సెప్టెంబరు 14, 2022
ప్రపంచ వార్తలు
యెహోవాసాక్షులు తిరిగి ఇంటింటికి వెళ్తున్నారు!
2022, సెప్టెంబరు 1 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఎంతో ఎదురుచూశారు. ఆ రోజున వాళ్లు ఇంటింటి పరిచర్యను తిరిగి మొదలుపెట్టారు. ఈ సమయంలో సంతోషించడానికి మరో కారణం కూడా ఉంది. సెప్టెంబరులో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టే ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాదు, మన సహోదర సహోదరీల్లో కొంతమందికి బాగా పరిచయమున్న, ఇష్టమైన పరిచర్య విధానం ఇదే. ఇంకొంతమంది సహోదర సహోదరీలకు ఇలా నేరుగా ఇంటింటికి వెళ్లి మంచివార్త ప్రకటించడం ఇదే మొదటిసారి. 2023 సేవా సంవత్సరాన్ని ఎంత ఘనంగా మొదలుపెట్టామో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని అనుభవాల్ని పరిశీలించండి.
జర్మనీ
2022, సెప్టెంబరు 2న నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని పీటర్స్‌హాగెన్‌లో, ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో నికోల్, టీనా అనే ఇద్దరు సహోదరీలు ఇంటింటి పరిచర్య చేస్తున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవ్వరూ లేరని వాళ్లు తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు, వెనకనుండి ఒకావిడ పిలవడం వినిపించింది. ఆమె ఆ అపార్టమెంట్‌లో ఉంటుందనీ, సహోదరీలు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె తలుపు తీయలేకపోయిందని చెప్పింది. బైబిలు గురించి మాట్లాడడానికి తన ఇంటికి రమ్మని మరీమరీ అడిగింది. ఆ సహోదరీలు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు టేబుల్ మీద పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం కనిపించింది. అది బాగా వాడేసినట్టు ఉంది. దాని గురించి అడిగితే, ఆమె ఇటలీలో ఉన్నప్పుడు యెహోవాసాక్షులు తనకి ఆ బైబిలు ఇచ్చారని చెప్పింది. అయితే కరోనా సమయంలో జర్మనీకి ఇల్లు మారినప్పుడు, యెహోవాసాక్షులతో ఆమె మళ్లీ మాట్లాడలేకపోయింది. ఆమెను మళ్లీ కలవడానికి సహోదరీలు తన వివరాలను తెలుసుకున్నారు. మీటింగ్‌కు రమ్మని కూడా ఆహ్వానించారు. రెండు రోజుల తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలతో మీటింగ్‌కు వచ్చింది. ఆమెకు బైబిలు స్టడీ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
గ్వాటిమాల
మామ్-భాష క్షేత్రంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్న మాన్యుయెల్, కారోల్ గాస్టెలం ఇంటింటి పరిచర్యలో ఒకావిడను కలిశారు. ఆమె ఎంతో దయగా వాళ్లను తన ఇంటికి ఆహ్వానించింది. దేవునికి ఒక పేరుందని ఆమెకు తెలీదు కాబట్టి వాళ్లు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో “దేవుడు ఎవరు?” అనే 4వ పాఠాన్ని చర్చించడం మొదలుపెట్టారు. ఆమె తన సొంత బైబిల్లో యెషయా 42:8 చదివాక, దేవుని పేరు యెహోవా అని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయింది.
ఆ స్త్రీ కంటతడి పెట్టుకుని, ‘ఇంట్లో బైబిలు ఉంటే సరిపోదు, అందులో ఉన్న విషయాల్ని నేర్చుకుని, దానికి తగ్గట్టు జీవించడం కూడా ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నాను’ అని చెప్పింది. పాఠం పూర్తయ్యాక, తను నేర్చుకున్న వాటిని బట్టి ఎంతో కృతజ్ఞత చూపించింది. తన భర్తతో కూడా వీటి గురించి మాట్లాడతానని చెప్పింది. బ్రదర్, సిస్టర్ గాస్టెలం ఆమెకు బైబిలు స్టడీ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
జపాన్
యొకోహామాలో బ్రదర్, సిస్టర్ నూకమోరీ ఇంటింటి పరిచర్య చేస్తున్నారు. ఒక ఇంట్లో వాళ్లు ఇంటర్‌కామ్ ద్వారా మాట్లాడినప్పుడు, ఇంటివ్యక్తి స్పందించి, పలకరించింది. వాళ్లు తమను తాము పరిచయం చేసుకుని యెహోవాసాక్షులమని చెప్పారు. ఆ ఇంటివ్యక్తి వాళ్లిద్దర్ని డోర్ దగ్గరే ఆగమని చెప్పింది. కాసేపు అయ్యాక ఆ స్త్రీ డోర్ తెరిచి ఇలా అంది: “యెహోవాసాక్షులు నా ఇంటికి వస్తారని ఎంతో ఎదురుచూస్తూ ఉన్నాను.”
