కంటెంట్‌కు వెళ్లు

ఎడమ నుండి కుడికి: లివీవ్‌లో బాగా రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌. ఒక సహోదరుని ఇంటిమీద బాంబు పడి ఇల్లు కాలిపోతుంది. మారియుపోల్‌లో ఉన్న తోటి ఆరాధకుల కోసం పెద్దలు ధైర్యంగా వెదుకుతున్నారు

ఏప్రిల్‌ 1, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #5 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

అప్‌డేట్‌ #5 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

విచారకరంగా 2022, మార్చి 29 కల్లా మారియుపోల్‌ నగరంలో మరో ఏడుగురు సహోదర సహోదరీలు చనిపోయారు. మొత్తంగా యుక్రెయిన్‌లో 17 మంది సహోదర సహోదరీలు తమ ప్రాణాలు కోల్పోయారు.

యుక్రెయిన్‌లోని విపత్తు సహాయక కమిటీలు (DRCలు) అవసరమైన వాటిని అందించడానికి అలుపెరగకుండా కష్టపడుతున్నారు. యుద్ధం చెలరేగుతున్న ప్రాంతాల్లో వాళ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ తోటి సహోదర సహోదరీల కోసం వెదుకుతున్నారు.

ఉదాహరణకు, యుద్ధం వల్ల బాగా దెబ్బతిన్న నగరాలైన ఖార్కివ్‌, క్రమాటోర్‌స్క్‌, మారియుపోల్‌లో ఉన్న మన సహోదర సహోదరీల కోసం అవసరమైన ఆహారాన్ని, మందుల్ని, ఇతర వస్తువుల్ని DRCలతో కలిసి పనిచేస్తున్న సహోదరులు అందిస్తున్నారు. ఒక DRC సభ్యుడైతే ప్రతిరోజు 500 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తూ, ఎన్నో మిలిటరీ చెక్‌ పాయింట్‌లను దాటుతూ, దాదాపు 2,700 మంది ప్రచారకులకు ఆహారాన్ని, మందుల్ని అందిస్తున్నాడు.

యుద్ధ ప్రాంతంలో ఉన్న సహోదర సహోదరీల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి వాహనాల్ని కూడా DRCలు ఏర్పాటు చేస్తున్నాయి. చెర్నిహివ్‌ DRCలో పనిచేస్తున్న ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “ఇళ్లమీద బాంబు దాడులు మొదలైనప్పుడు, ఇక ఆ నగరంలో ఉండడం సురక్షితం కాదని స్పష్టమైపోయింది. అక్కడ నుండి బయటపడడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిసిన వెంటనే, పెద్దలు ఆ విషయాన్ని అండర్‌గ్రౌండ్‌ గదుల్లో తలదాచుకున్న ప్రచారకులకు చెప్పాలనుకున్నారు. కానీ కరెంట్‌, ఇంటర్నెట్‌ లేకపోయేసరికి పెద్దలే గబగబా వెళ్లి అందరికీ చెప్పాల్సి వచ్చింది.”

వాళ్లను తరలించడానికి ఒక ట్రావెల్స్‌ కంపెనీ యజమాని ఒప్పుకున్నాడు. ఆయన దగ్గరున్న వాన్‌లు, బస్సులతో మొత్తం తొమ్మిది ట్రిప్‌లు వేసి చెర్నిహివ్‌లో ఉన్న 254 మంది సహోదర సహోదరీల్ని తప్పించాడు. ఒకసారైతే తన బస్సు వెళ్లాల్సిన దారి పాడవ్వడం చూసి, ఆయన తన దగ్గరున్న పెద్దపెద్ద మిషన్‌లు ఉపయోగించి ఆ రోడ్డును బాగుచేశాడు. ఆయన చేసిన సహాయాన్ని సహోదరులు ఎప్పుడూ మర్చిపోరు.

ఈ యుద్ధంలో కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కోల్పోయిన వాళ్లతో కలిసి మేమూ బాధపడుతున్నాం. దేవుని వాక్యమైన బైబిలు ఇస్తున్న నిరీక్షణ ప్రకారం మరణము, ఏడ్పు లేని కాలం కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం.—ప్రకటన 21:3, 4.

చెర్నిహివ్‌ నుండి తప్పించుకున్న దాదాపు 40 మంది ప్రచారకులు సురక్షితమైన ప్రాంతంలోని ఒక రాజ్యమందిరానికి చేరుకున్నారు

2022, మార్చి 29 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్నీ ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 17 మంది ప్రచారకులు చనిపోయారు

  • 35 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 36,313 మంది సహోదర సహోదరీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 114 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 144 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 612 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 1 రాజ్యమందిరం ధ్వంసమైంది

  • 7 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 23 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 DRCలు పనిచేస్తున్నాయి

  • 34,739 ప్రచారకులకు DRC వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 16,175 ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు