కంటెంట్‌కు వెళ్లు

కుడి: యుద్ధం బాగా జరుగుతున్న ప్రాంతాలకు తరచూ వెళ్లే సహోదరుల్లో కొంతమంది. వాళ్లు వెళ్లినప్పుడల్లా అవసరమైనవి ఇస్తారు అలాగే తప్పించుకోవాలని అనుకుంటున్న వాళ్లకు సహాయం చేస్తారు. ఎడమవైపు పైనున్న చిత్రం: బాంబు పేలడంతో వచ్చిన అలికిడి వల్ల ఈ ఇల్లు కూలిపోకముందే త్రుటిలో తప్పించుకున్న సాక్షుల కుటుంబాన్ని సహోదరులు కాపాడారు

ఏప్రిల్‌ 27, 2022
యుక్రెయిన్‌

అవసరమైనవి అందిస్తూ, చిక్కుకుపోయినవాళ్లను తరలిస్తున్న యుక్రెయిన్‌లోని ధైర్యవంతులైన సహోదరులు

అవసరమైనవి అందిస్తూ, చిక్కుకుపోయినవాళ్లను తరలిస్తున్న యుక్రెయిన్‌లోని ధైర్యవంతులైన సహోదరులు

2022, ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది. అయితే యుద్ధం తీవ్రంగా జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నో వేలమంది యెహోవాసాక్షులు చిక్కుకుపోయారు. యుక్రెయిన్‌లోని క్రేమెన్‌చుక్‌ అలాగే పోల్‌టావా నగరాలకు చెందిన 21 సహోదరులు నిజమైన క్రైస్తవ ప్రేమను చూపిస్తున్నారు. వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్ధం బాగా జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి మన సహోదర సహోదరీలను తప్పిస్తున్నారు, అవసరమైనవాటిని వాళ్లకు అందిస్తున్నారు.

ఈ సహోదరులు యుద్ధం బాగా జరుగుతున్న ప్రాంతాలకు అంటే ఖార్కివ్‌ లాంటి ప్రాంతాలకు, ఆరు వారాల్లోనే దాదాపు 80 సార్లు వెళ్లి వచ్చారు. వాళ్లు ఇప్పటికి సుమారు 50,000 కిలోమీటర్లు ప్రయాణించి, దగ్గరదగ్గరగా 400 మంది సహోదర సహోదరీలను కాపాడారు.

ఖార్కివ్‌ నుండి సహోదరులు తప్పించిన కొంతమంది ప్రచారకులు, పిల్లలు

ఇప్పటివరకు వాళ్లు 23 టన్నుల ఆహారాన్ని, మందుల్ని, పెట్రోల్‌ని, అవసరమైన ఇతరవాటిని అందజేశారు. అయితే ప్రతిసారి సహోదరులు బయలుదేరక ముందు, యుద్ధం ఎక్కడెక్కడ బాగా జరుగుతుందో చూసుకొని ఏ దారిలో వెళ్తే సురక్షితంగా ఉండొచ్చో జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుని వెళ్తారు. దారిలో చాలా చెక్‌ పాయింట్‌ల దగ్గర కార్లను ఆపి సోదా చేస్తారు కాబట్టి వెళ్లి రావడానికి సహోదరులకు అప్పుడప్పుడు 19 గంటలు కూడా పడుతుంది.

వాళ్లు అలా వెళ్తున్నప్పుడు పైన యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ల చుట్టూ బాంబు దాడుల వల్ల పాడైపోయిన బిల్డింగ్‌లు, ట్యాంక్‌లు, కార్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దగ్గర్లో బాంబు పేలినప్పుడు భూమి అదరడం కూడా సహోదరులకు తెలుస్తుంది.

2022, ఏప్రిల్‌ 2న రోమన్‌ అనే సహోదరుడు ఖార్కివ్‌లో ఉన్న సహోదర సహోదరీలకు అవసరమైన వాటిని అందించడానికి అక్కడికి వెళ్లినప్పుడు, ఉన్నట్టుండి వీధుల మీద బాంబుల వర్షం మొదలైంది. అప్పుడు ఆయన వెంటనే దగ్గర్లో ఉన్న బిల్డింగ్‌లో తలదాచుకున్నాడు. అరగంట తర్వాత చూస్తే బాంబుల వల్ల ఆయన వెళ్లాలనుకున్న రోడ్డు పూర్తిగా పాడైపోయింది.

డ్రైవింగ్‌ చేయడానికి ముందుకొచ్చిన సహోదరుల్లో ఒకరైన వొలొడిమిర్‌, ఆ భయంకరమైన పరిస్థితుల గురించి ఇలా చెప్తున్నాడు: “మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తెలివిని ఇవ్వమని మేము యెహోవాకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం.”

ఒలెక్సాండర్‌, తన భార్య వాలెంటీనాతో కలిసి ఖార్కివ్‌లో తన వృద్ధ తల్లిదండ్రులతో ఉండేవాడు. యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు అయితే, వాళ్ల కిటికీ నుండి ఒక 100 మీటర్ల దూరంలోనే బాంబు పేళ్లులు కనిపించేవి. వాళ్లకు కారు లేదు కాబట్టి తప్పించుకోవడానికి ఏ దారి లేదు.

తర్వాత సహోదరులు వాళ్లను కాపాడడానికి వచ్చారు. ఒలెక్సాండర్‌ ఇలా చెప్తున్నాడు: “మాకు సహాయం చేయడానికి సహోదరులు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ యెహోవాకు ప్రార్థించాం.”

వసిల్‌, ఆయన భార్య నటాలియా, వాళ్ల ముగ్గురు పిల్లలతో కలిసి వాళ్ల ఇంట్లోని అండర్‌గ్రౌండ్‌ గదిలో ఎన్నో రోజులుగా తలదాచుకున్నారు. 2022, ఫిబ్రవరి 29న వాళ్ల ఇంటి దగ్గర ఒక బాంబు పేలడంతో, ఆ అలికిడికి వాళ్ల ఇల్లంతా ధ్వంసమైంది. ఆ రోజు బాంబు పేలినప్పుడు చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చిందని, అండర్‌గ్రౌండ్‌ గదిలో కరెంటు పోయిందని వసిల్‌ చెప్పాడు.

వాళ్ల ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వకముందు ఇంటి అండర్‌గ్రౌండ్‌లో వాళ్ల పిల్లలతో తలదాచుకున్న వసిల్‌, నటాలియా

యుద్ధ వాతావరణం కొంచెం నిమ్మళించినప్పుడు ఆ కుటుంబమంతా పక్కన బిల్డింగ్‌లోని అండర్‌గ్రౌండ్‌ గదికి వెళ్లిపోయారు. 2022, మార్చి 3న మన సహోదరులు వచ్చి ఆ కుటుంబం కోసం వెదికి, వాళ్లను దేశంలోని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.

సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతనికి ఎలా అనిపించిందో వసిల్‌ ఇలా వివరిస్తున్నాడు: “యెహోవాకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. యుద్ధం జరుగుతున్న చోటులో మేము ఒక వారమే ఉన్నా చాలా వారాలు అక్కడ ఉన్నట్టు అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా మా పిల్లల క్షేమం గురించి ఆందోళనపడకుండా ప్రశాంతంగా భోజనం చేయగలిగాం.”

డ్రైవింగ్‌ చేయడానికి ముందుకొచ్చిన వాళ్లల్లో ఒకరైన ఒలెక్సాండర్‌, మనవాళ్లని సురక్షితమైన ప్రాంతాలకు తరలించే పని, యెహోవా ప్రజల మధ్యున్న ఐక్యతకు రుజువని చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “ఈ పని చేస్తున్నప్పుడు యెహోవాకు తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ ఉందో నేను కళ్లారా చూడగలిగాను. కృతజ్ఞతతో నిండిపోయిన తోటి సహోదరుల ముఖాలు చూసినప్పుడు నేను పట్టలేనంత సంతోషాన్ని పొందాను.”

ధైర్యం చూపిస్తున్న ఈ సహోదరుల్ని మనం ఎప్పుడూ మర్చిపోం. వాళ్లు చూపిస్తున్న స్వయంత్యాగ స్ఫూర్తిని యెహోవా దీవించాలని ప్రార్థిస్తున్నాం.—రోమీయులు 12:10.