కంటెంట్‌కు వెళ్లు

జూలై 2, 2015
రువాండా

మతసంబంధ వివక్షను ఖండిస్తూ తీర్పును ఇచ్చిన రువాండా కోర్టు

మతసంబంధ వివక్షను ఖండిస్తూ తీర్పును ఇచ్చిన రువాండా కోర్టు

యెహోవాసాక్షులైన 8 మంది విద్యార్థులకున్న మత స్వేచ్ఛా హక్కును సమర్థిస్తూ రువాండాలోని కరోంగి జిల్లా కోర్టు తీర్పును ఇచ్చింది. ఆ విద్యార్థులు తమ మనస్సాక్షి కారణంగా స్కూల్లో జరిగే మతసంబంధమైన క్లాసులకు హాజరవ్వడానికి నిరాకరించారు.

రువాండాలో ఉన్న చాలా స్కూల్స్‌ని మత సంస్థలు నడిపిస్తాయి. అలాంటి స్కూళ్లల్లో, పిల్లల్ని మతసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనమని, చర్చి పన్నులను కట్టమని బలవంతం చేస్తారు. దానికి యెహోవాసాక్షులైన విద్యార్థులు నిరాకరిస్తే, స్కూల్‌ అధికారులు వాళ్లని స్కూల్‌ నుండి తీసేస్తారు. అలా 2008 నుండి 2014 వరకు 160 మంది పిల్లల్ని తీసేశారు. ఈ సమస్య దేశంలో చాలా చోట్ల ఉంది. అయితే రువాండా అధికారులు మతసంబంధ వివక్షను సమర్థవంతంగా ఎదుర్కోగలరని పశ్చిమ ప్రాంతంలోని కరోంగిలో జరిగిన ఈ కేసు నిరూపించింది.

మతసంబంధమైన వివక్ష వల్ల పిల్లల్ని స్కూల్‌ నుండి తీసేశారు

2014, మే 12న 13-20 ఏళ్ల a వయసున్న 8 మంది యెహోవాసాక్షులు, స్కూల్లో జరిగే ఒక మతసంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు గ్రూప్‌ స్కోలేర్‌ ముసాంగో స్కూల్‌ అధికారులు వాళ్లని స్కూల్‌ నుండి తీసేశారు. దాంతో తల్లిదండ్రులు రువాన్కుబా సెక్టర్‌ ఎగ్జిక్యూటివ్‌ సెక్రెటరీకి విషయాన్ని తెలియజేశారు. ఆయన పిల్లల్ని తిరిగి చేర్చుకోమని స్కూల్‌కి నిర్దేశించాడు. కానీ ఆ నిర్ణయం స్కూల్‌ అధికారులకి నచ్చలేదు, దాంతో వాళ్లు ప్లాన్‌ మార్చుకున్నారు. ఆ విద్యార్థులు జాతీయ గీతం పాడడానికి నిరాకరించి దానికి తగిన గౌరవాన్ని చూపించలేదని ఇంకో కొత్త ఆరోపణని వేశారు. స్కూల్లో తిరిగి చేర్చుకున్న రెండు రోజులకు, అంటే 2014, జూన్‌ 4న పోలీసులు స్కూల్‌కి వచ్చి వాళ్లని అరెస్ట్‌ చేశారు.

వాళ్లని 6 రోజుల పాటు పోలీసులు జైల్లో పెట్టారు. పోలీసులు వాళ్లని బెదిరించి, ఇష్టమొచ్చినట్టు తిట్టారు. అందులో అందరికంటే పెద్దవాళైన ఇద్దర్ని, తమకన్నా చిన్నవాళ్ల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నారని చెప్పి బాగా కొట్టారు. ఇంత జరిగినా, ఆ ఎనిమిది మంది తమ మత నమ్మకాల విషయంలో ఏమాత్రం రాజీపడలేదు.

స్కూల్‌ పిల్లలు నిర్దోషులని కోర్టు చెప్పింది

పోలీసులు ఏడుగురు విద్యార్థుల్ని 2014, జూన్‌ 9న విడుదల చేశారు. అందరికంటే చిన్న వయసున్న విద్యార్థిపై ఉన్న కేసుని ప్రాసిక్యూటర్‌ (యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది) కొట్టివేశారు. కానీ, అందరికంటే పెద్ద వయసున్న విద్యార్థిని పోలీసులు ఇంకో 9 రోజుల పాటు జైల్లోనే ఉంచారు. అయితే 2014, అక్టోబరు 14న జరిగే కోర్టు విచారణ వరకు న్యాయ పర్యవేక్షణలో ఉంచుతూ ఆ విద్యార్థిని విడుదల చేయాల్సిందిగా జడ్జి ఆదేశించారు.

విచారణ చేస్తున్నప్పుడు జడ్జి విద్యార్థులందర్నీ ప్రశ్నించారు. ఒక విద్యార్థి అందరి తరఫున మాట్లాడుతూ, తమని స్కూల్లో నుండి తీసేయడానికి అసలు కారణం జాతీయ గీతాన్ని పాడకపోవడం కాదుగానీ, చర్చి పన్నులను కట్టడానికి నిరాకరించడం, స్కూల్లో జరిగే మతసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడమేనని జడ్జికి వివరించడం జరిగింది.

‘జాతీయ గీతానికి తగిన గౌరవం చూపించడం లేదు’ అనే ఆరోపణకు సంబంధించి ఆధారాలేమైనా ఉన్నాయా అని జడ్జి ప్రాసిక్యూటర్‌ని అడిగారు. దానికి సంబంధించి ఇంకా వివరాల్ని రాబట్టడానికి, ప్రాసిక్యూటర్‌ విద్యార్థులను ప్రశ్నించారు. దాంతో విద్యార్థులు జాతీయ గీతాన్ని పాడేటప్పుడు ఏ విధంగానూ అగౌరవం చూపించలేదని స్పష్టంగా రుజువైంది.

2014, నవంబరు 28న ఇంటర్‌మీడియట్‌ కోర్ట్‌ ఆఫ్‌ కరోంగి విడుదల చేసిన రాతపూర్వక తీర్పు, జాతీయ గీతాన్ని పాడడానికి నిరాకరించడం అనేది దాన్ని అగౌరవపర్చినట్టు కాదని చెప్పింది. ఈ కోర్టు తీర్పు దేశచట్టాన్ని సమర్థిస్తూ, పిల్లల్ని నిర్దోషులని నిరూపించింది. రువాండా స్కూల్స్‌ చూపిస్తున్న మతసంబంధ వివక్షకు ముగింపు పలకడానికి ఈ తీర్పు సహాయం చేయవచ్చు.

ప్రాథమిక హక్కుల్ని గౌరవించమని విన్నపం

గ్రూప్‌ స్కోలేర్‌ ముసాంగో స్కూల్‌ విద్యార్థులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వల్ల రువాండాలోని యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే తమ మత నమ్మకాల కారణంగా స్కూల్లో నుండి తీసివేయబడిన కొంతమంది పిల్లలకు వేరే స్కూల్‌ మారడం తప్ప ఇంకో ఉపాయం లేదు. కొంతమందైతే వాళ్ల చదువును ఆపేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజు కట్టేంత స్తోమత వాళ్ల కుటుంబానికి లేదు.

తమ పిల్లలు కూడా మిగతా పిల్లల్లా స్కూల్లో చదువుకోవాలని యెహోవాసాక్షుల తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే మంచి నైపుణ్యాలు పెంచుకోవాలని, సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని అనుకుంటారు. అయితే పిల్లలకున్న మనస్సాక్షి అలాగే మత స్వేచ్ఛా హక్కుల్ని రువాండాలోని అన్నీ స్కూల్స్‌ గౌరవించేలా కరోంగి కోర్టు ఇచ్చిన తీర్పు సహాయం చేస్తుందని యెహోవాసాక్షులు ఆశిస్తున్నారు.

a రువాండాలో 21 సంవత్సరాలు దాటినవాళ్లని మేజర్లుగా పరిగణిస్తారు (సివిల్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 360).