కంటెంట్‌కు వెళ్లు

తమ ఇళ్లను వదిలేసి రావాల్సి వచ్చిన దాదాపు 60 మంది సహోదరసహోదరీలు లివీవ్‌లోని రాజ్యమందిరంలో ఉంటున్నారు, అక్కడే జ్ఞాపకార్థ ఆచరణ కూడా జరుగుతుంది

ఏప్రిల్‌ 29, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #7 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

2,10,000 కంటే ఎక్కువమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు

అప్‌డేట్‌ #7 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యెహోవా ఆశీర్వాదం వల్ల యుక్రెయిన్‌లోని సహోదర సహోదరీలు, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను దేశమంతటా జరుపుకున్నారని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. తమ ఇళ్లను వదిలి రావాల్సి వచ్చిన సహోదర సహోదరీల కోసం, పశ్చిమ యుక్రెయిన్‌లోని ఎన్నో రాజ్యమందిరాల్లో జ్ఞాపకార్థ ఆచరణను జరిపారు. చాలావరకు అందరూ చిన్నచిన్న గుంపులుగా కలుసుకున్నారు, అయితే తమ ఇళ్లనుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

ఖార్కివ్‌లోని సహోదర సహోదరీలు ఒక అండర్‌గ్రౌండ్‌ గదిలో జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటున్నారు

జ్ఞాపకార్థ ఆచరణ రోజు, దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఎయిర్‌ రైడ్‌ (విమానాల ద్వారా దాడులు) సైరెన్లు రోజంతా మోగుతూనే ఉన్నాయి. సాయంత్రానికి సైరెన్లు ఆగిపోయాయి. డొనెట్‌స్క్‌ ప్రాంతంలోని డ్రుజ్‌కివ్కాలో ఉంటున్న షెర్హీ ఇలా అంటున్నారు: “బాంబు దాడుల వల్ల జ్ఞాపకార్థ ఆచరణ ఆగిపోకూడదని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆచరణ మొదలవ్వడానికి కాస్త ముందు దాడులు, సైరెన్లు ఆగిపోయాయి.”

కీవ్‌ దగ్గర నెమిషేవ్‌ ప్రాంతంలో ఉంటున్న కొంతమంది వృద్ధులు, ఆరోగ్యం బాలేని ప్రచారకులు ఒక నెలకు పైగా మీటింగ్స్‌కు హాజరవ్వలేకపోతున్నారు. వాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేలా చేయమని యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘపెద్దగా సేవ చేస్తున్న విటలీ వాళ్లకు సహాయం చేశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “హీటర్లు లేవు, కరెంట్‌ లేదు. అందుకే మేము టార్చ్‌లైట్‌ వెలుగులోనే జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకున్నాం. మ్యూజిక్‌ కూడా లేదు, అప్పుడు మా అమ్మాయి వయోలిన్‌ వాయించడంతో మేము పాటలు పాడగలిగాం.”

యుద్ధం బాగా జరుగుతున్న ప్రాంతంలో ఉంటున్న సంఘపెద్ద ఒలెక్సాండర్‌ ఏమంటున్నాడంటే: “జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమంలో భాగంగా మా సంఘ క్షేత్రంలో ఉన్నవాళ్లకు మేము ఉత్తరాలు రాయలేకపోయాం, ఎందుకంటే ఇళ్లమీద బాంబు దాడులు జరగడంతో ఇళ్లలో ఎవ్వరూ లేరు. కాబట్టి మాకు తెలిసిన వాళ్లను, అండర్‌గ్రౌండ్‌ గదుల్లో మాతో కలిసి తలదాచుకున్న వాళ్లను, వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నప్పుడు కలిసి ప్రయాణించిన వాళ్లను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించాం. వాళ్లలో ఎక్కువశాతం మంది ఇంతకుముందు ఎప్పుడూ యెహోవాసాక్షులు చెప్పేది వినడానికి ఇష్టపడలేదు. అయితే వాళ్లలో చాలామంది జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చారు.”

యుక్రెయిన్‌లో ఒక జంట కరెంట్‌ లేకపోయేసరికి కొవ్వొత్తులు పెట్టుకుని జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతున్నారు. దగ్గర్లోని ఒక ఊరిలో ఉన్న జనరేటర్‌తో ఫోన్‌ని ఛార్జ్‌ చేసుకున్నారు

యుక్రెయిన్‌లో ఉన్న అన్నీ సంఘాల నుండి మాకు ఇంకా పూర్తి రిపోర్టులు అందలేదు కానీ 2,10,000 కంటే ఎక్కువమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారని మాత్రం తెలిసింది.

జ్ఞాపకార్థ ఆచరణ గురించి యుక్రెయిన్‌లో ఉన్న ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “తీరానికి దగ్గర పడ్డామని నావికులు లైట్‌హౌస్‌ని చూసి ఎలాగైతే తెలుసుకుంటారో, యెహోవా రోజు ఇంకెంతో దూరంలో లేదని ఈ జ్ఞాపకార్థ ఆచరణ నాకు మరింత స్పష్టం చేసింది. ఈ సంవత్సరం జరిగిన జ్ఞాపకార్థ ఆచరణ నా విశ్వాసాన్ని ఇంకా బలపర్చిందని చెప్పడంలో సందేహం లేదు.”

2022, ఏప్రిల్‌ 21 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 35 మంది ప్రచారకులు చనిపోయారు

  • 60 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 43,792 మంది సహోదర సహోదరీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 374 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 347 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 874 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 1 రాజ్యమందిరం ధ్వంసమైంది

  • 10 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 27 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • 44,971 మంది ప్రచారకులకు DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 19,961 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు