కంటెంట్‌కు వెళ్లు

ఆగస్టు 16, 2019
డెన్మార్క్‌

డెన్మార్క్‌లో యెహోవాసాక్షులు తెరిచిన ఒక కొత్త బైబిలు మ్యూజియం

డెన్మార్క్‌లో యెహోవాసాక్షులు తెరిచిన ఒక కొత్త బైబిలు మ్యూజియం

2019, జూలైలో డెన్మార్క్‌లోని హోల్‌బెక్‌ పట్టణంలో ఉన్న యెహోవాసాక్షుల స్కాండినేవియా బ్రాంచి ఆఫీసులో ఒక కొత్త బైబిలు మ్యూజియంను తెరిచారు. ఇది కోపెన్‌హేగన్‌ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ మ్యూజియం అంశం “బైబిలు, అందులో దేవుని పేరు స్కాండినేవియాలో.”

ఆ మ్యూజియంలో డానిష్‌, ఫేరోయిస్‌, గ్రీన్లాండిక్‌, ఐస్లాండిక్‌, నార్వేజియన్‌, సామి, స్వీడిష్‌ భాషల్లోని కొన్ని అరుదైన, ముఖ్యమైన బైబిళ్లను ప్రదర్శనకు ఉంచారు. అలాంటి బైబిళ్లు అక్కడ 50 కన్నా ఎక్కువ ఉన్నాయి.

అక్కడ ప్రదర్శనకు ఉంచిన వాటిలో అన్నిటికన్నా ప్రత్యేకమైనది ఏంటంటే 1541 గుస్తావ్‌ వాసా బైబిలు అసలు కాపీ. స్కాండినేవియన్‌ భాషలో పూర్తిగా ప్రచురించబడిన మొట్టమొదటి బైబిలు ఇదే. ఎక్కువ శాతం స్కాండినేవియన్‌ భాషా వ్యాకరణం, పదాలు గుస్తావ్‌ వాసా బైబిలు నుండే వచ్చాయి. తర్వాతి 300 ఏళ్ల వరకు స్వీడిష్‌ భాషలో బైబిళ్లను తయారు చేయడానికి ఈ బైబిల్నే నమూనాగా ఉపయోగించారు.

ప్రదర్శనకు ఉంచిన 1541 గుస్తావ్‌ వాసా బైబిలు ఒరిజినల్‌ కాపీ

ఆ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టిన మరో అరుదైన కాపీ ఏంటంటే 1550 క్రీస్టియన్‌ III బైబిలు. డానిష్‌లో వచ్చిన మొట్టమొదటి పూర్తి బైబిలు ఇదే. డానిష్‌ భాష ప్రమాణాల్ని ఏర్పాటు చేయడానికి క్రీస్టియన్‌ III బైబిలు బాగా ఉపయోగపడింది. ఉత్తర యూరప్‌ మీద ఇది చెప్పుకోదగ్గ ప్రభావమే చూపించింది.

1550 క్రీస్టియన్‌ III బైబిలు ఒరిజినల్‌ కాపీ

స్కాండినేవియా బ్రాంచి ఆఫీసులో పని చేస్తున్న ఎరిక్‌ జోర్గెన్సెన్‌ ఇలా అన్నాడు: “కొన్ని దశాబ్దాలుగా స్కాండినేవియా ప్రజలకు దేవుని వాక్యం పట్ల, యెహోవా అనే ఆయన గొప్ప పేరు పట్ల ఉన్న ప్రగాఢమైన గౌరవాన్ని ఈ కొత్త బైబిలు మ్యూజియం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.”