మే 25, 2022
రష్యా
విడుదలై బయటికి వచ్చిన డెన్నిస్ క్రిస్టెన్‌సన్!
2022, మే 25న డెన్నిస్ క్రిస్టెన్‌సన్ డెన్మార్క్‌కి సురక్షితంగా చేరుకున్నాడు. అంతకుముందు రోజే అధికారులు ఆయన్ని రష్యా జైలు నుండి విడుదలచేసి, రష్యా నుండి బహిష్కరించారు. ఆయన ఐదు సంవత్సరాల పాటు వేర్వేరు జైళ్లలో ఉన్నాడు.
డెన్నిస్ ఇలా చెప్తున్నాడు: “జైలు నుండి విడుదలై, నా భార్యను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సహోదర సహోదరీల మద్దతు, ప్రోత్సాహం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన బహుమతి. అలాగే మతనమ్మకాల కారణంగా హింసలు ఎదుర్కొంటూ, జైల్లో వేయబడిన ధైర్యవంతులైన తోటి ఆరాధకుల కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను.”
డెన్నిస్, ఇరీనాల స్నేహితులు, కుటుంబసభ్యులు వాళ్లకు బైబిలు ద్వారా ప్రోత్సాహాన్ని అలాగే కావాల్సిన వస్తువుల్ని ఇస్తున్నారు. “డెన్మార్క్‌లోని సహోదర సహోదరీలతో కలిసి స్వేచ్ఛగా యెహోవాను ఆరాధించే రోజు కోసం మేము ఎదురుచూస్తున్నాం,” అని డెన్నిస్, ఇరీనాలు చెప్తున్నారు.
2017, మే 25న ఓర్యోల్‌లో సహోదరుడు డెన్నిస్ ఒక మీటింగ్‌కి హాజరైనప్పుడు, మాస్క్‌లు ధరించిన రష్యా అధికారులు పెద్దపెద్ద గన్‌లతో వచ్చి, అక్కడంతా సోదా చేసి డెన్నిస్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక నెల క్రితమే రష్యా సుప్రీం కోర్టు, మన సంస్థ విపరీతవాదాన్ని ప్రోత్సహిస్తుందనే నింద వేసి దాన్ని నిషేధించింది. అలాంటి సంస్థకు చెందిన పనులు చేస్తున్నాడని డెన్నిస్‌ని కోర్టు దోషిగా తీర్పు తీర్చింది.
అయితే 2017లో నిషేధించింది యెహోవాసాక్షుల చట్టబద్ధమైన కార్పోరేషన్‌లను మాత్రమే, ఆరాధన విషయంలో సాక్షులకున్న వ్యక్తిగత హక్కులకు అడ్డురామని రష్యా అధికారులు పదేపదే చెప్తున్నారు. కానీ డెన్నిస్‌ని అరెస్ట్ చేసిన తర్వాత నుండి రష్యాలో, క్రిమియాలో ఉన్న చాలామంది యెహోవాసాక్షులపై రష్యా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం మొదలుపెట్టింది.
ప్రస్తుతానికి 91 మంది సహోదర సహోదరీలు ఇంకా జైల్లోనే ఉన్నారు. అలాంటి విశ్వసనీయుల్ని యెహోవా ‘ప్రత్యేకంగా చూసుకుంటూ’ వాళ్లకు కావాల్సిన సహాయాన్ని ఇస్తూనే ఉండాలని మనం ప్రార్థిద్దాం.—కీర్తన 4:3.