కంటెంట్‌కు వెళ్లు

ఫిబ్రవరి 19, 2019
రష్యా

డెన్నిస్‌ క్రిస్టెన్‌సన్‌ని అన్యాయంగా దోషిగా తీర్పుతీర్చి … ఆరు ఏళ్ల జైలుశిక్ష విధించిన రష్యా కోర్టు

డెన్నిస్‌ క్రిస్టెన్‌సన్‌ని అన్యాయంగా దోషిగా తీర్పుతీర్చి … ఆరు ఏళ్ల జైలుశిక్ష విధించిన రష్యా కోర్టు

ముందే చెప్పినట్టు 2019, ఫిబ్రవరి 6న ఓర్యోల్‌కు చెందిన జెలెజ్నోడోరోజ్నీ జిల్లా కోర్టు డెన్నిస్‌ క్రిస్టెన్‌సన్‌కు ఆరు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. దానికి కారణం, ఆయన తన నమ్మకాల్ని బట్టి ఆరాధనలో పాల్గొనడమే. ఆ తీర్పును మళ్లీ పరిశీలించమని సహోదరుడు క్రిస్టెన్‌సన్‌ ఉన్నత కోర్టుకు అప్పీల్‌ చేసుకున్నాడు.

క్రిస్టెన్‌సన్‌కి ఆరు సంవత్సరాలు జైలుశిక్ష వేశారనే వార్త విన్న వెంటనే కొన్ని అంతర్జాతీయ సంస్థలు స్పందించాయి. డెన్నిస్‌ క్రిస్టెన్‌సన్‌ని ఏ కారణం లేకుండా, అన్యాయంగా రష్యా విచారణ చేసిందని కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌లోని కొన్ని డిపార్ట్‌మెంట్లు, యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన యునైటెడ్‌ స్టేట్స్‌ కమీషన్‌, మానవ హక్కుల యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ కార్యాలయం అలాగే ఇతర సంస్థలు చెప్పాయి.

ఈ విషయం గురించి మానవ హక్కుల యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌, మిషెల్‌ బ్యాచిలెట్‌ ఒక ప్రకటన జారీ చేసింది. అందులో క్రిస్టెన్‌సన్‌కి ఇచ్చిన కఠినమైన తీర్పు వల్ల రష్యాలోని యెహోవాసాక్షుల పరిస్థితి ముందుముందు ఇంకా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాదు మత స్వేచ్ఛ హక్కు ఉన్నా, తమ మత నమ్మకాలను బట్టి వాళ్లు నేరస్థులుగా ఎంచబడే ప్రమాదం ఉందని కూడా తెలియజేసింది. ఆమె విపరీతవాదానికి సంబంధించిన చట్టంలో ఒక స్పష్టతను తీసుకురావాలని, కేవలం హింస అలాగే ద్వేషంతో కూడిన పనులే విపరీతవాదం కిందకు వచ్చేలా చూసుకోవాలని రష్యా ప్రభుత్వాన్ని కోరింది. చివరిగా, తమ చట్టపరమైన హక్కుల్ని బట్టి నడుచుకునే వాళ్ల మీద వేసిన కేసుల్ని కొట్టేయమని బ్యాచిలెట్‌ అడిగింది. అలాగే తమ నమ్మకాలు, మతం, ఆలోచనలు, మాటలు లేదా ఇతరులతో శాంతియుతంగా సమకూడడం వంటి వాటివల్ల జైల్లో వేయబడిన వాళ్లను విడుదల చేయమని కూడా అధికారుల్ని వేడుకుంది.

క్రిస్టెన్‌సన్‌కి తీర్పు ఇచ్చిన రెండు రోజుల తర్వాత, రష్యాకు చెందిన నలుగురు పేరుగాంచిన మానవ హక్కుల నిపుణులు మాస్కోలో మీడియాతో ఒక మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌ జరిగిన హాలంతా నిండిపోయింది. అంతేకాదు 6,000 కన్నా ఎక్కువమంది గంటసేపు జరిగిన ఆ మీటింగ్‌ని లైవ్‌లో ఇంటర్నెట్‌ ద్వారా చూశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన వాళ్లందరూ యెహోవాసాక్షుల వల్ల సమాజానికి ఎటువంటి ప్రమాదం లేదని, వాళ్లు శాంతియుతమైన ప్రజలని చెప్పారు.

2019, ఫిబ్రవరి 8న మాస్కోలో మీడియాతో జరిగిన మీటింగ్‌

సహోదరుడు క్రిస్టెన్‌సన్‌ భార్య ఇరీనా, ఆయన లాయర్‌ అంటోన్‌ బోగ్‌డానోవ్‌, అలాగే యెహోవాసాక్షుల యూరోపియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధి యారోస్లావ్‌ సివుల్‌స్కీ కూడా ఆ మీటింగ్‌కి హాజరై అక్కడ మాట్లాడారు. అది ఎందుకు అన్యాయమైన తీర్పో చెప్తూ, మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.

సహోదరుడు క్రిస్టెన్‌సన్‌ దాదాపు రెండు సంవత్సరాలుగా జైల్లో ఉన్నప్పటికీ తన సంతోషాన్ని కాపాడుకుంటున్నాడు, అలాగే యెహోవా మీద నమ్మకం చూపిస్తూ ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. చివరి తీర్పు ఇవ్వడానికి కొన్ని రోజుల ముందు సహోదరుడు క్రిస్టెన్‌సన్‌ కోర్టులో చెప్పిన చివరి మాటలు ఇవి: “నిజం ఏదోక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. నా విషయంలో కూడా అదే జరుగుతుంది.” ఆ తర్వాత ఆయన ప్రకటన 21:3-5 చదివి, చాలా గట్టి నమ్మకంతో ఇలా ముగించాడు: “నేను చదివిన ఈ మాటలు . . . దేవుడు ప్రజలందరికీ న్యాయం చేసి, నిజమైన స్వేచ్ఛను ఇచ్చే సమయం గురించి చెప్తున్నాయి. స్వేచ్ఛకు, న్యాయానికి దగ్గరి సంబంధం ఉంది. దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ తప్పకుండా చేసి తీరతాడు.”

సహోదరుడు క్రిస్టెన్‌సన్‌ తన కేసు విషయంలో అప్పీల్‌ చేసుకున్నాడు, దానికి తీర్పు వచ్చేంతవరకు ఆయన ఓర్యోల్‌ ప్రాంతంలోని డిటెన్షన్‌ ఫెసిలిటీ నెంబరు 1 అనే జైల్లో ఉంటాడు. ఆయన గత 20 నెలలుగా ఆ జైల్లోనే ఉంటున్నాడు.

డెన్నిస్‌ క్రిస్టెన్‌సన్‌, ఆయన భార్య అలాగే రష్యాలోని సహోదర సహోదరీలందరికీ యెహోవా ఎప్పుడూ తోడుగా ఉండాలని, వాళ్ల ప్రతీ అడుగులో సహాయం చేస్తూ ఉండాలని ప్రార్థిద్దాం.—1 పేతురు 3:12.

తీర్పు ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే RFE/RL అనే అంతర్జాతీయ మీడియా సంస్థ రష్యాలో మత స్వేచ్ఛ ఉందో లేదో తేల్చేసే ఒక కోర్టు కేసు అనే వీడియోని తయారుచేసింది.