కంటెంట్‌కు వెళ్లు

2022 జూలై 23న యుక్రెయిన్‌లో జరిగిన రెండు బాప్తిస్మాలు

ఆగస్టు 12, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #12 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

“శిష్యుల్ని చేసే పనిని యుద్ధం కూడా ఆపలేకపోయింది”

అప్‌డేట్‌ #12 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

2022​లో జరిగిన “శాంతిగా ఉండడానికి కృషిచేయండి!” సమావేశంలో భాగంగా యుక్రెయిన్‌లో ఉన్న ప్రచారకులు, వేరే దేశాలకు వెళ్లిపోయిన ప్రచారకులు జూలై 23-31 తేదీల్లో బాప్తిస్మం తీసుకున్నారు. ఆగస్టు 2 కల్లా యుక్రెయిన్‌కు చెందిన 1,113 మంది ప్రచారకులు బాప్తిస్మం తీసుకున్నారు. యుక్రెయిన్‌లో ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “శిష్యుల్ని చేసే పనిని యుద్ధం కూడా ఆపలేకపోయింది ఎందుకంటే యేసు ఇలా మాటిచ్చాడు: ‘నేను ఎప్పుడూ మీతో ఉంటాను.’”—మత్తయి 28:20.

ఈ కింది అనుభవాల్ని మీతో పంచుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం.

లుహాన్‌స్క్‌ ప్రాంతంలోని క్రెమిన్నకు చెందిన 63 ఏళ్ల నటాలీయాకు ఇద్దరు కూతుళ్లు. ఆమె, ఆమె కూతుళ్లు 1990లలో యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆమె కూతుళ్లిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. కానీ ఆమె అంత ప్రగతి సాధించలేదు. యుద్ధం మొదలయ్యాక, ఒక యెహోవాసాక్షుల కుటుంబం నటాలీయాను తీసుకుని మరో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇవానో-ఫ్రాంకివ్‌స్క్‌లో ఉన్న ఒక రాజ్యమందిరంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు.

నటాలీయా ఇలా అంటుంది: “ఆ ఘోరమైన బాంబు దాడుల తర్వాత నేను నవ్వడమే మర్చిపోయాను. సహోదర సహోదరీలు నా మీద నిజమైన ప్రేమను చూపించారు. వాళ్లు నా అవసరాల గురించి అంతగా పట్టించుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఆ సమయంలో యెహోవా మీద నాకున్న ప్రేమ మళ్లీ చిగురించింది. నేను బైబిల్ని ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. ఒక సహోదరి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు స్టడీ ఇస్తానని చెప్పింది. ఆమె నిజంగా యెహోవా ఇచ్చిన బహుమతి. ... యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా దేవుడైన యెహోవాను ‘నా నిండు హృదయంతో, నా నిండు ప్రాణంతో, నా నిండు మనసుతో ప్రేమించాలి’ అనే గొప్ప ఆజ్ఞకు లోబడుతూ నా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను.”—మత్తయి 22:37.

పోలండ్‌కు వెళ్లిన సిస్టర్‌ ఓలియా “శాంతిగా ఉండడానికి కృషిచేయండి!” అనే సమావేశ అంశం ఉన్న కార్డును పట్టుకుని ఉంది

యుద్ధం మొదలయ్యే నాటికి చెర్కాసికు చెందిన ఓలియ అనే సహోదరి, ఒక బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలు. ఆమె మార్చి 6న, తన కూతురు, మనవరాలితో పోలండ్‌కు వెళ్లిపోయింది. ఆమె ఇలా అంటుంది: “మేము కేవలం మా గో-బ్యాగ్‌లతో అక్కడకి వెళ్లాం. కానీ అక్కడున్న సహోదర సహోదరీలు మా ముగ్గుర్ని చాలా బాగా చూసుకున్నారు. ఇదంతా చూసినప్పుడు యెహోవా సంస్థ ఐక్యంగా పని చేస్తుందని, పవిత్రశక్తితోనే నడిపించబడుతుందని నాకు నమ్మకం కుదిరింది. యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకోవాలనే నా నిర్ణయం కూడా ఎంతో బలపడింది. నా జీవితంలోని చాలా కష్టమైన సమయంలో ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఆయన్ని ఎప్పుడూ సేవిస్తూ, ఆయనకు ఎంతగా రుణపడి ఉన్నానో చూపించాలని కోరుకుంటున్నాను.”

డొనెట్‌స్క్‌ ప్రాంతానికి చెందిన యూలియాకు 18 ఏళ్లు. ఆమె యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగినా, బాప్తిస్మం తీసుకునేంత ప్రగతి సాధించలేదు. యుద్ధం మొదలైనప్పుడు జరిగిన దాని గురించి ఆమె ఇలా అంటుంది: “నేను నేల మీద పడి ఉన్నాను, ఏ నిమిషం ప్రాణాలు పోతాయో తెలీదు. మా ఇల్లు ఉన్న వీధి, ఒక్క ఇంచ్‌ కూడా మిగలకుండా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కానీ మేము ప్రాణాలతో బయటపడగలిగాం. ఇదంతా జరిగాక నేను యెహోవాకు ప్రార్థించాను, ఆయన లక్షణాల గురించి బాగా ఆలోచించాను. అలా ఆయనకు ఇంకా దగ్గరయ్యాను, నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలా వద్దా అనే సందేహాన్ని కూడా వదిలేశాను. యెహోవా నా ప్రార్థనలకు జవాబిస్తూ, నాకు ఎంత దగ్గరగా ఉన్నాడో చూపించాడు. ఇంతకుముందు దేవుని గురించి నాకు పైపైనే తెలుసు కానీ ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను.” యూలియా జూలై 23న బాప్తిస్మం తీసుకుంది.

11 ఏళ్ల డేవిడ్‌, జర్మనీలో తన బాప్తిస్మానికి ముందు

యుద్ధం మొదలైనప్పుడు 11 ఏళ్ల డేవిడ్‌, తన కుటుంబంతో జర్మనీకి వెళ్లిపోయాడు. రెండు సంవత్సరాల క్రితం, అంటే తనకు 9 ఏళ్లున్నప్పుడు బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడు అయ్యాడు. ఇప్పుడు డేవిడ్‌ తనకున్న ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నాడు. తను ఇలా అంటున్నాడు: “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, ఆయనకు ఫ్రెండ్‌గా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టే బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా బాప్తిస్మం తర్వాత సంతోషంతో నాకు కన్నీళ్లు ఆగలేదు ఎందుకంటే ఇప్పుడు నేను యెహోవా కుటుంబంలో ఒకడిని! యెహోవా గురించి, మనుషుల కోసం ఆయన చేయాలనుకుంటున్న వాటి గురించి ఇతరులకు చెప్పడమంటే నాకు ఇష్టం, కాబట్టి ఇప్పుడు నేను పయినీరు అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నాను. నాకు సంఘంలో ఉన్న సహోదర సహోదరీలకు సహాయం చేయడం కూడా ఇష్టం. అందుకే ఏదోక రోజు సంఘ పరిచారకుడు అవ్వాలని అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా, బెతెల్‌ సేవ చేయడం నా కల. 2018​లో నేను ఎప్పుడైతే లివీవ్‌లో ఉన్న బ్రాంచి ఆఫీస్‌ను చూశానో, అప్పటినుంచి అదే నా లక్ష్యంగా మారింది.”

కీవ్‌కు చెందిన ఓలినా 2011​లో ఒక బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలైంది. కానీ ఆమె 10 సంవత్సరాల పాటు నిష్క్రియురాలిగా ఉంది. 2020​లో పెద్దలు ఆమెను కలిసి, యెహోవా దగ్గరకు తిరిగి రండి అనే బ్రోషుర్‌ ఇచ్చారు. ఆమె ఇలా అంటుంది: “అప్పుడు నేను బైబిలు స్టడీ తిరిగి మొదలుపెట్టాను, మీటింగ్స్‌కి కూడా వెళ్లేదాన్ని. కానీ కొంతకాలానికి మళ్లీ ఆపేశాను. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో, యెహోవా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. అప్పుడు ఆయన నన్ను ఎలా కాపాడాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది. అది నాకెంతో మనశ్శాంతిని ఇచ్చింది. నేను రుమేనియాకు పారిపోయినప్పుడు, అక్కడ యెహోవాసాక్షుల్ని కలిశాను. సహోదరులు నామీద చూపించిన ప్రేమ, శ్రద్ధ చూసినప్పుడు యెహోవా నా చుట్టూ వెచ్చని ఒక దుప్పటి కప్పినట్టు అనిపించింది.” ఓలినా జూలై 24న బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా అంటుంది: “యెహోవా నా విషయంలో ఇంత ఓపిక చూపించినందుకు నేను ఆయనకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా సరిపోదు. ‘నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను’ అని నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది.”—ఫిలిప్పీయులు 4:13.

2022, ఆగస్టు 2 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 43 మంది ప్రచారకులు చనిపోయారు

  • 97 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 22,568 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 586 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 613 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,632 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 5 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 10 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 37 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 53,836 మందికి DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 24,867 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు