ఏప్రిల్ 22, 2022
యుక్రెయిన్
‘ఆ రోజు రాత్రి యెహోవా నా చెయ్యి పట్టుకున్నట్టు, నన్ను ఎత్తుకున్నట్టు అనిపించింది’
యుక్రెయిన్‌లోని ఇద్దరు సహోదరీలు యెహోవా వాగ్దానాల నుండి బలాన్ని పొందుతున్నారు
యుక్రెయిన్‌లోని యుద్ధం వల్ల మొట్టమొదట చనిపోయిన యెహోవాసాక్షుల్లో సిస్టర్ లూడ్మిలా మోజుల్ భర్తయిన పెట్రో మోజుల్, అలాగే సిస్టర్ క్యాటరీన రోజ్‌దోర్‌స్కా భర్తయిన దిమిత్రో రోజ్‌దోర్‌స్కీ ఉన్నారు. ఆ సహోదరీలు వాళ్లకు జరిగిన తీరని నష్టాన్ని యెహోవా సహాయంతో తట్టుకోగలుగుతున్నారు. విచారకరంగా, ఇప్పటి వరకు యుద్ధం వల్ల 34 మంది సహోదర సహోదరీలు చనిపోయారు.
పెట్రో, లూడ్మిలాలు 1994లో బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లకు పెళ్లై 43 సంవత్సరాలు పూర్తయ్యాయి.
లూడ్మిలా ఇలా చెప్తుంది: “తోటి ఆరాధకులు ప్రతీరోజు నాకు ఫోన్ చేసి నన్ను ఓదారుస్తున్నారు. నా ఫోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. అలాగే యుక్రెయిన్ బ్రాంచి నన్ను ఓదారుస్తూ పంపించిన ఉత్తరాన్ని చదివినప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు.”
2022, ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది. సంజ్ఞా భాష సంఘంలో సంఘ పరిచారకుడిగా పనిచేస్తున్న బ్రదర్ పెట్రో 2022 మార్చి 1న, ఖార్కివ్‌లో విపరీతంగా జరుగుతున్న బాంబు దాడులను తప్పించుకోవడానికి తన కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి పారిపోతున్నప్పుడు చనిపోయాడు.
అప్పటికే కొన్ని రోజులుగా బాంబుల వర్షం! కానీ ఆ రోజు, ఫైటర్ జెట్ విమాన దాడులు కూడా హోరెత్తి, నగరంపై విరుచుకుపడ్డాయి. అందుకని బ్రదర్ పెట్రో కుటుంబం అరగంటలో వాళ్లకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని బయలుదేరారు. పెట్రో, ఆయన భార్య లూడ్మిలా ఒక కారులో, వాళ్ల అబ్బాయి ఒలెక్సీ, ఆయన భార్య మరీన ఇంకో కారులో వెళ్తున్నారు. లూడ్మిలా ఇలా చెప్తుంది: “మేము కొన్ని ఇళ్లను దాటుకుంటూ వీధి నుండి బయటికి వచ్చేలోగా పైనుండి ఒకటే బాంబు దాడి. ఆ అలికిడికి మా కారు బాగా ఊగిపోయింది.”
పెట్రో తన కారు, ఒలెక్సీ కారుకి గుద్దుకోకుండా వెంటనే పక్కకు తిప్పడంతో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయన్ని, లూడ్మిలాని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ 67 ఏళ్ల పెట్రో హాస్పిటల్లోనే చనిపోయాడు. బాంబు దాడి జరిగినప్పుడు చెల్లాచెదురైన ముక్కలు తన కాలికి, కడుపుకి తగలడంతో లూడ్మిలాకు గాయాలయ్యాయి. అయితే ఒలెక్సీ, మరీనలకు ఏంకాలేదు. లూడ్మిలా మూడు రోజులు హాస్పిటల్‌లో ఉండి డిస్చార్జ్ అయ్యాక, పెట్రో చనిపోయిన విషయం ఆమెకు తెలిసింది.
లూడ్మిలా ఇలా చెప్తుంది: ‘యెహోవా చూపించే దయ గురించి, ఆయన మనకు ఇవ్వబోయే మంచి భవిష్యత్తు గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ హాయిగా అనిపిస్తుంది. కొత్త లోకంలో నేను నా భర్తను ఖచ్చితంగా చూస్తాను. ఆ రోజు కోసం నేను వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను.’
దిమిత్రో, క్యాటరీనకి పెళ్లై 8 ఏళ్లు అయ్యింది. దిమిత్రో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తూ ఆమెతో చివరిగా మాట్లాడిన మాటలు ఇవి: “నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను.”
అది 2022, మార్చి 8. దిమిత్రో ఫోన్ చేసిన కొన్ని గంటలకే, ఆఫీస్ నుంచి ఒకరు క్యాటరీనకి ఫోన్ చేసి, దిమిత్రో అనుకోకుండా ఒక మందుపాతర మీద అడుగేశాడని, ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ సర్జరీ పూర్తయిన ఐదు గంటలకు ఆయన చనిపోయాడు.
దిమిత్రో చనిపోయాడని తెలిసినప్పుడు తనకెలా అనిపించిందో క్యాటరీన చెప్తుంది: “ఆ రోజు రాత్రి యెహోవా నా పక్కనే ఉండి నా చెయ్యి పట్టుకున్నట్టు, నన్ను ఎత్తుకున్నట్టు అనిపించింది.”
28 ఏళ్ల దిమిత్రో 2006లో బాప్తిస్మం తీసుకుని, డొనెట్‌స్క్ ప్రాంతంలో సంఘపెద్దగా సేవ చేశాడు.
దిమిత్రో అంత్యక్రియలు జరిగిన తర్వాత క్యాటరీన 12 గంటలపాటు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లోని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయింది. “యుక్రెయిన్‌లో అలాగే వేరే దేశాల్లో ఉన్న సహోదర సహోదరీలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వాళ్లు నా మీద చూపించిన ప్రేమ, నా బాధని తగ్గించింది.”
ఆమె ఇంకా ఇలా చెప్తుంది: “పరిచర్యకు వెళ్లడం వల్ల కూడా నేను ఊరట పొందాను. … బాధను తట్టుకోలేనని అనిపించినప్పుడల్లా బైబిల్లో ఫిలిప్పీయులు 4:6, 7 లాంటి లేఖనాల్ని బయటకు చదువుకుంటూ ఉంటాను.”
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం వల్ల తమ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కోల్పోయిన సహోదర సహోదరీలందరికీ బలాన్ని, ఓదార్పుని యెహోవా ఇస్తూ ఉంటాడనే నమ్మకంతో ఉన్నాం.—కీర్తన 61:1-3.