కంటెంట్‌కు వెళ్లు

2017 లో రష్యా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుండి రష్యాలో అలాగే క్రిమియాలో జైలుకు వెళ్లిన 330 కన్నా ఎక్కువమంది సహోదర సహోదరీల్లో కొంతమంది.

జూన్‌ 8, 2022
రష్యా

యెహోవాసాక్షుల్ని హింసిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్‌ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు

యెహోవాసాక్షుల్ని హింసిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్‌ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు

యెహోవాసాక్షుల్ని హింసిస్తున్నందుకు రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు 2022, జూన్‌ 7న ఒక చారిత్రక తీర్పును a ఇచ్చింది. 2017 లో రష్యా యెహోవాసాక్షులను నిషేధించడం అన్యాయమని ECHR చెప్పింది. అలాగే వాళ్ల ప్రచురణల్ని, jw.org వెబ్‌సైట్‌ని నిషేధించడం కూడా చట్ట వ్యతిరేకమని చెప్పింది. మన సహోదర సహోదరీలకు వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ కొట్టేయాలని, జైల్లో ఉన్న వాళ్లందర్నీ విడుదల చేయాలని నిర్దేశించింది. ఇంకా రష్యా జప్తు చేసిన ఆస్తులన్నిటినీ తిరిగి ఇచ్చేయాలని లేదా వాటికి నష్టపరిహారంగా 5,96,17,458 యూరోలు (దాదాపు 474 కోట్ల రూపాయలు) ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే పిటీషన్‌ పెట్టుకున్న వాళ్లకు నష్టపరిహారంగా 34,47,250 యూరోలు (దాదాపు 27 కోట్ల రూపాయలు) ఇవ్వాలని ఆదేశించింది.

రష్యా ప్రభుత్వం జప్తు చేసుకున్న రష్యా బ్రాంచ్‌. అది సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పొలిమేర్లలో ఉన్న 10,76,391 చదరపు అడుగుల ప్రాంతం. అక్కడ 14 బిల్డింగ్‌లు ఉన్నాయి

2010 నుండి 2019 మధ్యకాలంలో నమోదైన 20 కేసుల గురించి ఆ తీర్పు ఇచ్చారు. ఆ కేసుల్లో మన సహోదర సహోదరీలు అలాగే మన చట్టబద్ధమైన కార్పొరేషన్‌లు దాఖలు చేసిన 1,400 కన్నా ఎక్కువ పిటీషన్‌లు ఉన్నాయి. అయితే ఈ తీర్పు వీళ్లకు మాత్రమే పరిమితం కాదు, ఇంకా ఎంతోమంది సాక్షులకు కూడా వర్తిస్తుంది. రష్యాకు ఇచ్చిన తీర్పులో ఇలా ఉంది: ‘యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఉన్న పెండింగ్‌ కేసులన్నిటిని కొట్టి వేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి … అలాగే వాళ్ల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ నిర్బంధించిన యెహోవాసాక్షులందర్నీ విడుదల చేయాలి.’ (కొన్ని పదాల్ని ఏటవాలుగా పెట్టాం.) రష్యా లోపలా, బయటా ఉంటున్న మన సహోదర సహోదరీలు ప్రతీఒక్కరు నిర్దోషులని ఈ తీర్పు నిరూపించింది. అలాగే ఏ సాక్షుల మీదైతే అబద్ధ ఆరోపణలు వేసి జైల్లో పెట్టారో, వాళ్లందరూ చట్టానికి కట్టుబడే పౌరులని చట్టబద్ధంగా నిరూపించింది.

మన వెబ్‌సైట్‌, మన పనులు, నమ్మకాలు, ప్రచురణలు విపరీతవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయంటూ రష్యా ఎలాంటి ఆధారాలు లేకుండా వేసిన ఆరోపణలు తప్పని ECHR తీర్పు ఇస్తున్నప్పుడు పదేపదే చెప్పింది. ఉదాహరణకు, ఆ తీర్పులో ఉన్న కొన్ని అంశాల్ని పరిశీలించండి:

  • పనులు: హింసను, ద్వేషాన్ని, ఇతరుల మీద వివక్షను ప్రోత్సహించేవేవి పిటీషన్‌దారుల మాటల్లో గానీ, పనుల్లో గానీ రష్యా కోర్టులు కనుగొనలేదని ECHR నొక్కి చెప్పింది. (§271)

  • తమ దగ్గరే సత్యం ఉందనే యెహోవాసాక్షుల నమ్మకం: తమ మతమే ఉన్నతమైనదని ఇతరులను ఒప్పించడానికి శాంతియుతంగా ప్రయత్నించడం అలాగే ‘అబద్ధమతాల్ని’ విడిచిపెట్టి ‘నిజమైన మతంలో’ చేరమని ప్రోత్సహించడం మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కులకు అనుగుణంగా ఉన్నాయి. అలా చేయడం చట్టవిరుద్ధం కాదు. (§156)

  • రక్త మార్పిళ్లు: ‘ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంటుంది. మానవ హక్కుల యూరోపియన్‌ కన్వెన్షన్‌ అలాగే రష్యా చట్టాలు ఆ హక్కుకి హామీ కల్పిస్తున్నాయి. రక్త మార్పిళ్లను వద్దనడం కూడా ఆ హక్కు కల్పిస్తున్న స్వేచ్ఛే.’ (§165)

  • మనస్సాక్షి ప్రకారం మిలిటరీలో చేరకపోవడం: ‘మిలిటరీలో చేరకూడదు అనే వీళ్ల మత నమ్మకం రష్యా చట్టాల్ని మీరినట్టు అవ్వదు.’ (§169)

  • మన ప్రచురణలు: ‘పిటీషన్‌దారుల మత కార్యకలాపాలు అలాగే ప్రచురణల్లో కనబడే సమాచారం శాంతిని ప్రోత్సహిస్తున్నాయి, హింసకు దూరంగా ఉండాలనే వాళ్ల సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయి.’ (§157)

  • JW.ORG: jw.orgలో ఉన్న సమాచారం విపరీతవాదాన్ని ప్రోత్సహించట్లేదని కోర్టు నిర్ణయించింది. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఏదైనా సమాచారం అభ్యంతరంగా అనిపిస్తే, పూర్తి వెబ్‌సైట్‌ని నిషేధించే బదులు అభ్యంతరంగా అనిపించిన సమాచారాన్ని మాత్రమే తీసేయమని ఆ సంస్థను కోరి ఉండాల్సింది. (§231, §232)

ఆ తీర్పు రష్యా అధికారులను తీవ్రంగా ఖండిస్తూ వాళ్లు పక్షపాతం, వివక్ష చూపించారని, నిజాయితీగా ప్రవర్తించలేదని చెప్పింది. (§187) ఉదాహరణకు, కోర్టు దర్యాప్తులో తేలిన కొన్ని వివరాల్ని పరిశీలించండి:

  • ‘రష్యాలోని యెహోవాసాక్షుల సంస్థలన్నిటినీ బలవంతంగా మూసేయడానికి చట్టపరమైన కారణాలు లేవు. బదులుగా రష్యా అధికారులకు యెహోవాసాక్షుల మతాచారాలు నచ్చకపోవడం వల్లే ఇలా చేశారని ఆధారాలు చూపిస్తున్నాయి. యెహోవాసాక్షులు వాళ్ల మత విశ్వాసాన్ని వదిలేయాలని, వేరేవాళ్లు వాళ్ల మతంలో చేరకూడదని రష్యా అధికారులు కావాలనే ఇలా చేశారు.’ (§254)

  • రష్యా అధికారులు పాటించిన పద్ధతుల్లో పెద్దపెద్ద లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు నిపుణులు వివక్షతో తయారు చేసిన రిపోర్ట్‌లను పోలీసులు అలాగే సాక్షులకు వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్లు రష్యా సుప్రీం కోర్టుకు ఇచ్చారు. కోర్టు యెహోవాసాక్షుల ప్రచురణల్ని నిష్పక్షపాతంగా పరిశీలించే బదులు ఆ రిపోర్ట్‌ల మీదే ఆధారపడింది. (§203)

  • విపరీతవాదానికి సంబంధించిన చట్టాన్ని యుక్తిగా, కావాలనే ఎంతో అస్పష్టంగా రాశారు. దాంతో యెహోవాసాక్షుల మీద ఇష్టమొచ్చినట్లు చర్యలు తీసుకోవడానికి అది అధికారులకు అవకాశాన్ని ఇచ్చింది. (§272)

ECHR ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రష్యా చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. ఎంతైనా మనం సహాయం కోసం మానవ అధికారుల వైపు చూడం. బదులుగా ‘యెహోవా కోసం కనిపెట్టుకొని ఉంటాం. ఎందుకంటే ఆయనే మన సహాయకుడు, మన డాలు.’—కీర్తన 33:20.

a మీడియా కోసం ECHR తయారుచేసిన 7 పేజీల తీర్పు సారాంశాన్ని (ఇంగ్లీష్‌) డౌన్‌లోడ్‌ చేసుకోండి. 196 పేజీల పూర్తి తీర్పుని (ఇంగ్లీష్‌) డౌన్‌లోడ్‌ చేసుకోండి.