కంటెంట్‌కు వెళ్లు

ఎడమ నుండి కుడికి: అలిక్సీ బుడెన్‌చుక్‌, కొన్‌స్టాంటిన్‌ బజెనోవ్‌, ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌, అలిక్సీ మిరెట్‌స్కీ, రోమన్‌ గ్రిడసోవ్‌, గ్యున్నాడీ జెర్మన్‌. అరెస్ట్‌ అవ్వడానికి ముందు ఫోటో

ఫిబ్రవరి 17, 2020
రష్యా

ఐదుగురు సహోదరుల్ని చితకబాదిన రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ జైలు గార్డులు

ఐదుగురు సహోదరుల్ని చితకబాదిన రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ జైలు గార్డులు

2020 ఫిబ్రవరి 6న, రష్యాలోని ఓరెన్‌బర్గ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ పీనల్‌ కాలనీ నం.1 జైలు గార్డులు మన సహోదరుల్లో ఐదుగురిని కర్రలతో చితకబాదారు. ఆ సహోదరుల పేర్లు: అలిక్సీ బుడెన్‌చుక్‌, గ్యున్నాడీ జెర్మన్‌, రోమన్‌ గ్రిడసోవ్‌, ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌, అలిక్సీ మిరెట్‌స్కీ. సహోదరుడు ఫెలిక్స్‌ మహమ్మదీవ్‌కు పక్కటెముక విరిగింది, ఊపిరితిత్తులకు గాయమైంది, కిడ్నీ కూడా దెబ్బతింది; ఇప్పుడాయనకు హాస్పిటల్‌లో టీట్ర్‌మెంట్‌ జరుగుతోంది. ఇకపోతే బుడెన్‌చుక్‌, జెర్మన్‌, గ్రిడసోవ్‌, మిరెట్‌స్కీ సహోదరుల మీద అర్థంపర్థం లేని ఆరోపణలు, అబద్ధ కేసులు బనాయించి వాళ్లను పనిష్మెంట్‌ సెల్‌లో వేశారు. ఆ సహోదరులు సిగరెట్‌ తాగారు అనేది కూడా వాళ్లపై చేసిన ఆరోపణల్లో ఒకటి. నిజానికి యెహోవాసాక్షులు ఎవ్వరూ సిగరెట్‌ తాగరు.

గతంలో తెలియజేసినట్టు, 2019 సెప్టెంబరు 19న, దిమిత్రీ లారిన్‌ అనే లెనిన్‌స్కీ జిల్లా కోర్టు జడ్జి, ఈ ఐదుగురు సహోదరుల్ని అలాగే కొన్‌స్టాంటిన్‌ బజెనోవ్‌ అనే మరో సహోదరుడ్ని నేరస్తులుగా తీర్పుతీర్చారు. వాళ్లకు రెండు నుండి మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. వాళ్లు పెట్టుకున్న అపీల్‌ను 2019 డిసెంబరు 20న సెరటోవ్‌ రీజనల్‌ కోర్టు తిరస్కరించింది. కొన్ని వారాల తర్వాత ఈ ఆరుగురు సహోదరుల్ని జైలుకు తీసుకెళ్లారు. సహోదరుడు బజెనోవ్‌ను ఉల్యానోవోస్క్‌ ప్రాంతంలోని పీనల్‌ కాలనీ నం.3కు పంపించారు. అందుకే, పీనల్‌ కాలనీ నం.1​లో మిగతా ఐదుగురు సహోదరుల్ని చితకబాదినప్పుడు ఆయన అక్కడ లేరు.

2020 ఫిబ్రవరి 6న, ఈ ఐదుగురు సహోదరుల్ని పీనల్‌ కాలనీ నం.1కు తెచ్చిన వెంటనే వాళ్లను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఆ తర్వాత రోజు, సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌కు తీవ్రమైన జ్వరం, మూత్రంలో రక్తం రావడంతో డాక్టర్‌ను పిలిపించారు. ఆయన చేత బలవంతంగా, “నేను బాత్‌రూమ్‌లో జారి పడిపోయాను” అని రాయించి సంతకం పెట్టించిన తర్వాతే ఆంబులెన్స్‌ను రప్పించారు. సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌ ఊపిరితిత్తులకు దెబ్బ తగలడం వల్ల లోపల కొన్ని ద్రవాలు పేరుకుపోయాయి. దాంతో ఆయనకు ఆపరేషన్‌ చేసి ఒక స్టంట్‌ ద్వారా ఆ ద్రవాల్ని బయటికి తీయాల్సి వచ్చింది. ఆయనకు జైలులో సరైన తిండి కూడా పెట్టడం లేదని టెస్టుల్లో తేలింది. ఆయనకు సెలియాక్‌ అనే వ్యాధి ఉండడం వల్ల అన్ని రకాల ఆహారాల్ని తినకూడదు, కొన్ని ప్రత్యేకమైన వాటినే తినాలి. కానీ జైలు సిబ్బంది అదేదీ పట్టించుకోకుండా ఆయనకు ఇవ్వాల్సిన భోజనాన్ని ఆయనకు అందకుండా చేశారు.

రష్యాలో మన సహోదరుల్ని మానవత్వం లేకుండా, చాలా అన్యాయంగా హింసిస్తున్నారు. వాళ్లను తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది, వాళ్ల కోసం మేం ప్రార్థిస్తున్నాం. ఇన్ని చిత్రహింసల్ని సైతం ఓర్పుతో సహిస్తున్న వీళ్లకు యెహోవా ఇకమీదట కూడా తోడుంటాడని నమ్ముతున్నాం.—ఫిలిప్పీయులు 1:27, 28.