కంటెంట్‌కు వెళ్లు

మళ్లీ దాడులు జరగవు అనిపించిన ప్రాంతాల్లోని ఇళ్లను బాగుచేస్తున్న నిర్మాణ వాలంటీర్లు

డిసెంబరు 29, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #15 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులు ఉన్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

అప్‌డేట్‌ #15 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులు ఉన్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

2022 ఫిబ్రవరిలో, యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు 3000మంది సహోదర సహోదరీల ఇళ్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసం అయ్యాయి. ఆగస్టు నుండి విపత్తు సహాయక డిపార్ట్‌మెంట్‌ (DRD) అలాగే స్థానిక డిజైన్‌ నిర్మాణ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షణలో, మళ్లీ దాడులు జరగవు అనిపించిన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను యుక్రెయిన్‌లోని సహోదరులు రిపేర్లు చేయడం మొదలుపెట్టారు. వాళ్లు ఇంటి పైకప్పులను, కిటికీలను ఇంకా వేరే చిన్నచిన్న రిపేర్లు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఇల్లు పూర్తిగా దెబ్బతినుంటే వాళ్లకున్న కార్‌షెడ్‌ను చిన్న ఇంటిలా మారుస్తున్నారు. అలా ఇప్పటివరకు 37 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, ఇంకా 48 ప్రాజెక్టుల పని జరుగుతుంది.

ఆ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో నిర్మాణ పని చేయడం సవాలుతో కూడుకున్న విషయం అనే చెప్పవచ్చు. కానీ, విపత్తు సహాయక పనులు చేపట్టడానికి సహోదరులు వెనకాడలేదు. కీవ్‌లోని, వెల్కా డిమెర్కాలో ఉంటున్న 70 ఏళ్ల స్విట్‌లానా అనే సహోదరి ఇలా చెప్తుంది: “మా ఇంటి పైకప్పు, ఇంటి ముందు భాగం బాగా దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించడానికి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. కానీ, సహోదరులు వచ్చి కేవలం 3 రోజుల్లోనే ఆ పనంతా పూర్తిచేసేశారు. యెహోవా నా విషయంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు!”

విపత్తు సహాయక పని మన పరిచర్యకు ఎంతగానో సహాయం చేసిందని కీవ్‌లోని, హొరెన్కాలో ఉంటున్న నదీయా అనే సహోదరి చెప్తుంది. ఆమె ఇలా అంటోంది: “విపత్తు సహాయక పని అందరికి పెద్ద సాక్ష్యమిచ్చింది. నాకు పరిచయం లేనివాళ్లు కూడా యెహోవాసాక్షుల మధ్య ఉండే నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. నా తోటి ఆరాధకులు నాకు సహాయం చేయడానికి వచ్చారంటే వాళ్లు అస్సలు నమ్మలేకపోతున్నారు.”

తమ సొంత ఇళ్లను పోగొట్టుకున్న వాళ్లు సైతం సహాయం చేస్తున్నారు. యవెన్‌, టెటియానా అనే జంట అదే చేశారు. మిసైల్‌ దాడివల్ల వాళ్ల ఇల్లు ధ్వంసం అయ్యింది. కానీ వాళ్లు, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించే బదులు తోటి ఆరాధకులకు సహాయం చేయడంలో కష్టపడి పనిచేస్తున్నారు. యవెన్‌ ఇలా అంటున్నాడు: “ఎప్పుడూ వేరేవాళ్లకు సహాయం చేయాలన్నదే మా ముఖ్య లక్ష్యం. అలా వేరేవాళ్లకు సహాయం చేయడం మా సమస్యలను తట్టుకోవడానికి సహాయం చేస్తుంది.”

కీవ్‌లోని, వెల్కా డిమెర్కాలో దెబ్బతిన్న ఇంటిని బాగుచేయడానికి ముందు, బాగుచేసిన తర్వాత

అదేవిధంగా, కీవ్‌లోని హోస్టోమెల్‌లో ఉంటున్న మన సహోదరియైన లిడియా ఇంటిని, సహోదరులు బాగుచేసిన తర్వాత ఆమెకు కూడా విపత్తు సహాయక పనుల్లో స్వచ్ఛందంగా పనిచేయాలని అనిపించింది. ఆమె ఇలా అంటుంది: “16 మంది సహోదర సహోదరీలు, 2 వారాల పాటు మా ఇంటిని బాగుచేశారు. నాకు అప్పుడు కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది. అందుకే, వేరేవాళ్లకు సహాయం చేయాలని నాకు కూడా అనిపిస్తుంది.”

యుక్రెయిన్‌ బ్రాంచ్‌ కమిటీలో సేవ చేస్తున్న ఒక సహోదరుడు ఈ మధ్యే విపత్తు సహాయక పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, ఇళ్లను పోగొట్టుకున్న సహోదర సహోదరీలను పలకరించారు. ఆయన ఇలా అంటున్నాడు: “యుక్రెయిన్‌లో ఉంటున్న సహోదరులు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. అయితే, ఈ యుద్ధం వాళ్ల మధ్య ప్రేమను ఇంకా పెంచింది. మన సహోదరులకు సహాయం చేయడం వల్ల ఇప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ పరిచర్యను చేస్తున్నారు; అలాగే 2కొరింథీయులు 9:12 చెప్తున్నట్టు, “దేవునికి ఎన్నో కృతజ్ఞతలు” చెప్తున్నారు. అది చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.”

2022, డిసెంబరు 20 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ కింది సమాచారం అందింది. అయితే, ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారు చేసినవి. నిజానికి, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు కంటే ఇంకా ఎక్కువ నష్టమే జరిగి ఉండవచ్చు. ఎందుకంటే, దేశంలో ఉన్న అన్నీ ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 47 మంది ప్రచారకులు చనిపోయారు

  • 97 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 11,477 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 590 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 645 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,722 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 7 రాజ్య మందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 19 రాజ్య మందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 68 రాజ్య మందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 26 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 54,212 మందికి DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 26,892 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు