కంటెంట్‌కు వెళ్లు

డిసెంబరు 28, 2022
ప్రపంచ వార్తలు

JW.ORG వెబ్‌సైట్‌ పదేళ్ల ప్రయాణం1వ భాగం

డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి వచ్చిన బైబిలు ఆధారిత వీడియోలు, ప్రచురణలు

JW.ORG వెబ్‌సైట్‌ పదేళ్ల ప్రయాణం1వ భాగం

ఇంతకుముందు రిపోర్టులో చెప్పినట్టు, 2022 కల్లా యెహోవాసాక్షుల అధికారిక వెబ్‌సైట్‌ 25 వసంతాలు పూర్తిచేసుకుంది. 10 సంవత్సరాల క్రితం అంటే 2012, ఆగష్టు 27న వెబ్‌సైట్‌కి కొన్ని మెరుగులుదిద్ది కొత్తగా విడుదల చేశాం. ఈ jw.org వెబ్‌సైట్‌ వల్ల లక్షలమంది ప్రజలు ఎలాంటి ప్రయోజనాలు పొందారో ఈ మూడు భాగాల ఆర్టికల్‌ సిరీస్‌లో తెలుసుకుంటాం.

వీడియోలు: 2012 లో జరిగిన సమావేశాల్లో యెహోవా స్నేహితులవ్వండి అనే కొత్త సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లను డీవీడీ రూపంలో విడుదల చేశారు. అయితే డీవీడీల వాడకం తగ్గిపోయింది, పైగా దాన్ని తయారు చేయడం కూడా ఖర్చుతో కూడిన పని. 2012 లో మన వెబ్‌సైట్‌ రావడం వల్ల, వీడియోలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇంకా సులువైంది. అలా 2013 జనవరిలో, యెహోవా స్నేహితులవ్వండి సిరీస్‌లోని ఎప్పుడైనా ప్రార్థించండి అనే వీడియోని jw.org వెబ్‌సైట్‌లో డిజిటల్‌ రూపంలో విడుదల చేశారు. అప్పటి నుండి 40 కన్నా ఎక్కువ ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి.

2013 లో బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియో కూడా విడుదలైంది. ఆ వీడియోని మనం పరిచర్యలో బాగా ఉపయోగిస్తున్నాం. అది మన బోధనా పనిముట్లలో ఒక విలువైన పనిముట్టుగా ఉంది. అప్పటి నుండి మనం, jw.org వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటనా పనిలో వీడియోలను అందరికి బాగా షేర్‌ చేస్తున్నాం. ఉదాహరణకు 2014, ఆగస్టులో jw.org వెబ్‌సైట్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమం చేసినప్పుడు ప్రజలు మన వీడియోలను దాదాపు 1,50,00,000 సార్లు చూశారు లేదా డౌన్‌లోడ్‌ చేశారు.

jw.org వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసే పనిలో పాల్గొన్న ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “భవిష్యత్తులో జరగబోయే వాటికి యెహోవా మనందర్నీ ఎలా సిద్ధం చేశాడో ఆలోచించినప్పుడు మా విశ్వాసం ఎంతో బలపడింది. ఒక కొత్త పద్ధతిలో వీడియోలను షేర్‌ చేయడం కోసం మేము పెట్టిన ప్రయత్నాలు భవిష్యత్తులో ఇంత ఉపయోగపడతాయని అస్సలు అనుకోలేదు.” ఉదాహరణకు, 2014 అక్టోబరులో JW బ్రాడ్‌కాస్టింగ్‌ విడుదలైనప్పుడు, ఆ నెల మన వీడియోలను ప్రజలు దాదాపు 3,70,00,000 సార్లు డౌన్‌లోడ్‌ చేశారు. 2020 లో కరోనా మొదలైనప్పుడు jw.org వెబ్‌సైట్‌లో ప్రజలు మన వీడియోలను చూడడం, డౌన్‌లోడ్‌ చేయడం చాలా పెరిగింది. 2022 లోనైతే ప్రతీ నెల jw.org వెబ్‌సైట్‌ నుండి మన వీడియోలను ప్రజలు సగటున 26 కోట్ల కన్నా ఎక్కువసార్లు డౌన్‌లోడ్‌ చేశారు.

డిజిటల్‌ ప్రచురణలు: గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది ప్రింట్‌ రూపంలో కాకుండా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లేదా మొబైల్‌ యాప్‌లలో చదవడానికి ఇష్టపడుతున్నారు. 2012 లో మన వెబ్‌సైట్‌ విడుదలవ్వడం వల్ల ప్రజలు ఆన్‌లైన్‌లో పత్రికల్ని చదవడం వీలైంది, అది కూడా ప్రింట్‌ అయిన కాపీ చేతిలోకి రాకముందే! వెబ్‌సైట్‌ కోసం డిజిటల్‌ ప్రచురణల్ని తయారు చేయడం వల్ల 2013 లో JW లైబ్రరీ యాప్‌ని ప్రవేశపెట్టడం కూడా మరింత సులువైంది. ఈ యాప్‌, వెబ్‌సైట్‌కు వెన్నుదన్నుగా ఉంటూ మన డిజిటల్‌ ప్రచురణల్ని చదవడానికి, అధ్యయనం చేయడానికి ఎంతో సహాయం చేస్తుంది.

మొదట్లో, ప్రాదేశిక సమావేశాల్లో విడుదలయ్యే ప్రచురణలు తర్వాతి సంవత్సరం జనవరి వరకు వెబ్‌సైట్‌లో గానీ యాప్‌లో గానీ వచ్చేవి కావు. కానీ 2015 లో జరిగిన ప్రాదేశిక సమావేశాల్లో విడుదలైన ప్రచురణల్ని డిజిటల్‌ రూపంలో వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిసినప్పుడు ప్రేక్షకులు ఎంతో సంతోషించారు. ఆ సంవత్సరం విడుదలైన యేసే మార్గం, సత్యం, జీవం అలాగే యెహోవా దగ్గరకు తిరిగి రండి అనే ప్రచురణల్ని, నిజమైన ప్రేమ అంటే ఏంటి? అనే వీడియోని సహోదరులు వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారు. తర్వాతి సంవత్సరం, అంటే 2016 మే నెలలో వచ్చిన JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమంలో పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు ఆంథనీ మోరిస్‌ యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు అనే బ్రోషుర్‌ విడుదల చేసి, దాన్ని వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కూడా చెప్పాడు. ఇలా ఒక ప్రచురణను ఒకేసారి ప్రపంచమంతటా ఉన్న సహోదరులకు విడుదల చేయడం అదే మొదటిసారి!

మంచివార్తను ప్రకటించడానికి, సహోదరులకు సహాయం చేయడానికి టెక్నాలజీని ఉపయోగించే విషయంలో యెహోవా సంస్థకు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ‘తగిన సమయంలో ఆహారం పెట్టడానికి’ jw.org వెబ్‌సైట్‌ ఇంతగా ఉపయోగపడడం చూసి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.—మత్తయి 24:45.

  • ప్రతీనెల డౌన్‌లోడ్‌ అయిన వీడియోల సంఖ్య

  • నెలలో ప్రతీరోజు వెబ్‌సైట్‌ చూసే వాళ్ల సంఖ్య

  • 2013 జనవరి, ఎప్పుడైనా ప్రార్థించండి వీడియో విడుదల

  • 2013 అక్టోబరు, JW లైబ్రరీ యాప్‌ విడుదల

  • 2014 ఆగస్టు, వెబ్‌సైట్‌ కరపత్రానికి సంబంధించిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం

  • 2014 అక్టోబరు, JW బ్రాడ్‌కాస్టింగ్‌ విడుదల

  • 2015 మే, సమావేశంలో విడుదలైనవి డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి రావడం

  • 2016 మే, యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు ప్రపంచవ్యాప్త విడుదల