డిసెంబరు 13, 2021
నైజీరియా
నైజీరియాలో యెహోవాసాక్షుల ప్రకటనా పనికి 100 ఏళ్లు
1921-2021: ఒకప్పుడు కొంతమంది, ఇప్పుడు 4,00,000 ప్రచారకులు
నైజీరియాలో బైబిలు విద్యా పని మొదలై 100 ఏళ్లు గడిచిన సందర్భంగా, అక్కడి యెహోవాసాక్షులు రెండు ప్రత్యేక కార్యక్రమాల్ని జరిపారు. 2021, డిసెంబరు 12న నైజీరియాలోని యెహోవాసాక్షుల సంఘాలన్నీ, ముందే రికార్డు చేసిన ఒక కార్యక్రమాన్ని చూశాయి. అందులోని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు నైజీరియాలో ప్రకటనా పని చరిత్రను జ్ఞాపకం చేశాయి. ఆ కార్యక్రమం ఎఫిక్, ఇంగ్లీషు, ఇగ్‌బో, నైజీరియన్ సంజ్ఞా భాష, పిడ్జిన్ (పశ్చిమాఫ్రికా), యెరూబ భాషల్లో ప్రసారమైంది. దానికి కాస్త ముందు, అంటే 2021 డిసెంబరు 10న, నైజీరియా బ్రాంచి కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన మ్యూజియంను తెరిచారు. ప్రస్తుతానికి దాన్ని చూసే అవకాశం, నైజీరియా బ్రాంచిలో పని చేసే వాళ్లకు మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో సందర్శకులకు కూడా అనుమతి దొరుకుతుంది.
ఆ ఎగ్జిబిషన్ అంశం, “100 ఏళ్ల ధైర్యం.” ప్రకటనా పని విషయంలో ధైర్యాన్ని, బలమైన విశ్వాసాన్ని చూపించిన నైజీరియా ప్రచారకుల ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఆ మ్యూజియం మనకు చూపిస్తుంది. అక్కడి ప్రభుత్వం ప్రచురణల్ని నిషేధించినా, ప్రజలు హేళన చేసినా, అంతర్యుద్ధం భీభత్సాన్ని సృష్టించినా ప్రచారకులు ఎంతో సాహసంతో ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్లారని అది వివరిస్తుంది. ఆడియో-వీడియో రికార్డింగులు, అప్పట్లో ఉపయోగించిన వస్తువులు ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తాయి. నైజీరియాలో 1921 డిసెంబరులో మొదలైన ప్రకటనా పనికి ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయో సందర్శకులు తెలుసుకుంటారు. మొదట్లో, ఆసక్తి ఉన్న కేవలం కొంతమందే బైబిలు తరగతులకు హాజరయ్యేవాళ్లు; కానీ ఇప్పుడు 4,00,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు దేశమంతటా మంచివార్త ప్రకటిస్తున్నారు.
గత 100 ఏళ్లలో నైజీరియాలోని సహోదరసహోదరీలు చేసిన నమ్మకమైన సేవను చూసి నైజీరియాలోని సహోదరులతోపాటు, ప్రపంచ దేశాల్లో ఉన్న యెహోవాసాక్షులందరూ ధైర్యం తెచ్చుకోవచ్చు.—యోహాను 16:33.