కంటెంట్‌కు వెళ్లు

యుక్రెయిన్‌లో బహిరంగ పరిచర్య చేస్తున్న ఇద్దరు సాక్షులు

జూలై 18, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #11 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుద్ధం చెలరేగుతున్నా “మంచిపనులు” చేస్తున్నారు

అప్‌డేట్‌ #11 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుక్రెయిన్‌లో బహిరంగ పరిచర్యను తిరిగి మొదలుపెట్టడంతో సహోదర సహోదరీలు ఎంతో సంతోషిస్తున్నారు, ఎన్నో మంచి అనుభవాల్ని కూడా పొందారు. కార్ట్‌లను తిరిగి పెట్టడంతో చాలామంది దానిగురించి మంచిగా మాట్లాడారని, ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి యెహోవాసాక్షుల్ని మిస్‌ అయ్యారని చెప్పినట్లు ప్రాంతీయ పర్యవేక్షకులు, స్థానిక పెద్దలు రిపోర్ట్‌ చేశారు.

ఒడెసా ప్రాంతంలో సెర్హీవ్క సంఘంలోని టాటియాన అనే సహోదరి, కోవిడ్‌కి ముందు తను పరిచర్యలో కలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లాలని అనుకుంది. ఆమె ఇలా చెప్తుంది: “తిరిగి పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుండి మా ప్రయత్నాలను యెహోవా ఎంతగా దీవిస్తున్నాడో నేను స్పష్టంగా చూశాను.” ఈ సహోదరి కోవిడ్‌కి ముందు పరిచర్య చేస్తున్నప్పుడు ఒకామెను కలిసింది, అప్పుడు ఆమె బైబిలు స్టడీకి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు, ఆమె ఎంతో ఇష్టంగా బైబిలు విషయాల్ని విన్నది. బైబిలు స్టడీకి కూడా వెంటనే ఒప్పుకుంది. “ఇంతకుముందు కలిసిన వాళ్లందరికి నేను బైబిలు స్టడీ గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను!” అని టాటియాన చెప్తుంది.

యెవ్‌హెనీ, లిలియా మారియుపోల్‌లో ఉండేవాళ్లు. కానీ వాళ్ల ప్రాంతంలో పరిస్థితులు బాలేకపోయేసరికి వాళ్లు తమ ఇంటిని వదిలి యుక్రెయిన్‌లోని ఒక సురక్షిత ప్రాంతానికి వచ్చేశారు. వాళ్లు పరిచర్యలో క్రమంగా పాల్గొంటున్నారు. దానివల్ల వాళ్ల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలుగుతున్నారు. వాళ్లు ఏం చెప్తున్నారంటే: “మా జీవితం మళ్లీ ముందులా ఉండదని మాకు తెలుసు. అన్ని కోల్పోయాక, జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టడం కష్టమే. కానీ యెహోవా చెయ్యి మాకు సహాయం చేయలేనంత చిన్నది కాదని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. ఆయన పవిత్రశక్తితో, సహోదర సహోదరీలు ఇచ్చే సహాయంతో కొత్త ప్రదేశంలో, కొత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించగలుగుతాం.”

దేశంలోని వేరే ప్రాంతాల్లో ఉంటున్న సహోదర సహోదరీలు మంచి పనులు చేస్తూ కూడా సాక్ష్యమిస్తున్నారు. ఉదాహరణకు, మికోలైవ్‌ నగరంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఒక అంతర్జాతీయ సంస్థకు కొంతమంది సహోదరులు సహాయం చేశారు. సహాయక చర్యలకు ఉపయోగపడే ఒక గోడౌన్‌ని రిపేర్‌ చేశారు. అలాగే ట్యాపుల్ని, పైపుల్ని సరిచేసి, అరలు పేర్చి, అందులో ఎన్నో టన్నుల వస్తువుల్ని సదిరిపెట్టారు. మనం చేసిన పనంతా చూడడానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధి కంటతడి పెట్టుకుని, “మీరు ఇంత బాగా చేస్తారని అస్సలు అనుకోలేదు” అని అంది.

యుక్రెయిన్‌లో ఉన్న మన తోటి సహోదర సహోదరీలు కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా పరిచర్యలో చురుగ్గా పాల్గొనడం వల్ల, “మంచిపనులు” చేయడం వల్ల వచ్చే సంతోషాన్ని పొందుతున్నారు.—గలతీయులు 6:9.

2022, జూలై 13 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారు చేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 42 మంది ప్రచారకులు చనిపోయారు

  • 97 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 28,683 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 524 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 588 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,554 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 5 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 10 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 36 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 52,947 మందికి DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 23,863 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు