన్యంలో చేరనందుకు, ఆయన్ని విచారిస్తూ లాయర్లు ఇలా అడిగారు: “అందరూ నీలాగే చేస్తే అప్పుడేంటి?” దానికి సహోదరుడు “అప్పుడు యుద్ధం వెంటనే ఆగిపోతుంది” అని జవాబిచ్చాడు.

ఆ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో “సాక్షుల్లారా, ముందుకు సాగండి!” అనే మన పాటకు సంబంధించిన సంగీతాన్ని వినిపించారు. సెంట్రల్‌ యూరప్‌ బ్రాంచ్‌లో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ డెస్క్‌ని పర్యవేక్షించే సహోదరుడు వుల్ఫ్‌రామ్‌స్లుపినా, ఆ పాటను కూర్చిన సహోదరుడు ఎరిక్‌ ఫ్రాస్ట్‌ గురించి చెప్పాడు. సహోదరుడు ఎరిక్‌ ఫ్రాస్ట్‌ ఒక ప్రావీణ్యంగల సంగీతకారుడు. 1942​లో సాక్సన్‌హౌజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులో బందీగా ఉన్నప్పుడు ఆయన ఈ పాటను కూర్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో సహోదరుడు ఫ్రాస్ట్‌, “క్యాంపులో మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవాళ్లు” కాబట్టి తోటి ఖైదీలను ప్రోత్సహించడానికి ఈ పాటను కూర్చానని చెప్పాడు.

నాజీ హింసను తట్టుకుని నిలబడిన సహోదరి సిమోన్‌ ఆర్నాల్డ్‌ లీబ్‌స్టర్‌ని యెహోవాసాక్షులైన 13 ఏళ్ల మారా, 15 ఏళ్ల ఫిన్‌ కెంపర్‌ ఇంటర్వ్యూ చేశారు. సహోదరి లీబ్‌స్టర్‌ చిన్నప్పుడే నాజీల చేతుల్లో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. నాజీలు చెప్పింది చేయనందుకు వాళ్లు ఆమెను బాల నేరస్తుల స్కూల్‌కు పంపించారు. ఎంత హింస ఎదురైనా నమ్మకంగా నిలబడినందుకు “చాలా సంతోషించాను” అని ఆమె చెప్పింది.

ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సహోదరి సిమోన్‌ ఆర్నాల్డ్‌ లీబ్‌స్టర్‌ని ఇంటర్వ్యూ చేస్తున్న అన్నాచెల్లెళ్లు మారా, ఫిన్‌ కెంపర్‌

నిజానికి హింసలు ఎదురౌతున్న ఆ కాలమంతటిలో యెహోవాయే నమ్మదగిన సహాయకుడిగా నిలిచాడు. ఈ కార్యక్రమం చాలామందికి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం.—హెబ్రీయులు 13:6.