ఆ స్త్రీ నాగాసాకి అనే మరో ప్రాంతంలో ఉన్నప్పుడు, యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకునేదని చెప్పింది. కరోనా సమయంలో, యొకోహామాకు ఇల్లు మారడం వల్ల జూమ్ ద్వారా ఆమె తన స్టడీని కొనసాగించింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమెకు బైబిలు స్టడీ ఇస్తున్న సహోదరి ఇలా అంది: “సెప్టెంబరు నెలలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు యెహోవాసాక్షుల్లో ఒకరు మీ ఇంటికి ఖచ్చితంగా వస్తారు. వాళ్లు వచ్చినప్పుడు, నేరుగా బైబిలు స్టడీ ఇవ్వమని అడగండి.” యెహోవాసాక్షులు తన ఇంటికి అంత త్వరగా వచ్చేసరికి ఆ స్త్రీ ఎంతో సంతోషించింది, ఆశ్చర్యపోయింది. తను మీటింగ్స్‌కి రావాలని కోరుకుంటున్నట్టు తెలియజేసింది. అలాగే, బైబిలు స్టడీ కోసం ఎప్పుడు రావాలో కూడా చెప్పింది.
మెక్సికో
ఒక జంట పరిచర్యలో ఒక స్త్రీతో మాట్లాడి, బైబిలు స్టడీ గురించి చెప్పారు. అప్పుడు ఆమె యెహోవాసాక్షుల దగ్గర ఇంతకుముందు స్టడీ తీసుకునేదని, ఎన్నో సంవత్సరాల క్రితం మీటింగ్స్‌కి కూడా వెళ్లేదని చెప్పింది. కానీ తర్వాత, ఆమెకు సాక్షుల్ని కలవడం కుదరలేదు. తను బైబిలు సూత్రాలకు తగ్గట్టు జీవించట్లేదనే సిగ్గుతో వాళ్లకోసం మళ్లీ వెతకడానికి ప్రయత్నించలేదని చెప్పి, ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ జంట కీర్తన 10:17 లో ఉన్న మాటల్ని ఆమెకు చదివి వినిపించి, యెహోవా ఆమెను మర్చిపోలేదని ధైర్యం చెప్పారు. యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలనే ఆమె కోరికను బట్టి కూడా ఆమెను మెచ్చుకున్నారు. ఆమె బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుంది. అంతేకాదు, తన 16 ఏళ్ల అబ్బాయికి కూడా బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉందని చెప్పింది.
తర్వాత రోజు ఆ జంట వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు, తల్లి కొడుకులిద్దరూ వాళ్లకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్‌లోని 1వ పాఠాన్ని అధ్యయనం చేశాక, ఆ జంట వాళ్లను మీటింగ్‌కి ఆహ్వానించారు. వాళ్లు మీటింగ్‌కి రావడమే కాదు, ఇకనుండి ఇద్దరూ స్టడీని కొనసాగించాలని, మీటింగ్స్‌కి క్రమంగా రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ప్యూర్టోరికో
రామోన్ ఇంటింటి పరిచర్యను మొదలుపెట్టిన రోజు, కనీసం ఒక్కరైనా మంచివార్తను వినేవాళ్లు దొరకాలని ప్రార్థన చేశాడు. ఆయన మొదటి ఇంటికెళ్లి తలుపు తట్టినప్పుడు, ఒక స్త్రీ తలుపును కొద్దిగా తెరిచి, బయటికి తొంగిచూసింది. రామోన్ ఆమెను పలకరించి, పరిచయం చేసుకున్నాడు. ఇంకా మాట్లాడేలోపే ఆ స్త్రీ ఇలా అంది: “ఈరోజు కోసం నేను ఎంత ఎదురుచూశానో మాటల్లో చెప్పలేను. మీరు నా ఇంటికి రావాలని నేను ఎప్పటినుండో ప్రార్థన చేస్తున్నాను.”
