జూలై 20, 2022
యుక్రెయిన్
లేమిలో కూడా లోటు లేకుండా చూసుకుంటున్నారు
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం వల్ల దాదాపు 47,000 మంది యెహోవాసాక్షులు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. చాలామంది దేశంలో సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ తోటి సహోదర సహోదరీలు వాళ్లకు బట్టలు, ఆహారం, అవసరమయ్యే వాటిని ఇస్తున్నారు. ఈ సహోదర సహోదరీలకు అప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అవసరంలోని సహోదరులకు సహాయం చేయడానికి ఇష్టంగా ముందుకొస్తున్నారు.
ఓలా అలాగే సాక్షికాని ఆమె భర్త యుక్రెయిన్‌లోని ఉమాన్‌లో ఉంటున్నారు. వాళ్లు యుద్ధం మొదలైన రెండు నెలల్లో దాదాపు 300 మంది సహోదరులకు వసతినిచ్చారు. వాళ్లలో చాలామంది ఓలా ఇంట్లో ఒక రాత్రి ఉండి, తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేవాళ్లు. కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వస్తున్నారని ఓలాకు కొన్ని క్షణాల ముందే తెలిసేది. అలా మధ్యరాత్రులు కూడా వచ్చేవాళ్లు. ఒకసారైతే ఓలా ఇంట్లో 22 మంది సహోదర సహోదరీలు ఉన్నారు. ఇలా సహాయం చేయడం వల్ల తన 18 ఏళ్ల కొడుకు స్టానిస్లావ్, ఉదారత చూపించగలుగుతున్నాడు. వేరే ప్రాంతాల నుండి వచ్చిన సహోదరులకు తన బెడ్‌రూమ్ ఇచ్చి, చాలాసార్లు నేల మీద పడుకునేవాడు.
“ఈ అల్లకల్లోలమైన సమయంలో నేను యెహోవా ప్రజలకు సహాయపడుతున్నందుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది” అని ఓలా అంటుంది.
ఆండ్రీ, ఆయన భార్య లుడ్మిలా ఐదు వారాల్లో 200 మంది యెహోవాసాక్షులకు వసతినిచ్చారు. ఒక రోజు రాత్రయితే, వాళ్ల ఇంట్లో 18 మంది సహోదరులు ఉన్నారు. ఆండ్రీ ఇలా అంటున్నాడు: “బ్రాంచి ఇచ్చిన నిర్దేశం ప్రకారం కొంత ఆహారాన్ని మా ఇంట్లో ఉంచుకున్నాం. దాన్నే మేము, దాదాపు 10 రోజుల పాటు మా ఇంటికి వచ్చిన సహోదరులకు పెట్టాం. అయితే వాళ్లు వెళ్లిపోయేటప్పుడు థాంక్యూ కార్డులతో పాటు కొంత డబ్బును కూడా వదిలి వెళ్లేవాళ్లు. దాన్ని ఉపయోగించి తర్వాత వచ్చే సహోదరుల కోసం ఆహారాన్ని కొనుక్కున్నేవాళ్లం. విపత్తు సహాయక కమిటీ కూడా మాకు ఆహారాన్ని ఇచ్చేది కాబట్టి మాకు ఎప్పుడూ ఏమీ తక్కువ కాలేదు.”
మార్చిలో ఇవానో-ఫ్రాంకీవ్‌స్క్‌కు చెందిన వీటా, వేరే ప్రాంతాల నుండి వచ్చిన సహోదరులకు తన అపార్టమెంట్‌ని ఇచ్చేసి ఆమె తన సహోదరి ఇంట్లో ఉండడానికి వెళ్లింది. వీటా ఇలా అంటుంది: “నా దృష్టిలో అది త్యాగం కాదు. ప్రేమతో చేసిన పని. మనమంతా ఒకే కుటుంబం కాబట్టి ఆ సహోదరుల కోసం నేను చేసింది నాకు సంతోషాన్ని తెస్తుంది.”
నటాలియా, తన భర్త, తన కూతురు హబ్రియెలాతో టర్నోపిల్‌లో ఉంటుంది. యుద్ధం మొదలైనప్పుడు వాళ్ల ముగ్గురి ఉద్యోగాలు పోయాయి. వాళ్ల అవసరాల కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఉపయోగించాల్సి వచ్చింది. అయినాసరే, వేరే ప్రాంతం నుండి వచ్చిన ఒక సహోదరికి, తన వికలాంగ కూతురికి వాళ్ల ఇంట్లో వసతినిచ్చారు.
నటాలియా ఇలా చెప్తుంది: “ఆఫ్రికాలో ఉన్న ఒక సహోదరి అనుభవం నాకు గుర్తొచ్చింది. ఆమె దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా, ఒక సమావేశం జరిగినప్పుడు 14 మంది సహోదర సహోదరీలకు తన ఇంట్లో చోటు ఇచ్చింది. వాళ్లెవ్వరికీ ఏమి తక్కువ కాలేదు.” ఆ అనుభవం, ఇతరుల అవసరాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం నేర్పించిందని నటాలియా చెప్తుంది.
యుక్రెయిన్‌లో ఉన్న మన సహోదర సహోదరీలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, తెలివిగా యెహోవాపై నమ్మకాన్ని ఉంచుతూ ‘ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు.’—రోమీయులు 12:13.