కంటెంట్‌కు వెళ్లు

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు

సెప్టెంబరు 29, 2022
ప్రపంచ వార్తలు

రష్యా, లిథువేనియాలలో ఆరాధించే స్వేచ్ఛ విషయంలో యూరోపియన్‌ కోర్టు దాని తీర్పుల్ని ఖరారు చేసింది

రష్యా, లిథువేనియాలలో ఆరాధించే స్వేచ్ఛ విషయంలో యూరోపియన్‌ కోర్టు దాని తీర్పుల్ని ఖరారు చేసింది

2022, సెప్టెంబరు 7న యెహోవాసాక్షులకు సంబంధించి రెండు ప్రాముఖ్యమైన తీర్పుల విషయంలో యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు (ECHR) దాని తీర్పుల్ని ఖరారు చేసింది. 2017 లో రష్యా యెహోవాసాక్షుల పనిని నిషేధించడం అన్యాయమని ఇంతకుముందే ECHR 2022, జూన్‌ 7న చెప్పింది. అదేరోజు ECHR మరో తీర్పుని కూడా ప్రకటించింది. బ్రదర్‌ స్టానిస్లావ్‌ టెలియాట్నికోవ్‌, తన మనస్సాక్షి ప్రకారం మిలిటరీలో చేరనందుకు ఆయనపై లిథువేనియా ప్రభుత్వం తీసుకున్న చర్యలు యూరోపియన్‌ మానవ హక్కుల కన్వెన్షన్‌కి వ్యతిరేకంగా ఉన్నాయని ECHR తీర్పును ఇచ్చింది.

రష్యాగానీ, లిథువేనియాగానీ జూన్‌ 7న ఇచ్చిన ఆ తీర్పుల్ని తిరిగి పరిశీలించమని కోరుతూ ECHR గ్రాండ్‌ ఛాంబర్‌కు అప్పీల్‌ చేసుకోలేదు. కాబట్టి ఇవ్వబడిన తీర్పులకు లోబడాలని, అంటే అభ్యర్థులకు తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ECHR ఆ రెండు దేశాల్ని ఆదేశించింది.

2022, జూన్‌ 11న ECHR ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిన పని లేకుండా రష్యా దాని నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే 2022, సెప్టెంబరు 16కు ముందు, మానవ హక్కుల యూరోపియన్‌ కన్వెన్షన్‌ని రష్యా ఉల్లంఘించినట్టు కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటి విషయంలో తీర్పు ఇచ్చే అధికారం ECHRకు ఇంకా ఉంది.

ECHR ఖరారు చేసిన తీర్పులు అమలవ్వాలని, ఆరాధించే స్వేచ్ఛా హక్కు గౌరవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. అప్పుడు శాంతిని ప్రేమించే క్రైస్తవులు ‘అన్ని విషయాల్లో దైవభక్తిని చూపిస్తూ నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవించగలుగుతారు.’—1 తిమోతి 2:1, 2.