మార్చి 11, 2022
యుక్రెయిన్
అప్‌డేట్ #2 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ
మారియుపోల్ లాంటి ప్రాంతాల్లో బాగా యుద్ధం జరగడం వల్ల కరెంట్-ఇంటర్నెట్ లేవు, హీటర్లు-టెలిఫోన్‌లు పనిచేయడం లేదు. చాలా ఇళ్లల్లో కిటికీలు పూర్తిగా పగిలిపోయాయి. దాచుకున్న నీళ్లు అయిపోవస్తున్నాయి. 2,500 కంటే ఎక్కువమంది సహోదర సహోదరీలు మారియుపోల్‌లోనే చిక్కుకుపోయారు. బూచా, షెర్నిహివ్, హాస్టొమెల్, ఇర్పిన్, కియివ్, సుమీ లాంటి నగరాల్లో కొన్ని దారుల్ని తెరవడంవల్ల కొంతమంది అక్కడ నుండి బయటపడగలిగారు. దాంతో మన సహోదర సహోదరీల్లో చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోగలిగారు.
హాస్టొమెల్‌లో పెద్దగా, పయినీరుగా సేవ చేస్తున్నా 36 ఏళ్ల సహోదరుడు తన భార్యను, తల్లిదండ్రులను తీసుకుని అక్కడనుండి వచ్చేశాడు. వాళ్ల నగరంలో దాడులు మొదలైనప్పటి నుండి ఏమేమి జరిగాయో ఇలా చెప్తున్నాడు:
“మా ఇంటి పైన హెలికాప్టర్‌లు వెళ్తున్న శబ్దం వినిపించేది. రోడ్లమీద ఎక్కడ చూసినా ఆర్మీ వాహానాలే కనిపించేవి. మేము మా ఇంటి అండర్‌గ్రౌండ్‌లో ఒక గదిలో ఉన్నప్పుడు, ఒక రోజు సైనికులు ఇంట్లోకి దూసుకొచ్చారు. ఒకరైతే మా గదిలోకి కాల్పులు జరిపారు. కొన్ని బులెట్లు మా అమ్మ గో-బ్యాగ్‌కి తగిలాయి, కానీ మాలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. దాదాపు మూడు-నాలుగు గంటలు ఏకదాటిగా బాంబులు పేలుస్తున్నా, కాల్పులు జరుపుతున్నా మేము మాత్రం చీమ చిటుక్కుమనకుండా ఉన్నాం. … ఆ తర్వాతి రోజు ఉదయం, అక్కడనుండి పారిపోవడానికి కార్‌లో బయలుదేరుతున్నప్పుడు మాకు దగ్గర్లోనే యుద్ధం మొదలైంది. రోడ్లమీద అంతా యుద్ధ ట్యాంక్‌లు ఉన్నాయి. మేము అలా బయటికి రావడం ప్రమాదకరమే, కానీ అక్కడే ఉండిపోవడం ఇంకా ప్రమాదకరం.
“ఆ సంఘటనలన్నీ మా జీవితంలో పెద్ద మార్పుల్ని తీసుకొచ్చాయి. ఇలాంటి కష్ట సమయాల్లో చాలా బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో మేము నేర్చుకున్నాం. ఉదాహరణకు, రేపటి గురించి ఆందోళన పడకూడదని, కనీస అవసరాలతో తృప్తి పడాలని, యెహోవా మీద నమ్మకం ఉంచాలని నేర్చుకున్నాం.”
యుక్రెయిన్‌లోని మన సహోదర సహోదరీలు ఎదుర్కొంటున్న తుఫాన్‌లాంటి పెద్దపెద్ద కష్టాలన్నీ యెహోవాకు పూర్తిగా తెలుసు. ఆయన వాళ్లకు అండగా ఉంటూ ఎప్పుడూ మద్దతిస్తూనే ఉంటాడు.—2 పేతురు 2:9.
2022, మార్చి 10 కల్లా యుక్రెయిన్ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది:
మన సహోదర సహోదరీల పరిస్థితి
ఇద్దరు ప్రచారకులు చనిపోయారు
8 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి
25,407 మంది సహోదర సహోదరీలు యుక్రెయిన్‌లోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు
25 ఇళ్లు ధ్వంసం అయ్యాయి
59 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి
222 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి
7 రాజ్యమందిరాలు పాడైపోయాయి
సహాయక చర్యలు
యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి
10,566 ప్రచారకులకు DRC వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది
9,635 ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు