కంటెంట్‌కు వెళ్లు

రష్యా జైలు నుండి విడుదలయ్యాక, 2021 జనవరి 21న ఉజ్బెకిస్తాన్‌ రైల్వే స్టేషన్‌ బయట, సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌ తన భార్య యెవ్‌జెన్యను కలుసుకున్నాడు.

జనవరి 21, 2021
రష్యా

సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌ను రష్యా జైలు నుండి విడుదల చేసి ఉజ్బెకిస్తాన్‌కు పంపించారు

సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌ను రష్యా జైలు నుండి విడుదల చేసి ఉజ్బెకిస్తాన్‌కు పంపించారు

2020, డిసెంబరు 31న, సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌ రష్యా జైలు నుండి విడుదలయ్యాడు. అయితే ఫేలిక్స్‌ సొంత దేశం ఉజ్బెకిస్తాన్‌ కాబట్టి, అక్కడికి పంపడానికి కావల్సిన డాక్యుమెంట్లు సిద్ధమయ్యే దాకా ఆయన్ని బహిష్కరణ కేంద్రంలో (deportation centre) ఉంచాలని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలోని బెల్యావ్‌స్కీ జిల్లా కోర్టు ఆదేశించింది. నిజానికి ఆయనకు రష్యా పౌరసత్వం ఉండేది, కానీ 2020 ఏప్రిల్‌లో రష్యా దేశం దాన్ని రద్దు చేసింది. 2021, జనవరి 20న అధికారులు ఆయన్ని ట్రైన్‌లో ఉజ్బెకిస్తాన్‌కు పంపారు. 2021, జనవరి 21న ఫేలిక్స్‌ ఉజ్బెకిస్తాన్‌కు క్షేమంగా చేరాడు. దానికి రెండు రోజులు ముందే ఆయన భార్య యెవ్‌జెన్య అక్కడికి చేరుకుని, ఆయన కోసం ఎదురు చూస్తోంది.

ఫేలిక్స్‌ సుమారు 18 ఏళ్లు రష్యాలో ఉన్నాడు. 2002​లో, అంటే ఫేలిక్స్‌ టీనేజీలో ఉన్నప్పుడు ఆయన, వాళ్ల అమ్మ ఉజ్బెకిస్తాన్‌ నుండి రష్యాలోని సెరటోవ్‌ ప్రాంతానికి వచ్చేశారు. 2004​లో అంటే ఆయనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. 2011​లో యెవ్‌జెన్యను పెళ్లి చేసుకున్నాడు.

2018 జూన్‌ 12న, ఆయుధాలు, ముఖానికి మాస్కులు ధరించిన ఫెడరల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు (FSB), ఇంకా స్థానిక పోలీసులు ఫేలిక్స్‌ దంపతుల ఇంటిని సోదా చేశారు. ఫేలిక్స్‌ని అరెస్టు చేసి, సుమారు సంవత్సరం పాటు జైల్లో ఉంచారు. ఆ పరిస్థితిని తట్టుకుని ధైర్యంగా ఉండడానికి ప్రార్థనే సహాయం చేసిందని చెప్తూ ఫేలిక్స్‌ ఇలా అన్నాడు: “నేను ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించేవాడిని. ఆ రోజుకు అవసరమైన మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వమని అడిగేవాడిని.”

సహోదరుడు ఫేలిక్స్‌ మహమ్మదీవ్‌, పోలీసుల చేతుల్లో దారుణంగా దెబ్బలు తిన్న సుమారు రెండు వారాల తర్వాత

ఆ తర్వాత ఫేలిక్స్‌ని, మరో ఐదుగురు సహోదరుల్ని కోర్టు దోషులుగా తీర్పు తీర్చి, జైలు శిక్ష విధించింది. 2019, సెప్టెంబరు 19న వాళ్లను జైల్లో వేశారు. ఆ తర్వాత అప్పీలు చేసుకున్నా, వాళ్లకు అనుకూలంగా తీర్పు రాలేదు. అప్పుడు ఫేలిక్స్‌ను, మరో నలుగురు సహోదరుల్ని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలోని జైలుకు మార్చారు. అది, సహోదరుల కుటుంబాలు ఉండే సెరటోవ్‌ ప్రాంతానికి 800 కన్నా ఎక్కువ కిలోమీటర్లు దూరంలో ఉంది. ఓరెన్‌బర్గ్‌ జైలుకు తీసుకొచ్చాక పోలీసులు సహోదరుల్ని చితకబాదారు.

ఇంత జరిగినా ఫేలిక్స్‌ తన సంతోషాన్ని కోల్పోలేదు, ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించే చిరునవ్వు మాయం కాలేదు. ఆయన భార్య యెవ్‌జెన్య ఇలా చెప్పింది: “తనను చూసి నేను చాలా గర్వపడుతున్నాను! కోర్టులో తనపై ఆరోపణలు వచ్చినా ఆయన తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు, ఇప్పటికీ ఆయన అలానే ఉంటూ హింసను సహిస్తున్నాడు. నేను సహించడానికి కూడా సహాయం చేస్తున్నాడు.”

రష్యా అధికారులు ఫేలిక్స్‌ను హింసించి, యెహోవాను ఆరాధించకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ హింసే, తనను యెహోవాకు ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉండేలా చేసిందని ఫేలిక్స్‌ అన్నాడు. ఆదికాండం 50:20​లో యోసేపు తన అన్నలతో చెప్పిన మాటల్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. యోసేపు ఇలా అన్నాడు: ’మీరు నాకు హాని చేయాలనుకున్నా, దేవుడు ఆ పరిస్థితిని మలుపు తిప్పి మంచి జరిగేలా చేశాడు.’