కంటెంట్‌కు వెళ్లు

జూన్‌ 23, 2022
యుక్రెయిన్‌

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాను

యుక్రెయిన్‌కి చెందిన అనస్టేసియా కోజెనోవా చెప్పిన యథార్థ గాథ

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాను

2022, ఫిబ్రవరి 24 ఉదయం పెద్దపెద్ద శబ్దాలు వినిపించేసరికి నేను నిద్రలేచాను. బయట వర్షం పడడం చూసి ఉరుములేమో అనుకున్నాను, కానీ నిజానికి నేను విన్నది బాంబుల శబ్దాలు.

మా ఇల్లున్నది మారియుపోల్‌ సెంటర్‌లో. అక్కడి పరిస్థితంతా ప్రమాదకరంగా మారిపోయింది కాబట్టి మా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవడమే మంచిదని నాకర్థమైంది. తర్వాత రోజే ఊరి చివర్లో ఉన్న మా బామ్మ ఇంటికి వెళ్లిపోయాను. అక్కడకి మా అమ్మ క్యాటరీన కూడా వచ్చింది. ఆ ఇంట్లో నేను, మా బామ్మ, అమ్మ, బంధువుల అబ్బాయి కొంతకాలం క్షేమంగానే ఉన్నాం. కానీ చాలా రోజుల పాటు అండర్‌గ్రౌండ్‌ గదిలోనే నిద్రపోవాల్సి వచ్చింది.

ఒక రోజు అండర్‌గ్రౌండ్‌ గదిలో ఉన్నప్పుడు, మేము కూరగాయలు పెంచుకునే పెరట్లో మిస్సైల్‌ పేలింది. చెవులు పగిలిపోయేంత శబ్దం వినిపించింది. నేను యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాను. ఒక వారం తర్వాత బామ్మవాళ్ల ఇంట్లో ఉండడం మంచిది కాదని, మళ్లీ సిటీ సెంటర్‌కొచ్చి ఆ ప్రాంతం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటుందేమో చూడాలనుకున్నాం. మమ్మల్ని క్షేమంగా ఉంచమని, తప్పించుకునేలా సహాయం చేయమని యెహోవాను నేను ఎంతో వేడుకున్నాను.

అది మార్చి 4, ఉదయం. మారియుపోల్‌ని సైన్యం చుట్టుముట్టేసరికి ఏ ట్రైన్‌లు అందుబాటులో లేవు. చాలామందిలాగే మేమూ సిటీ థియేటర్‌కి వెళ్లి 10 రోజుల పాటు అక్కడ తలదాచుకున్నాం. అది వందల మందితో కిక్కిరిసిపోయింది కాబట్టి మేమందరం నేలమీదే పడుకున్నాం. అక్కడంత శుభ్రంగా ఏమీ లేదు. ఆహారం, వేడి నీళ్లు దొరకడం కూడా చాలా కష్టం, వాటికోసం గంటలపాటు లైనుల్లో నిలబడాల్సి వచ్చేది.

థియేటర్‌కి దగ్గర్లో ఒక మిస్సైల్‌ పేలింది. అది ఎంత పెద్దదంటే దాని అలికిడికి కిటికీలన్నీ పగిలిపోయాయి. దాంతో బయటి నుంచి ఎముకలు కొరికే చల్ల గాలి లోపలికి రావడం మొదలైంది.

వాళ్ల బామ్మ ఇరినా అలాగే బంధువుల అబ్బాయి ఆండ్రీతో, అనస్టేసియా

ఆ కష్టమైన పరిస్థితిని తట్టుకోవడానికి ఏం సహాయం చేసిందని నన్ను అడిగితే, యోబు ఉదాహరణ అని చెప్తాను. నా చుట్టూ ప్రజలు బాంబు పేలుళ్ల వల్ల భయపడుతున్నప్పుడు, నేను బైబిల్లో యోబు పుస్తకాన్ని చదివేదాన్ని. దానివల్ల నాకు ప్రశాంతంగా అనిపించేది. నా పక్కనే యోబు కూర్చున్నట్టు, ఆయనతో నేను, “నీ పరిస్థితి నాకు ఇప్పుడు అర్థమైంది” అని చెప్తున్నట్టు ఊహించుకున్నాను. యోబు తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ఆస్తిపాస్తులన్నిటిని కోల్పోయాడు. నేను కోల్పోయింది ఆస్తుల్ని మాత్రమే, నా కుటుంబం నాతోనే ఉంది. అందరూ క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి ఆ నిమిషం, నా పరిస్థితి అంత కష్టంగా ఏమీ లేదని అర్థం చేసుకున్నాను. అప్పుడు కొంచెం హాయిగా అనిపించింది.

