మే 4, 2022
యుక్రెయిన్
ప్రేమతో వేసిన అడుగు
“ఇంక ఇదే చివరిసారిగా వెళ్లాలనుకున్నాడు”
యుక్రెయిన్‌లోని డొనెట్‌స్క్ ప్రాంతంలో యుద్ధ తీవ్రత ఎక్కువ అయ్యేటప్పటికి సహోదరుడు మికోలా బోజ్‌దొమోవ్, వీలైనంత ఎక్కువమందిని క్రమాటోర్‌స్క్ నుండి తప్పించడానికి అక్కడికి చాలాసార్లు వెళ్లి వచ్చేవాడు.
అయితే 2022, ఏప్రిల్ 8న డొనెట్‌స్క్ ప్రాంతంలోని క్రమాటోర్‌స్క్ రైల్వే స్టేషన్ మీద బాంబు దాడి జరగడంతో మికోలా చనిపోయాడు.
ఆ బాంబు పేలుడు వల్ల చనిపోయిన 50 కన్నా ఎక్కువ మందిలో 58 ఏళ్ల మికోలాతో పాటు ఒక సహోదరి కూడా ఉంది. 100 మందికి పైగా గాయాలైన వాళ్లల్లో ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. ఆ దాడిని తప్పించుకున్న యెహోవాసాక్షులు, ఆ సమయంలో చెవులు పగిలిపోయేంత రెండు బాంబు శబ్దాలు వినిపించాయని, పేలిన బాంబు ముక్కలన్నీ ఆకాశంలో చెల్లాచెదురు అయ్యాయని చెప్పారు.
మికోలాకి నీనాతో పెళ్లై 32 సంవత్సరాలైంది. నీనా ఇలా అంటుంది: “నా భర్త ఎప్పుడూ వేరేవాళ్ల మీద శ్రద్ధ చూపించే విషయంలో ముందుంటారు. ఆయన ముఖ్యంగా వృద్ధులకు, ఆరోగ్యం బాలేని ప్రచారకులకు సహాయం చేయాలని బలంగా అనుకునేవాడు. కానీ క్రమాటోర్‌స్క్‌కి, వెళ్లివస్తున్న ప్రతిసారి ప్రమాదాలు పెరిగిపోతూ వచ్చాయి. అందుకే ఇంక ఇదే చివరిసారిగా వెళ్లాలనుకున్నాడు.”
వాళ్లు ఇద్దరూ ఒకేసారి 1997లో బాప్తిస్మం తీసుకున్నారు. మికోలా ఒక నమ్మకమైన సంఘపెద్దగా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు. ఈ సమయంలో నీనా మీద సహోదర సహోదరీలు ఎంతో ప్రేమ, శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమె ఇలా అంటుంది: “వాళ్లు ఇస్తున్న ఓదార్పు, నా కష్టమైన పరిస్థితిని తట్టుకోవడానికి సహాయం చేస్తుంది.”
యెషయా 40:28-31 లాంటి లేఖనాల నుండి కూడా నీనా ఓదార్పు పొందుతున్నానని చెప్తుంది. ఆమె ఇంకా ఇలా అంటుంది: “యెహోవా నాకు కొత్త బలాన్ని ఇచ్చి సహాయం చేస్తున్నాడు. ముందెన్నడూ లేనంతగా యెహోవా ప్రేమను నేను రుచి చూస్తున్నాను. ఇంతకుముందు అలాంటి ప్రేమను మన ప్రచురణల్లో చదివానే గానీ ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నాను.”
నీనాతో పాటు, తమకు ఇష్టమైనవాళ్లను యుద్ధంలో కోల్పోయిన సహోదర సహోదరీలందరి కోసం మేం ప్రార్థిస్తున్నాం. వాళ్లను యెహోవా ఎప్పుడూ ఆదుకుంటాడని మనకు ఖచ్చితంగా తెలుసు.—కీర్తన 20:2.