కంటెంట్‌కు వెళ్లు

ఎడమ: పోలండ్‌ నుండి వచ్చిన అవసరమైన వస్తువుల్ని అందరికీ పంచిపెట్టడానికి వాన్‌లో పెడుతున్న యుక్రెయిన్‌లోని సహోదర సహోదరీలు. కుడి: హాస్టొమెల్‌లో బాంబు పడి పూర్తిగా పాడైన ఒక సహోదరుని ఇల్లు

ఏప్రిల్‌ 13, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #6 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

అప్‌డేట్‌ #6 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

విచారకరంగా, యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా మన ప్రియమైన సహోదర సహోదరీల్లో ఇంకొంతమంది చనిపోయారు. మొత్తంగా 28 మంది యెహోవాసాక్షులు చనిపోయారని తెలిసింది.

అంతర్జాతీయ వార్తల్లో రిపోర్టు చేసినట్టు, యుద్ధం మొదలైన మొదటి కొన్ని వారాల్లో, కీవ్‌ దగ్గరున్న కొన్ని నగరాల్లో ఉధృతంగా దాడులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో నివసించిన దాదాపు 4,900 మంది ప్రచారకుల్లో 3,500 కన్నా ఎక్కువమంది సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఇంత కష్టమైన పరిస్థితులున్నా మన సహోదరులు తమ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకుంటున్నారో ఈ కింది అనుభవాలు చూపిస్తున్నాయి.

మకరివ్‌ అనే పట్టణంలో సంఘపెద్దగా సేవ చేస్తున్న ఒలెక్సాండర్‌ అనే సహోదరుడు యుక్రెయిన్‌లో సురక్షితమైన మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. అయితే ఆయన క్షేత్రసేవ గుంపులో ఉన్న నలుగురు ప్రచారకులతో కాంటాక్ట్‌ అవ్వలేకపోయేసరికి, యుద్ధం జరుగుతున్న ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లి వాళ్లను వెతకడానికి ప్రయత్నించాడు. ఆయన ఇలా అంటున్నాడు: “యెహోవాకు తన ఆరాధకులు ఎంతో ప్రశస్తమైనవాళ్లని నాకు తెలుసు ... ఒక ప్రచారకుని ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ల ఇంటి మీద బాంబు దాడి జరిగింది. ఆ ఇంటి అండర్‌గ్రౌండ్‌ గదికి ఉన్న తలుపు మూసేసి ఉంది. నేను ఎంత పిలిచినా ఎవ్వరూ పలకలేదు, అప్పుడు నాకు భయమేసింది.” ఒలెక్సాండర్‌ ఆ తలుపును బద్దలుగొట్టి లోపలికి వెళ్లినప్పుడు కొంతమంది కనిపించారు. అక్కడ ప్రచారకులే కాదు, యెహోవాసాక్షులుకాని కొంతమంది ఇరుగుపొరుగువాళ్లు కూడా ఉన్నారు.

యారోస్లావ్‌, ఆయన భార్య (మధ్యలో) అలాగే ఒలెక్సాండర్‌, ఆయన భార్య సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నాక కలిసి భోంచేస్తున్నారు

వాళ్లు అక్కడ 8 రోజులుగా తలదాచుకుంటున్నారని ఆ గదిలో ఉన్న ఒక ప్రచారకుడైన యారోస్లావ్‌ చెప్పాడు. వాళ్ల దగ్గర ఆహారం, నీళ్లు కూడా బాగా తక్కువగా ఉండడంతో ఒక్కొక్కరు రోజుకి కొన్ని బిస్కెట్‌లు, ఒక గ్లాస్‌ నీళ్లు మాత్రమే తీసుకునేవాళ్లు. యారోస్లావ్‌ ఇంకా ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: ‘పరిస్థితులు ఇలా ఉన్నా మేము బైబిల్ని, ప్రచురణల్ని చదువుకుంటూ, ప్రార్థన చేస్తూ ఒకరినొకరం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఒలెక్సాండర్‌ వచ్చి నా పేరు పిలిచినప్పుడు, సైనికులు నన్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చారేమో అనుకున్నాను. నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదేం జరగలేదు, ఆయన మా అందర్నీ కాపాడాడు. మాకోసం ప్రార్థన చేస్తూ, తమ ప్రాణాల్ని కూడా లెక్కచేయకుండా, మమ్మల్ని కాపాడిన సహోదర సహోదరీలున్న ఇంత ప్రేమగల ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఇచ్చినందుకు మేము యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం.’

పిలిప్‌

పిలిప్‌, అలాగే తనతో ఉన్న ఇంకో సహోదరుడు బోరోడియంక నగరంలో ఉన్న వాళ్లకోసం ఆహారాన్ని తీసుకెళ్లాలని అనుకున్నారు. మార్చి 17న వాళ్లు ఆ నగరానికి కార్‌లో వెళ్తుండగా సైనికులు పిలిప్‌ కార్‌ని, ఆహారాన్ని తీసేసుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు సహోదరుల్ని అరెస్ట్‌ చేశారు. చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి అండర్‌గ్రౌండ్‌లో ఒక చిన్న గదిలో వేశారు. అక్కడ మరో ఏడుగురు కూడా ఉన్నారు. రెండు రోజుల తర్వాత వాళ్లను మరో గదికి తీసుకెళ్లి రాత్రంతా బాగా కొట్టారు. పిలిప్‌ ఇలా అంటున్నాడు: “నేను అసలు బ్రతుకుతానని అనుకోలేదు. ఆ సమయంలో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థించాను.”

ఒకసారి పిలిప్‌ని కొడుతున్నప్పుడు ఆయన బిగ్గరగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆహారం లేని వృద్ధ సహోదరీల కోసం, తన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం ప్రార్థించాడు, అలాగే ఇన్ని సంవత్సరాలు సంతోషంగా దేవుని సేవ చేయగలిగినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ గార్డ్‌ ఆయన్ని ఇంతకుముందు ఉన్న గదికి తిరిగి తీసుకెళ్లాడు. తర్వాత, సహోదరులు ప్రమాదకరమైన వాళ్లు కాదని అర్థం చేసుకునేలా సైనికులకు సహాయం చేయమని పిలిప్‌ ప్రార్థించాడు. సహోదరులిద్దరూ గార్డ్‌లకు బైబిలు గురించి చెప్పడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు షిఫ్ట్‌ మారిన ప్రతీ గార్డ్‌కి ప్రకటించారు. అంతేకాదు అక్కడ ఖైదీగా ఉన్న ఒకతను బైబిలు విషయాలపట్ల ఆసక్తి చూపించాడు, ఆయన సహోదరులకు కృతజ్ఞతలు చెప్పాడు. మార్చి 27న ఆ సహోదరులు అలాగే ఆసక్తి చూపించిన వ్యక్తి విడుదలయ్యారు.

బుకాలో ఉంటున్న స్విట్లానా అనే ఒంటరి సహోదరి 2 వారాల పాటు యుద్ధం జరుగుతున్న ప్రాంతంలోనే చిక్కుకుపోయింది. ఆమె ఇలా అంటుంది: “యెహోవా ఇచ్చే శాంతి ఎంత ప్రాముఖ్యమో నేను ముందెప్పటికన్నా ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. మనకు దేవుని శాంతి ఉందంటే, ప్రతిసారి ఏం చేయాలో తెలుస్తుందని కాదు. ఏం చేయాలో తెలియకపోయినా యెహోవా మీద పూర్తిగా ఆధారపడడానికి ఆ శాంతి సహాయం చేస్తుంది.”

యుక్రెయిన్‌లో ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా స్విట్లానా అనే సహోదరి ఒక స్త్రీకి, ఆమె బంధువైన ఒక బాబుకి ప్రకటించింది. వాళ్లంతా సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఒక యెహోవాసాక్షుల కుటుంబం వాళ్లని చేరదీసింది. ఆ ముగ్గురూ, ఆ రాత్రికి వాళ్ల ఇంట్లో ఉండేలా సహోదరులు ఏర్పాటు చేశారు. తర్వాతి రోజు ఆ స్త్రీ మన మీటింగ్‌లకు హాజరౌతానని చెప్పింది. బైబిల్ని, మన ప్రచురణలను ఇవ్వమని కూడా అడిగింది. స్విట్లానా ఇప్పటికి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది.

2022, ఏప్రిల్‌ 12 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్నీ ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 28 మంది ప్రచారకులు చనిపోయారు

  • 48 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 40,778 మంది సహోదర సహోదరీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 278 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 268 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 746 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 1 రాజ్యమందిరం ధ్వంసమైంది

  • 9 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 26 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 41,974 మంది ప్రచారకులకు DRC వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 18,097 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు