జనవరి 17, 2023
మెక్సికో
మెక్సికన్ సంజ్ఞా భాషలో కొత్త లోక అనువాదం పూర్తి బైబిలు ఇప్పుడు అందుబాటులో ఉంది
2023 జనవరి 1న, సెంట్రల్ అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన బ్రదర్ అర్మాండో ఒచోవా, మెక్సికన్ సంజ్ఞా భాషలో (LSM) పూర్తి పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఇప్పుడు jw.orgలోను అలాగే JW సంజ్ఞా భాష యాప్‌లోను అందుబాటులోకి వచ్చిందని ప్రకటన చేశారు. ఈ రోమాలు నిక్కపొడుచుకునే ప్రకటనను యల్ తేజ్‌కోట్ అసెంబ్లీ హాల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బ్రదర్ ఒచోవా చేశారు.
సెంట్రల్ అమెరికా బ్రాంచి క్షేత్రంలో, కోవిడ్ 19 మహమ్మారి మొదలైనప్పటి నుండి యెహోవాసాక్షులు ఇంత పెద్ద సంఖ్యలో నేరుగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. మొత్తం 2,317 మంది సహోదర సహోదరీలు ఈ కార్యక్రమానికి నేరుగా హాజరయ్యారు. వాళ్లతో పాటు ఇంకా వేలమంది మెక్సికోలోని అసెంబ్లీ హాళ్లల్లో అలాగే రాజ్యమందిరాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ ద్వారా చూశారు.
హాజరైన వాళ్లల్లో అమెరికన్ సంజ్ఞా భాషలో, LSMలో నిపుణుడైన మిస్టర్ సెర్గియో పెనా అలాగే యుకాటన్ రాష్ట్రంలోని ద ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఇంక్లూషన్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్‌కి జనరల్ డైరెక్టర్ అయిన మిస్ మారియా తెరెసా వాస్క్యూజ్ కూడా ఉన్నారు.
మిస్టర్ పెనా ఇలా అన్నాడు: ‘మెక్సికోలోని యెహోవాసాక్షులందర్నీ మేము చాలా మెచ్చుకోవాలని అనుకుంటున్నాము. 2023 జనవరి 1తో, వినలేని వాళ్లకు LSMలో పూర్తి బైబిలు ఇప్పుడు అందుబాటులో ఉంది. యెహోవాసాక్షులు తయారు చేసిన ఈ అద్భుతమైన ఆణిముత్యాన్ని చూసి నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఇది నిజంగా ఒక కళాఖండం.’
2008, ఆగస్టు నుండి కొత్త లోక అనువాదం బైబిలు LSMలోకి అనువదించడం మొదలైంది. ముందు క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని అనువదించడం మొదలుపెట్టారు. గత 14 ఏళ్లుగా అనువదించబడుతున్న బైబిలు పుస్తకాల్ని కొద్దికొద్దిగా విడుదల చేసుకుంటూ వచ్చారు. అయితే, LSMలో పూర్తి బైబిల్ని విడుదల చేయడం ఇదే మొదటిసారి.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కూడా విడుదలైన ఎన్నో బైబిలు పుస్తకాల నుండి వినికిడి లోపం ఉన్న ప్రచారకులు ప్రయోజనం పొందారు. వాళ్లల్లో ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “మహమ్మారి సమయంలో కూడా ఎన్నో బైబిలు పుస్తకాలు అందుబాటులోకి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. యెహోవా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా పోషిస్తూనే ఉన్నాడు.”
వినికిడి లోపం ఉన్న ఒక సహోదరి ఇలా చెప్తుంది: “కొత్త లోక అనువాదం బైబిలు LSMలోకి రాకముందు సహోదరులు బైబిలు వచనాల్ని నాకోసం సంజ్ఞలు చేసి చూపించేవాళ్లు. అయితే వేర్వేరు సహోదరులు అలా చేసే వాళ్లు కాబట్టి, వాళ్లు ఒకొక్కరు ఒక్కోలా చేసేవాళ్లు దాంతో బైబిలు వచనాల్ని గుర్తుపెట్టుకోవడం నాకు కష్టమైంది. కానీ, ఇప్పుడు బైబిల్ని అర్థం చేసుకోవడానికి నేను ఇంక ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.”
వినికిడి లోపం ఉన్నవాళ్లు అలాగే సరిగ్గా వినలేని సహోదర సహోదరీలు ఈ పూర్తి బైబిలు నుండి చాలా ప్రయోజనం పొందుతారనే నమ్మకంతో ఉందాం. “మంచి భవిష్యత్తు, నిరీక్షణ” ఇచ్చే దేవుని సందేశాన్ని వేరేవాళ్లకు చెప్పడానికి వాళ్లు చేస్తున్న కృషిని యెహోవా ఆశీర్వదించాలని మనం ప్రార్థిద్దాం.—యిర్మీయా 29:11.