జూన్ 10, 2022
యుక్రెయిన్
అప్‌డేట్ #9 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ
27 విపత్తు సహాయక కమిటీల (DRCల) సహాయంతో, తమ ఇళ్లను వదిలేసి వచ్చిన సహోదర సహోదరీలకు యుక్రెయిన్ బ్రాంచి సహాయం చేస్తూ ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు 250 టన్నుల అవసరమైన వస్తువులు పోలండ్ నుండి వచ్చాయి. వాటిలో ఆహారం, బట్టలు, శుభ్రతకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. అంతేకాదు యుక్రెయిన్‌లో సురక్షితమైన ప్రాంతాల్లో ఉన్న సహోదర సహోదరీలు కూడా 80 టన్నుల కన్నా ఎక్కువ ఆహారాన్ని పంపించారు.
DRCలో పనిచేస్తున్న సహోదరుల నుండి పొందిన సహాయం గురించి కీవ్‌కు చెందిన వాలంటీన అనే సహోదరి ఇలా రాసింది: “దాడులు మొదలయ్యాక మా నగరంలో ఉండడం ఇక ప్రమాదకరమని స్పష్టమైంది. కాబట్టి చెర్కాసి ప్రాంతంలో ఉన్న ఓ చిన్న ఊరికి వెళ్లిపోయాను. నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది. స్థానిక సంఘంలో ఉన్న సహోదర సహోదరీలు నా పట్ల ఎంతో శ్రద్ధను చూపించారు. ఆహారం, శుభ్రతకు సంబంధించిన వస్తువులున్న ఎన్నో బాక్సులు నాకు ఇచ్చారు. ఈ సహాయమంతటిని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ బాక్సుల్లో, 4 ఏళ్ల బ్లాంకా గీసిన ఒక బొమ్మ, రంగురంగుల పోస్ట్‌కార్డు కూడా ఉన్నాయి ... నేను వాటిని గుర్తుగా దాచిపెట్టుకుంటాను. ఇంత సహాయం చేసినందుకు నా సహోదరులందరికీ, మరి ముఖ్యంగా యెహోవాకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.”
సీవెరోదోనెట్‌స్క్‌కు చెందిన 83 ఏళ్ల వాలంటీన అనే ఇంకో సహోదరి అనుభవాన్ని చూడండి. అంగవైకల్యంతో బాధపడుతున్న ఆమె ఇలా రాసింది: “యుద్ధానికి ముందే నా ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. అప్పటినుండి నేను ఒంటరిగా జీవిస్తున్నాను. రోజంతా నగరం మీద బాంబు దాడులు జరుగుతున్నప్పుడు నాకు చాలా భయమేసింది. నీళ్లు, కరెంట్, గ్యాస్ లేవు, ఇంటర్నెట్ కూడా అంతంత మాత్రమే. ఆ సమయంలో తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సహోదరులు చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను.”
ఆమె ఇంకా ఇలా అంటుంది: “తర్వాత సహోదరులు నన్ను, వికలాంగులైన మరో ఇద్దరు సహోదరీల్ని డినిప్రో అనే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ మేము ఉండడానికి ఏర్పాట్లు చేశారు. నేను ప్రస్తుతం ఒక యెహోవాసాక్షుల కుటుంబంతో ఉంటున్నాను. వాళ్లు నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు. నేను మీటింగ్‌లకు హాజరై, కామెంట్లు చెప్పేలా నాకు ఒక స్మార్ట్‌ఫోన్ కూడా ఇచ్చారు. సహోదరులు నా మీద చూపించిన దయను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.”
యుక్రెయిన్‌లో ఉన్న మన ప్రియమైన సహోదర సహోదరీలకు ‘మంచిదేదీ కొదువ కాకుండా’ మన ప్రేమగల పరలోక తండ్రైన యెహోవా చూసుకుంటున్నాడు. (కీర్తన 34:10) ఇదంతా చూసినప్పుడు మా మనసులు సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోతున్నాయి.
2022, జూన్ 7 కల్లా యుక్రెయిన్ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.
మన సహోదర సహోదరీల పరిస్థితి
42 మంది ప్రచారకులు చనిపోయారు
82 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి
46,145 మంది ప్రచారకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు
469 ఇళ్లు ధ్వంసం అయ్యాయి
540 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి
1,405 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి
5 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి
8 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి
33 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి
సహాయక చర్యలు
యుక్రెయిన్‌లో 27 DRCలు పనిచేస్తున్నాయి
50,663 మంది ప్రచారకులకు DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది
22,995 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు