మార్చి 23, 2022
యుక్రెయిన్
అప్‌డేట్ #4 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ
రోడ్లపై దాడులు, కాల్పులు, బాంబు పేలుళ్లు జరుగుతున్న మారియుపోల్‌లోని మన సహోదర సహోదరీల కోసం మేము తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాం. విచారకరంగా, ఆరుగురు సహోదర సహోదరీలు ఆ బాంబు దాడుల్లో చనిపోయారు. మొత్తంగా యుక్రెయిన్‌లో 10 మంది సహోదర సహోదరీలు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అంతేకాదు వార్తల్లో చెప్పినట్టుగా పోయినవారం 1,000 కంటే ఎక్కువమంది తలదాచుకుంటున్న ఒక థియేటర్ మీద బాంబు దాడి జరిగింది. దానివల్ల మన సహోదరుల్లో కొంతమందికి చిన్నచిన్న గాయాలయ్యాయి కానీ ఎవ్వరూ చనిపోలేదు.
దాదాపు 750 మంది సహోదరులు మారియుపోల్ నుండి బయటపడగలిగారు. కానీ సుమారు 1,600 మంది అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లలో చాలామంది నగరానికి తూర్పు వైపున ఉన్నారు, అది ప్రస్తుతం రష్యా అధీనంలో ఉంది.
ముందటి అప్‌డేట్‌లో చెప్పినట్టుగా ఒక రాజ్యమందిరం, సమావేశ హాలున్న బిల్డింగ్ అండర్‌గ్రౌండ్‌లో దాదాపు 200 మంది సహోదర సహోదరీలు తలదాచుకున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు, వాళ్లు ఇలా చెప్పారు:
“ఆ బాంబు పేలుళ్లు జరుగుతున్నప్పుడు చాలామంది సహోదర సహోదరీలు బాగా భయపడిపోయారు. కొంతమంది ఏడ్వడం మొదలుపెట్టారు. ఆ బాంబు పేలుళ్ల శబ్దం విన్నప్పుడు మేము ఆ బాంబుల వల్ల గానీ, దాన్ని నుండి వచ్చే మంటల వల్ల గానీ చనిపోతామేమో అనుకున్నాం. అప్పుడు ఒక సంఘపెద్ద, అందరం కలిసి రాజ్యగీతాలు పాడదాం అన్నాడు. మేమంతా కలిసి దాదాపు 15 రాజ్యగీతాలు ఒకటి తర్వాత ఒకటి పాడాం. ఆ బాంబు పేలుళ్లకి బిల్డింగ్ ఎంత ఎక్కువగా అదిరితే, మేము అంత గట్టిగా రాజ్యగీతాలు పాడాం. ఆ తర్వాత 27వ కీర్తన చదివి దానిగురించి మాట్లాడుకున్నాం. బైబిల్లో మాకు ఇష్టమైన లేఖనాలేంటో, అవి మమ్మల్ని ఎలా బలపర్చాయో మాట్లాడుకున్నాం. … యెహోవా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతతను, ఓదార్పును ఇచ్చే కరుణగల తండ్రి అని కళ్లారా చూశాం.”—2 కొరింథీయులు 1:3, 4.
స్వయంత్యాగ స్ఫూర్తి చూపించే పెద్దలు, స్థానిక విపత్తు సహాయక కమిటీ (DRC) సభ్యులు తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని తోటి సహోదర సహోదరీల కోసం వెదుకుతూ వాళ్లకు అవసరమైన ఆహారాన్ని, మందుల్ని అందిస్తున్నారు. అలా వెదుకుతున్నప్పుడు సహోదరులు కాల్పుల నుండి తమను తాము కాపాడుకోవడానికి కొన్నిసార్లు నేలమీద పాక్కుంటూ వెళ్లాలి. తోటి ఆరాధకుల కోసం ‘తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్న’ సహోదరుల్ని చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది.—రోమీయులు 16:4.
వంట చేసుకోవడానికి నగరంలో గ్యాస్ లేదు, కరెంట్ లేదు. కాబట్టి అక్కడున్న సహోదరీలు బయట కట్టెల మీద ధైర్యంగా వంట చేస్తున్నారు. అలా తయారు చేసిన ఆహారాన్ని వృద్ధులకు, అంగవైకల్యం ఉన్న ప్రచారకులకు సహోదరులు అందజేస్తారు. చాలామంది సహోదర సహోదరీలు తమ ఇళ్లను, కార్లను, వస్తువుల్ని కోల్పోయారు. కానీ తోటివాళ్లు చూపిస్తున్న ప్రేమను, శ్రద్ధను బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు.
అక్కడున్న ప్రచారకులు కలిసి బైబిలు చదువుతూ, అవకాశం దొరికినప్పుడల్లా బైబిలు గురించి ఇతరులకు చెప్తూ యెహోవాను క్రమంగా ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నారు.
2022, మార్చి 22 కల్లా యుక్రెయిన్ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారు చేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్నీ ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.
మన సహోదర సహోదరీల పరిస్థితి
10 మంది ప్రచారకులు చనిపోయారు
27 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి
33,180 మంది సహోదర సహోదరీలు యుక్రెయిన్‌లోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు
78 ఇళ్లు ధ్వంసం అయ్యాయి
102 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి
484 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి
1 రాజ్యమందిరం ధ్వంసమైంది
4 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి
18 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి
సహాయక చర్యలు
యుక్రెయిన్‌లో 27 DRCలు పనిచేస్తున్నాయి
25,069 మంది ప్రచారకులకు DRC వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది
14,308 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు