మార్చి 16, 2022
యుక్రెయిన్
అప్‌డేట్ #3 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ
మారియుపోల్ నగరంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల వల్ల ఇద్దరు సహోదరీలు చనిపోయారని చెప్పడానికి మేము ఎంతో బాధపడుతున్నాం. ఆ నగరంలో జోరుగా జరుగుతున్న యుద్ధం వల్ల, ప్రస్తుతం వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్న 2,000 కంటే ఎక్కువమంది సహోదర సహోదరీలు అక్కడే చిక్కుకుపోయారు. గత కొన్ని రోజుల్లో దాదాపు 150 మంది సాక్షులు అక్కడ నుండి తప్పించుకోగలిగారు. ఒక విపత్తు సహాయక కమిటీలో (DRC) పనిచేస్తున్న సహోదరులు మారియుపోల్‌కి అవసరమైన వస్తువుల్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ల వాహనాల మీద, సహాయం చేయడానికి వచ్చిన వేరే సంస్థల వాహనాల మీద దాడులు జరగడంతో వాళ్లు వెనక్కి రావాల్సి వచ్చింది. ఒక రాజ్యమందిరం, ఒక సమావేశ హాలు ఉన్న బిల్డింగ్ దగ్గర బాంబు పేలింది. ఆ సమయంలో ఆ రాజ్యమందిరం అండర్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక గదిలో దాదాపు 200 మంది సహోదర సహోదరీలు తలదాచుకుంటున్నారు. మన సహోదరులకు ఏం కాలేదుగానీ వాళ్ల వాహనాలన్నీ ధ్వంసం అయ్యాయి. దాంతో ఆ నగరం నుండి తప్పించుకోవడం ఇంకా కష్టమైంది.
తన కుటుంబంతో కలిసి మారియుపోల్ నుండి తప్పించుకున్న ఒక పెద్ద (కింద చిత్రం చూడండి) ఇలా చెప్తున్నాడు: “మా ఇళ్లు, ఉద్యోగాలు పోయాయి, మా స్నేహితులతో మాట్లాడలేకపోయాం. మాములుగా ఒక రోజు పట్టే ప్రయాణం, మాకు ఆరు రోజులు పట్టింది. నగరం నుండి బయటకు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నప్పుడు రోడ్డు మీద సరిగ్గా పేలని బాంబులు కనిపించాయి, వాటినుండి పొగ వస్తూ ఉంది. వెళ్తున్న దారిలో మేము తినడానికి, ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సహోదరులు చేశారు. ఒక తండ్రిలా యెహోవా మమ్మల్ని చూసుకుంటున్నాడని మాకు అనిపించింది ... అది మాలో యెహోవాను పూర్తిగా నమ్మాలనే ధైర్యాన్ని నింపింది.”
యుక్రెయిన్‌లో పరిస్థితుల వల్ల కొంతమంది సహోదరులు యూరప్‌లోని వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఉదాహరణకు, సంఘ పరిచారకుడిగా సేవ చేస్తున్న ఒక సహోదరుడు, ఆయన భార్య, 7, 11, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలతో కలిసి పోర్చుగల్‌లో ఉన్న వాళ్ల బంధువుల దగ్గరకు ప్రయాణించారు. వాళ్లు కూడా యెహోవాసాక్షులే. అయితే ఆ కుటుంబం, సరిహద్దులు దాటడానికి 11 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత నాలుగు రోజుల పాటు 4,000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించి చివరికి వాళ్ల బంధువుల ఇంటికి చేరుకున్నారు. వాళ్లు చేరుకునే సమయానికి మీటింగ్ మొదలవ్వబోతుంది. అయితే వాళ్లకు పోర్చుగీస్ భాష రాకపోయినా, యెహోవాను క్రమంగా ఆరాధించాలనే ఆలోచనతో వాళ్లు మీటింగ్‌లో కూర్చున్నారు. వాళ్ల పరిస్థితి అంత కష్టంగా ఉన్నా, ఆ కుటుంబం ఆనందంగా కనిపించడం చూసినప్పుడు సంఘంలోని సహోదరులు వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
తన కుటుంబంతో కలిసి జర్మనీకు తప్పించుకున్న మరో సహోదరి ఇలా అంటుంది: “బైబిలు చదవడం అలాగే మా జీవితంలో జరిగిన మంచి విషయాలు గురించి, మనకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి ఆలోచించడం ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది ... సహోదరుల ద్వారా యెహోవా మమ్మల్ని నడిపిస్తున్నాడనీ సహాయం చేస్తున్నాడనీ మాకు అనిపించింది. వాళ్లు యుక్రెయిన్‌లో, హంగరిలో, ఇప్పుడు జర్మనీలో మమ్మల్ని చక్కగా ఆహ్వానించారు, చాలా బాగా చూసుకున్నారు.”
యుక్రెయిన్‌లో ఉన్న మన ప్రియమైన సహోదర సహోదరీలందర్నీ యెహోవా ఆదుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తుంది.—కీర్తన 145:14.
2022, మార్చి 16 కల్లా యుక్రెయిన్ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్నీ ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.
మన సహోదర సహోదరీల పరిస్థితి
నలుగురు ప్రచారకులు చనిపోయారు
19 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి
29,789 మంది సహోదర సహోదరీలు యుక్రెయిన్‌లోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు
45 ఇళ్లు ధ్వంసం అయ్యాయి
84 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి
366 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి
16 రాజ్యమందిరాలు పాడైపోయాయి
సహాయక చర్యలు
యుక్రెయిన్‌లో 27 DRCలు పనిచేస్తున్నాయి
20,981 ప్రచారకులకు DRC వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది
11,973 ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు