కంటెంట్‌కు వెళ్లు

యుక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో బాంబుపేలుళ్లు జరుగుతున్నప్పుడు ఆశ్రయం పొందుతున్న మన సహోదర సహోదరీలు

మార్చి 3, 2022
యుక్రెయిన్‌

యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

2022, ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసింది. యుక్రెయిన్‌లో 1,29,000 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు, వాళ్ల పిల్లలు ఉన్నారు. బ్రాంచి అక్కడ ఉన్న సహోదర సహోదరీలకు అవసరమైన వాటిని అందించడం కోసం 27 విపత్తు సహాయక కమిటీలను (DRCలను) ఏర్పాటు చేసింది. అంతేకాదు అక్కడున్న సహోదర సహోదరీలు క్రైస్తవ ప్రేమను చూపించుకుంటున్నారు. వాళ్లు తోటి సహోదరులకు, చుట్టుపక్కల ఉన్నవాళ్లకు చేయగలిగినదంతా చేస్తూ, ఓదార్పును ఇస్తున్నారు.

చాలామంది సహోదర సహోదరీలు యుక్రెయిన్‌లోనే ఉండిపోయారు, అయితే కొంతమంది ఇరుగుపొరుగు దేశాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా వెళ్లిపోతున్నవాళ్లు పెద్దపెద్ద లైనుల్లో నిలబడాల్సి వచ్చింది. కొన్ని లైనులు అయితే 30 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. అలాగే దేశం దాటేటప్పుడు అధికారులు చేసే చెకింగ్‌లన్నీ పూర్తి చేసుకోవడానికి రెండుమూడు రోజులు ఆగాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న సహోదర సహోదరీలేమో లైనుల్లో నిలబడున్న మన సహోదరులను వెతికి, వాళ్లకు ఆహారాన్ని, నీళ్లను, కావాల్సిన సహాయాన్ని అందించారు. చివరికి ఆ సహోదర సహోదరీలు వేరే దేశాలకు చేరుకున్నప్పుడు, అక్కడున్న సాక్షులు jw.org బోర్డులు పట్టుకుని నిలబడి ఉండడం చూశారు. వాళ్లు వీళ్లను సాదరంగా ఆహ్వానించి, కావాల్సిన సహాయాన్ని, ఓదార్పును ఇచ్చారు.

యుక్రెయిన్‌ వదిలి వస్తున్న సహోదర సహోదరీలకు సహాయాన్ని అందించడం కోసం పోలండ్‌లో (ఎడమ) స్లోవాకియాలో (కుడి) ఉన్న మన సహోదరీలు

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • వినికిడి లోపం ఉన్న ఒక సంఘ పరిచారకుడు, బ్రదర్‌ పెట్రో మోజుల్‌ ఖార్కివ్‌లో జరిగిన బాంబుపేలుళ్లో చనిపోయాడు

    విచారకరంగా 2022, మార్చి 1న బాంబుపేలుళ్ల వల్ల ఖార్కివ్‌లో వినికిడి లోపం ఉన్న ఒక సహోదరుడు చనిపోయాడు, ఆయన భార్యకు తీవ్రమైన గాయాలు అయ్యాయి

  • మరో ముగ్గురు సహోదరీలకు గాయాలు అయ్యాయి

  • 5,000 కంటే ఎక్కువమంది సహోదర సహోదరీలు ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది

  • 2 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 3 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 35 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 2 రాజ్యమందిరాలు పాడైపోయాయి

  • కరెంట్‌ కోత వల్ల, హీటర్‌లు-టెలిఫోన్‌లు పనిచేయకపోవడం వల్ల, నీటి సరఫరా లేకపోవడం వల్ల చాలామంది సహోదర సహోదరీలు ఇబ్బంది పడ్డారు

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 DRCలు ఏర్పాటు అయ్యాయి

  • DRC వల్ల 867 ప్రచారకులకు సురక్షితమైన స్థలంలో ఉండడానికి చోటు దొరికింది

  • ఆహారం, నీళ్లు వంటి అవసరమైన వాటిని అందించడానికి DRCలు ఏర్పాట్లు చేస్తున్నాయి

పైన ఇచ్చిన సంఖ్యలన్నీ యుద్ధం మొదలైన కొత్తలో మాకు వచ్చిన రిపోర్టుల ప్రకారం చెప్పినవి.

మన సహోదర సహోదరీలు ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉండాలని, ఈ కష్టమైన అల్లకల్లోలమైన పరిస్థితుల్ని తట్టుకోవాలని, వాళ్లకు కావాల్సిన తెలివిని, అవగాహనను యెహోవా ఇవ్వాలని మనం ప్రార్థిస్తూనే ఉంటాం.—సామెతలు 9:10; 1 థెస్సలొనీకయులు 4:9.