మార్చి 14న కొంతమంది నగరం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారని విన్నాం. కాబట్టి మేము కూడా బయల్దేరాలని అనుకున్నాం. ఆ సమయంలో వేరేవాళ్లతో కలిసి ఆ థియేటర్‌ నుంచి ప్రయాణమైపోయే అవకాశం మాకు దొరికింది.

అక్కడ నుంచి మొత్తం 20 వాహనాలు బయల్దేరాయి. మేమున్న వాన్‌లో 14 మంది ఇరుక్కుని కూర్చున్నాం. మేము వెళ్తున్న దారంతా బాంబుల వర్షమే! నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మేం మారియుపోల్‌ నుంచి బయటపడ్డాక మా డ్రైవర్‌ బండి ఆపి, దిగి, ఏడ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మేం దాటివచ్చిన రోడ్డు మొత్తం మందుపాతరలే, ఆయన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని వాహనం నడిపాడు. మేము అక్కడ నుంచి పారిపోయిన రెండు రోజులకు థియేటర్‌ మీద బాంబు పేలిందని, దాదాపు 300 మంది చనిపోయారని విన్నాం.

ఇంకో 13 గంటలు ప్రయాణించాక మేము జాపొరిజియా చేరుకున్నాం. తర్వాతి రోజు ఉదయం లివీవ్‌కు ట్రైన్‌లో బయల్దేరాం. సాధారణంగా ఆ ట్రైన్‌ బోగిలో నలుగురే ఉంటారు. కానీ మేము 16 మందిమి ఇరుకిరుకుగా ప్రయాణించాం. ఆ రోజు చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం గాలి వస్తుందని, దాదాపు ప్రయాణమంతా కిటికీ దగ్గరే నిలబడి ఉన్నాను. మార్చి 16న మేము లివీవ్‌కు చేరుకున్నాం. అక్కడ మమ్మల్ని సహోదర సహోదరీలు ప్రేమగా ఆహ్వానించారు, తర్వాత నాలుగు రోజులు అక్కడున్న రాజ్యమందిరంలో తలదాచుకున్నాం. సహోదరులు అంత శ్రద్ధ చూపించేసరికి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. వాళ్లు నిజంగా యెహోవా ఇచ్చిన బహుమతి.

మార్చి 19న మేము యుక్రెయిన్‌ నుంచి దగ్గర్లో ఉన్న పోలండ్‌ దేశానికి వెళ్లిపోవాలని అనుకున్నాం. అక్కడ నన్ను, మా అమ్మని, బామ్మని, బంధువుల అబ్బాయిని, తోటి ఆరాధకులు చేరదీశారు. మాకు అవసరమైన ప్రతీదాన్ని ఇచ్చారు. మేం వేసిన ప్రతీ అడుగులో తోడుగా ఉంటూ, మా మీద కొండంత ప్రేమను చూపించారు.

నాకు 19 ఏళ్లే. కానీ ఈ పరిస్థితుల్ని చూశాక, నేను నేర్చుకున్నది ఏంటంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం విశ్వాసాన్ని పెంచుకోవడం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం దేన్నైనా తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. యుద్ధం మొదలవ్వకముందు రోజుల్లో నేను వ్యక్తిగత అధ్యయనం చేయకపోయుంటే ఇదంతా తట్టుకోవడం ఇంకా కష్టమయ్యేది.

యెహోవా ప్రేమగల తండ్రి. ఈ సమయమంతటిలో ఆయన నా కుడి చేయి పట్టుకుని నడిపించినట్లు అనిపించింది. నాకోసం ఆయన చేసినదాన్నంతటికీ నేను ఆయనకు ఎంత థాంక్స్‌ చెప్పినా సరిపోదు.—యెషయా 41:10.