కంటెంట్‌కు వెళ్లు

నవంబరు 16, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #13 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

ఇంటింటి పరిచర్యను తిరిగి మొదలుపెట్టడం

అప్‌డేట్‌ #13 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

2022 ఆగస్టులో, ఇంటింటి పరిచర్యను యుక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాల్లో తిరిగి మొదలుపెట్టవచ్చనే ప్రకటన చేశారు. మన సహోదర సహోదరీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది బైబిలు విషయాల్ని ఇష్టంగా వింటున్నారని గమనించారు. బైబిలు స్టడీకి ఒప్పుకున్న ఒక వ్యక్తి ఇలా అన్నారు: “ఈ యుద్ధం వల్ల జరుగుతున్న ఘోరాల్ని, కష్టమైన పరిస్థితుల్ని చూశాక దేవుడు మాత్రమే మనుషులందరి సమస్యలను పరిష్కరించగలడని స్పష్టంగా అర్థమైంది.” మన సహోదర సహోదరీలు పరిచర్యలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల్ని ఇప్పుడు చూద్దాం.

లానీవ్సీ సంఘానికి చెందిన రుస్లాన్‌ అనే సహోదరుడికి ఇంటింటి పరిచర్యకు మళ్లీ వెళ్లాలంటే కొంచెం భయమేసింది. అందుకే ధైర్యం ఇవ్వమని, మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూసే ప్రజల దగ్గరికి నడిపించమని ఆయన, ఆయన భార్య యెహోవాకు ప్రార్థించారు. పరిచర్య మొదలుపెట్టిన రెండు గంటల్లో వాళ్లు ఎనిమిది మందితో మాట్లాడారు. వాళ్లందరూ బైబిలు స్టడీకి ఒప్పుకోవడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు.

క్రెమెనెట్స్‌ అనే సంఘం నుండి ఓల్హ అనే సహోదరి, మరో సహోదరితో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, ‘మీరు బైబిలు గురించి చెప్తున్నారా?’ అని అడిగాడు. తర్వాత అతను, “నేను సిగరెట్‌ తాగుతాను, బాగా మందు కొడతాను. కానీ నేను దేవుని ముందు తీర్పు కోసం నిలబడే రోజు త్వరలో వస్తుందని నాకు తెలుసు, ఇలాంటి ప్రవర్తనతో ఆయన ముందు నిలబడడం నాకు ఇష్టంలేదు” అని అన్నాడు. అతనితో బైబిలు స్టడీ చేసేలా ఏర్పాట్లు చేయబడ్డాయి.

లివివ్‌-రియాస్నె-స్కిడ్నీ సంఘానికి చెందిన వాసిల్‌ అనే సహోదరుడు తన క్షేత్రసేవా గుంపుతో కలిసి ఒక ఊరిలో ప్రకటిస్తున్నప్పుడు కొన్నేళ్ల క్రితం ఆయన మాట్లాడిన ఒక ఇల్లు కనిపించింది. అప్పట్లో ఆ ఇంటివ్యక్తి కోపంగా యెహోవాసాక్షులతో మాట్లాడడం తనకి ఇష్టంలేదని చెప్పిన సంగతి ఆయనకు గుర్తొచ్చింది. ఒకసారి తలుపు కొట్టి బైబిలు స్టడీ గురించి చెప్పాలని అనుకున్నాడు. ఆయన తలుపు కొట్టిన వెంటనే, ఇంతకుముందు కలిసిన ఆ స్త్రీ తలుపు తెరిచింది. ఆశ్చర్యకరంగా ఆమె బైబిల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పింది, బైబిలు స్టడీకి కూడా ఒప్పుకుంది. వాసిల్‌ వెంటనే తగిన ఏర్పాట్లు చేశాడు.

యిలిన్‌ట్సీ సంఘానికి చెందిన సెర్హీ అనే సహోదరుడు 2021లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఇంతకుముందు ఎప్పుడూ ఇంటింటి పరిచర్య చేయలేదు. కాబట్టి ఆయనకు ఇంటింటి పరిచర్య చేయాలంటే చాలా కంగారుగా అనిపించింది. అందుకే ప్రీచింగ్‌కి ప్రిపేర్‌ అవ్వడానికి చాలా సమయం వెచ్చించాడు. “ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న వీడియోలను నేను చాలాసార్లు చూశాను. ఇక నాకు కావాల్సింది ధైర్యం మాత్రమే” అని సెర్హీ అన్నాడు. ప్రీచింగ్‌ చేసిన తర్వాత తనకు కంగారు పోయిందని, బదులుగా ఇతరులకు మంచివార్త చెప్పే అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుందని చెప్పాడు.

రోజ్డీల్‌ సంఘానికి చెందిన నికోల్‌ అనే సహోదరి 2022, ఆగస్టులో బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలు అయ్యింది. ఆమె ఇలా చెప్పింది: “నేరుగా వెళ్లి పరిచర్య చేయాలంటే నాకు చాలా గుండెదడగా, భయంగా అనిపించింది, కానీ అలా పరిచర్య చేసిన తర్వాత యెహోవా గురించి ప్రజలతో కలిసి మాట్లాడడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో నేను స్వయంగా చూశాను!”

ఇద్దరు సహోదరీలు ఇంటింటి పరిచర్య చేస్తున్నారు

2022, నవంబరు 11 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 46 మంది ప్రచారకులు చనిపోయారు

  • 97 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 12,569 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 590 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 645 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,722 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 6 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 19 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 63 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 53,948 మందికి DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 25,983 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు