కంటెంట్‌కు వెళ్లు

మంగోలియా రాజధాని అయిన ఉలాన్‌ బతోర్‌లో, అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టులో మొదటి వాయిదా జరిగినప్పుడు సాక్షులైన లాయర్లతో స్థానిక సహోదర సహోదరీలు.

ఆగస్టు 24, 2018
మంగోలియా

మంగోలియాలో మత స్వేచ్ఛకు అడ్డుతొలిగింది: యెహోవాసాక్షుల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ అయింది

మంగోలియాలో మత స్వేచ్ఛకు అడ్డుతొలిగింది: యెహోవాసాక్షుల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ అయింది

2018, జూన్‌ 14న మంగోలియా రాజధాని అయిన ఉలాన్‌ బతోర్‌లో యెహోవాసాక్షుల మత సంస్థ గుర్తింపును రెన్యువల్‌ చేస్తూ సిటీ కౌన్సిల్‌ ఆఫీసు ఒక సర్టిఫికెట్‌ పంపింది.

ఉలాన్‌ బతోర్‌లోని యెహోవాసాక్షులకు చట్టపరమైన గుర్తింపును ఇస్తూ జారీచేసిన రెన్యువల్‌ సర్టిఫికెట్‌.

మంగోలియాలోని మత సంస్థలు, వాళ్ల గుర్తింపును ప్రతీ సంవత్సరం రెన్యువల్‌ చేసుకుంటూ ఉండాలి. అక్కడున్న మన సహోదరులు కూడా 1999 నుండి అలానే రెన్యువల్‌ చేసుకుంటూ వస్తున్నారు. కానీ 2015​లో ఉలాన్‌ బతోర్‌లో సిటీ కౌన్సిల్‌ మన గుర్తింపును రెన్యువల్‌ చేయడానికి అంగీకరించలేదు. తర్వాత 2017 జనవరిలో యెహోవాసాక్షుల మత గుర్తింపును రద్దు చేస్తున్నట్లు సిటీ కౌన్సిల్‌ తెలిపింది. ఏదైనా మత గుర్తింపు రద్దు అయితే ఆ మతానికి సంబంధించిన పనులేవీ చేయడానికి వీలుండదు. అలా రద్దు చేయడానికి గల కారణాల్ని చెప్పడానికి కౌన్సిల్‌ ప్రతినిధులు ఇష్టపడలేదు. దాంతో విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సహోదరులు నిర్ణయించుకున్నారు.

అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు విచారణ చేసినప్పుడు రష్యాలో యెహోవాసాక్షుల కార్యకలాపాల్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఉలాన్‌ బతోర్‌ సిటీ కోర్టు కూడా యెహోవాసాక్షుల మత గుర్తింపును రద్దు చేసిందని సిటీ కౌన్సిల్‌ తరఫున లాయర్‌ వివరించారు. అయితే రష్యా తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు విమర్శిస్తున్నాయని, ఈ విషయంపై అంతర్జాతీయ కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని మన తరఫున లాయర్లు వాదించారు. అయితే మరో విషయం ఏంటంటే రష్యా తీర్పు జరగకముందే సిటీ కౌన్సిల్‌ యెహోవాసాక్షుల గుర్తింపును రద్దు చేసింది. కాబట్టి వాళ్ల నిర్ణయానికి రష్యా తీర్పు ఆధారం అయ్యే అవకాశం లేదని మన తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు.

సిటీ కౌన్సిల్‌ సరైన సాక్ష్యాలు లేకుండా నిర్ణయం తీసుకుందని, యెహోవాసాక్షుల పనులు ప్రమాదకరమైనవని చూపించడానికి సరైన ఆధారాలు ప్రవేశపెట్టలేదని చెప్తూ అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు సిటీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని రద్దు చేసింది. అంతేకాదు, సహోదరుల మత స్వేచ్ఛతో పాటు వాళ్ల ప్రాథమిక హక్కులకు కూడా సిటీ కౌన్సిల్‌ భంగం కలుగజేసిందని కోర్టు తీర్పు ఇచ్చింది.

యెహోవాసాక్షి అయిన జేసన్‌ వైస్‌ ఈ కేసు వాదించిన వాళ్లలో ఒకరు ఆయన ఇలా అన్నాడు: “ప్రాథమిక హక్కుల్ని, స్వేచ్ఛను ఆనందించడానికి రాష్ట్ర గుర్తింపు అవసరం లేదు. కానీ ఆ గుర్తింపు లేకపోతే స్వేచ్ఛగా ఆరాధించడానికి వీలుపడదు. రిజిస్ట్రేషన్‌ ఉంటే బైబిళ్లను, బైబిలు ప్రచురణలను తెప్పించుకోవడం, ఆరాధనా స్థలాలను కొనుక్కోవడం, సమావేశ హాళ్లను రెంటుకు తీసుకోవడం వీలవుతుంది. మా సంస్థ గుర్తింపును రద్దు చేస్తే మంగోలియాలో మా మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, మా మత సభ్యులతో కలిసి సహవసించడం కష్టమౌతుందని అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు గుర్తించి ఉలాన్‌ బతోర్‌లో సిటి కౌన్సిల్‌ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. అందుకు మేము సంతోషిస్తున్నాం.”