కొన్ని సంవత్సరాల క్రితం, యెహోవాసాక్షులు ఆమెను కలిశారని, ఒకసారి మీటింగ్‌కి కూడా వచ్చిందని చెప్పింది. కానీ ఇల్లు మారడంతో, యెహోవాసాక్షుల్ని ఆమె మళ్లీ కలవలేకపోయింది. కరోనా వల్ల, ఇంటింటి పరిచర్యను ఆపేశామని రామోన్ వివరించాడు. తర్వాత కీర్తన 37:29 చదివి వినిపించి, బైబిలు స్టడీ గురించి చెప్పాడు. ఆ స్త్రీ వెంటనే బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుంది. ఒక సహోదరి ఆమెను కలిసి స్టడీ మొదలుపెట్టేలా రామోన్ ఏర్పాటు చేశాడు.
ఈ అనుభవం గురించి రామోన్ తర్వాత ఇలా అన్నాడు: “యెహోవా, దేవదూతలు మనల్ని మంచివార్త వినేవాళ్ల దగ్గరకు నడిపిస్తున్నారని అనడంలో ఏ సందేహం లేదు.”
అమెరికా
కేట్లిన్ థాంసన్ అనే సహోదరి కెంటకీలో ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్లింది. ఆ ఇంటి గుమ్మం దగ్గర ఒక బాక్స్ మీద లేఖనాలు రాసున్నాయి. “యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అని రాసిన ఒక బోర్డు కూడా ఉంది. కేట్లిన్ ఆ ఇంటి తలుపు తట్టినప్పుడు, ఒక ఆవిడ బయటకు వచ్చింది. కేట్లిన్ తనని తాను పరిచయం చేసుకుంది. కరోనా సమయంలో యెహోవాసాక్షులు ఇంటింటికి వెళ్లి పరిచర్య చేయలేకపోయారని, దానికి బదులు ఉత్తరాల ద్వారా, ఫోన్‌ల ద్వారా చుట్టుపక్కల వాళ్లని ఓదార్చి, ప్రోత్సహించారని చెప్పింది. అలాగే ఆమె బాగోగుల గురించి, ఇంటి వాళ్ల గురించి కేట్లిన్ అడిగినప్పుడు, కరోనా సమయంలో వాళ్ల నాన్నగారు చనిపోయారని ఆ స్త్రీ చెప్పింది. తర్వాత ఇలా అంది: “మీరు రాసిన ఉత్తరాలు నాకు అందాయి. సరైన సమయంలో దేవుడు నాకు అవసరమైంది ఇచ్చాడని అనిపించింది.” తర్వాత కేట్లిన్ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బ్రోషుర్‌లోని 2వ పాఠాన్ని ఆ స్త్రీతో చర్చించింది. వాళ్లు పాఠంలోని లేఖనాల్ని చదివి, భవిష్యత్తులో చనిపోయినవాళ్లు బ్రతుకుతారనే విషయం గురించి మాట్లాడుకున్నారు. దాంతో ఆ స్త్రీ ఏడ్వడం మొదలుపెట్టింది. సరిగ్గా ఆ రోజే వాళ్ల నాన్నగారు చనిపోయి సంవత్సరమైందని చెప్పింది. ఆ స్త్రీ కేట్లిన్‌కు తన ఫోన్‌నెంబర్ ఇచ్చి, తర్వాత రమ్మని కూడా చెప్పింది. కాసేపటికి, కేట్లిన్‌కు ఆమె నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఇలా ఉంది: “ఈ రోజు మీరిచ్చిన ఓదార్పు నాకెంతో అవసరం—థాంక్యూ!”
ఇంటింటి పరిచర్యను తిరిగి మొదలుపెట్టడాన్ని, బైబిలు అధ్యయనాల్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని యెహోవా దీవిస్తున్నాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు! ముందుముందు ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో చూద్దాం.—యోహాను 4:35.
బహమాస్
కామెరూన్
పనామా
ఫిలిప్పీన్స్
దక్షిణ కొరియా
అమెరికా