కంటెంట్‌కు వెళ్లు

బాంబు పేలడంతో బాగా పాడైన తన ఇంటి ముందు కూర్చున్న సిస్టర్‌ ఓలీనా. ఆమెకు సహాయం చేయడానికి సహోదర సహోదరీలు వెంటనే వచ్చారు

జూలై 4, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #10 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

“నమ్మదగిన వాళ్లుగా ఉంటూ ధైర్యం, శ్రద్ధ” చూపించే విషయంలో ఆదర్శంగా ఉన్న పెద్దలు

అప్‌డేట్‌ #10 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుక్రెయిన్‌లో ఉన్న సహోదర సహోదరీలు తోటి ఆరాధకుల పట్ల నిస్వార్థంగా చెరగని ప్రేమను చూపిస్తూ వస్తున్నారు.

81 ఏళ్లున్న సిస్టర్‌ ఓలీనా ఉదాహరణను చూడండి. జూన్‌ 6న తన ఇంటి పక్కనే ఒక పెద్ద బాంబు పేలింది. దానివల్ల ఆమె పక్క ఇల్లు పూర్తిగా నాశనమై, 23 అడుగుల పెద్ద గుంట ఏర్పడింది. సిస్టర్‌ ఓలీనా ఇల్లు కూడా బాగా పాడైంది.

జరిగినదాని గురించి ఆమె ఇలా చెప్తుంది: “అప్పుడు నేను పడుకుని ఉన్నాను. గోడ కూలిపోయి నా తల పక్కనే పడింది. మొత్తం దుమ్ము, ధూళి కమ్మేసి అంతా చీకటైపోయింది. ఎక్కడ పడితే అక్కడ గాజు ముక్కలు, రాళ్లు ఉన్నాయి. నేను ప్రాణాలతో ఉన్నందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాను.” బాంబు పేలిన కొన్ని నిమిషాలకు, సిస్టర్‌ని చూడడానికి దగ్గర్లో ఉన్న సహోదర సహోదరీలు వచ్చారు. వాళ్లలో ఒక సహోదరుని ఇల్లు కూడా బాగా పాడైంది. సిస్టర్‌ ఓలీనా ఇంకా ఇలా చెప్తుంది: “సహోదరులు వచ్చి చూసినప్పుడు వాళ్ల నోట మాట రాలేదు. కానీ వాళ్లు ఇక్కడ ఉండడమే నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ సమయంలో వాళ్లు నా పక్కనే ఉండేసరికి చాలా ధైర్యంగా అనిపించింది.”

సిస్టర్‌ ఓలీనా వాళ్ల సంఘంలో పెద్దగా సేవచేస్తున్న బ్రదర్‌ సెర్హీ అలాగే కొంతమంది యౌవనస్థులు ఆమెను పలకరించడానికి ఎప్పుడూ వెళ్తూ ఉండేవాళ్లు. సెర్హీ ఇలా చెప్తున్నాడు: “సిస్టర్‌ ఇంటిదగ్గర బాంబు పేలుడు జరిగిందని వినగానే నేను చాలా టెంషన్‌ పడ్డాను. సిస్టర్‌కు చిన్నచిన్న దెబ్బలు తప్ప పెద్ద గాయాలు ఏమీ అవ్వలేదని చూసి, నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. అంత జరిగి, తన ఇల్లంతా పాడైపోయినా సిస్టర్‌ అన్నిటికన్నా ముందు బైబిలు ప్రచురణలు కావాలని అడగడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను.”

మంచి విషయం ఏంటంటే, సిస్టర్‌ బంధువులు ఆమె కోసం ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. సంఘం కూడా ఆమెకు అవసరమైన సహాయాన్ని చేస్తూ ఉంది. పెద్దలు సహోదరి ఓలీనాతో ప్రతీరోజు మాట్లాడుతున్నారు. ఆమె మీటింగ్స్‌ నుండి పూర్తి ప్రయోజనం పొందేలా సహోదర సహోదరీలు ఆమెకు వినికిడి మిషిన్‌ కూడా ఇచ్చారు. ఆమె ఇలా అంటుంది: “కొన్నిసార్లు నేను ఏమీ చేయలేనని అనిపిస్తుంది, అలాంటప్పుడు మీటింగ్స్‌ నాకు బలాన్నిస్తాయి. సహోదర సహోదరీలు నాకు తరచూ ఫోన్‌ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు సంతోషంగా అనిపిస్తుంది.”

ఒక జంట మరో 200 మంది ప్రచారకులతో కలిసి ఒక రాజ్యమందిరం అండర్‌గ్రౌండ్‌ గదిలో తలదాచుకున్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సహోదరి ఇలా రాసింది: “ఆ సమయంలో ప్రేమగల పెద్దలు చూపించిన శ్రద్ధను బట్టి వాళ్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే. వాళ్లను చూసినప్పుడు నాకు దావీదు గుర్తొచ్చాడు. ఆయన చావుకు భయపడకుండా తన గొర్రెల్ని కాపాడడానికి ఒక సింహంతో, ఒక ఎలుగుబంటితో పోరాడాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు పెద్దలు కూడా చావుకు భయపడకుండా ఆహారం, నీళ్లు, పెట్రోల్‌ తెచ్చేవాళ్లు. ఆ పెట్రోల్‌ వల్ల ఆ గదిలో మాకు కాస్తన్నా వెలుగు ఉండేది. దాంతో మేము మీటింగ్‌లు, క్షేత్రసేవా కూటాలు కూడా జరుపుకోగలిగాం. బాంబు దాడులు బాగా జరుగుతున్న సమయంలో కూడా, తమ ఇళ్లలో ఉండిపోయిన సహోదర సహోదరీల్ని ఈ పెద్దలు క్రమంగా కలుస్తూ ఉండేవాళ్లు. వాళ్లకోసం ఆహారాన్ని, నీళ్లను తీసుకొచ్చేవాళ్లు, ప్రేమగా పలకరించి ఓదార్చేవాళ్లు. ఇదంతా చూసి పెద్దల పట్ల నాకున్న గౌరవం బాగా పెరిగింది. ఈ యుద్ధానికి ముందు నాకు వాళ్లు బోధకులుగా, ప్రకటించేవాళ్లుగానే తెలుసు. కానీ ఇప్పుడు వీళ్లు, మనకు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే కాపరులని నాకు అర్థమైంది. నమ్మదగిన వాళ్లుగా ఉంటూ ధైర్యం, శ్రద్ధ చూపించే విషయంలో వాళ్ల ఆదర్శాన్ని బట్టి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది!”

యుక్రెయిన్‌లోని ఒక సంఘంలో ఉన్న ప్రచారకులు యుక్రెయిన్‌ బ్రాంచికి ఉత్తరం రాశారు. సహాయక చర్యల్లో నాయకత్వం వహిస్తున్న సహోదరుల గురించి చెప్తూ, వాళ్లు ఇలా అన్నారు: “ఈ సహోదరుల పట్ల మా కృతజ్ఞతను మాటల్లో చెప్పలేం. తోటి ఆరాధకుల ద్వారా యెహోవా మాపట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో చూసినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం. ‘మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది’ అని యేసు అన్న మాటల్ని మేము కళ్లారా చూశాం.”—యోహాను 13:35.

2022, జూన్‌ 21 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 42 మంది ప్రచారకులు చనిపోయారు

  • 83 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 31,185 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 495 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 557 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,429 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 5 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 8 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 34 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 52,348 మంది ప్రచారకులకు DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 23,433 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు